Share News

24 మందికి కన్నీళ్లు మిగిల్చిన ‘ఒక్క నిమిషం’

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:04 AM

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమవగా.. పరీక్ష కేంద్రానికి చేరుకోవడంలో జరిగిన కొద్దిపాటి ఆలస్యం పలువురు విద్యార్థులకు కన్నీళ్లను మిగిల్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18 మంది పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా

24 మందికి కన్నీళ్లు మిగిల్చిన ‘ఒక్క నిమిషం’

ఇంటర్‌ పరీక్షలకు ఆలస్యంగా వెళ్లడంతో అనుమతించని అధికారులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమవగా.. పరీక్ష కేంద్రానికి చేరుకోవడంలో జరిగిన కొద్దిపాటి ఆలస్యం పలువురు విద్యార్థులకు కన్నీళ్లను మిగిల్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18 మంది పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రవాణా సదుపాయం సరిగ్గా లేక కొన్ని చోట్ల.. సెంటర్లు దొరక్క మరికొన్ని చోట్ల విద్యార్థులు ఉరుకులు-పరుగులు పెట్టడం కనిపించింది. మాడ్గులపల్లికి చెందిన ఓ విద్యార్థి.. బస్సు ఆలస్యమైనా పరుగున కేంద్రానికి చేరుకున్నానని, అయినా.. తనను అనుమతించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. హాలియా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ముగ్గురు విద్యార్థినులు సెంటర్‌ వద్దే ఏడుస్తూ.. ‘‘మమ్మల్ని లోనికి పంపండి’’ అని పోలీసులను వేడుకోవడం కనిపించింది. నాగార్జున సాగర్‌ జూనియర్‌ కాలేజీ వద్ద కూడా ఐదుగురు విద్యార్థులకు ఈ నిబంధన అడ్డంకిగా మారింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన పావని అనే విద్యార్థిని కూడా 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో.. పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. ఆమె దీనంగా రోధిస్తూ.. వెనుదిరగడం అక్కడి వారిని కలిచివేసింది. వికారాబాద్‌ జిల్లాలోనూ ఐదుగురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారంటూ.. పరీక్షలకు అనుమతించలేదు. దీంతో.. ‘ఆలస్యం’ నిబంధనను ఎత్తివేయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సెకండ్‌ ల్యాంగ్వేజీ పేపర్‌-1 పరీక్షకు 5,07,754 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 19,641(3.86ు) మంది గైర్హాజరయ్యారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, జనగామ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 3 మాల్‌ప్రాక్టిస్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సీఎం రేవంత్‌ ‘ఆల్‌ ద బెస్ట్‌’ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

Updated Date - Feb 29 , 2024 | 05:04 AM