Share News

అక్రమబద్ధీకరణపై విచారణ

ABN , Publish Date - Jan 11 , 2024 | 04:10 AM

రాజధాని హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో.. ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకొని ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని అక్రమబద్ధీకరించడంపై ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అక్రమబద్ధీకరణపై విచారణ

కలెక్టర్‌ ఆదేశం.. నానక్‌రామ్‌గూడలో అధికారుల భూపరిశీలన

‘ఆంధ్రజ్యోతి’లో ‘భూంఫట్‌ స్వాహా’ కథనంతో సంచలనం

రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన భూదందా

కన్వేయన్స్‌ డీడ్‌ల సీజ్‌.. గోపన్‌పల్లిలో నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో.. ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకొని ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని అక్రమబద్ధీకరించడంపై ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. రూ.750 కోట్ల విలువ చేసే ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం 15 మందికి జీవో 59 కింద అక్రమంగా క్రమబద్ధీకరిస్తూ గత ప్రభుత్వం హయాంలో జరిగిన దందాపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘భూంఫట్‌ స్వాహా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కథనంపైస్పందించిన రంగారెడ్డి కలెక్టర్‌ శశాంక్‌.. అధికారులను ఆరా తీశారు. సర్వే నెంబర్‌ 149కి సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల నేపథ్యంలో రాజేంద్రనగర్‌ ఆర్డీవో ఈ.మల్లయ్య.. సిబ్బందితోసహా వెళ్లి నానక్‌రాంగూడలోని సర్వే నంబర్‌ 149లోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలమంతా పూర్తి ఖాళీగా కనిపిస్తుండడంతో.. ఈ స్థలాన్ని జీవో 59కింద ఏవిధంగా క్రమబద్ధీకరణ చేశారో అంటూ ఆశ్చర్యపోయారు. శేరిలింగంపల్లిలో కన్వెయన్స్‌ డీడ్‌లను పూర్తిగా సీజ్‌ చేశామని తెలిపారు. గోపన్‌పల్లిలో జర్నలిస్టు కాలనీని ఆనుకొని ఉన్న సర్వే నంబర్‌ 74లో కూడా కన్వెయన్స్‌ డీడ్‌లను సీజ్‌ చేశామని, ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన బ్లూ షీట్‌లను కూడా తొలగిస్తున్నామని తెలిపారు. కాగా.. బుధవారం గండిపేట తహసీల్దార్‌ను రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు పిలిపించినట్లు తెలిసింది. అలాగే.. శేరిలింగంపల్లి తహసీల్దార్‌పై ఇప్పటికే వేటు వేసి కలెక్టరేట్‌కు అటాచ్‌ చేశారు. హైదరాబాద్‌ మహా నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, గండిపేట,రాజేంద్రనగర్‌ మండలాల పరిధిలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములున్నాయి. జీవో 59ని వాడుకుని ఆ భూములను దక్కించుకోవడానికి కొందరు అక్రమార్కులు ప్రణాళిక రచించారు. గత ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రితో పాటు ఓ ఎమ్మెల్యే అండదండలతో.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారు. ఆ వెంటనే ప్రముఖ నిర్మాణ సంస్థలకు గంపగుత్తగా అగ్రిమెంట్‌ సేల్‌ జీపీఏ చేసేశారు. గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 74లో జర్నలిస్టు కాలనీకి ఆనుకొని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని కూడా కొందరు వ్యక్తులు అక్రమంగా క్రమబద్ధీకరించుకోవడంపై డిసెంబర్‌ 11న ‘ఫలితాలకు ముందు భూమేత’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో అప్పట్లోనే దానిపై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. అప్పట్నుంచీ 59 జీవో కింద జరిగిన క్రమబద్ధీకరణలపై విచారణ ప్రక్రియ సాగుతోంది. తాజాగా వెలుగు చూసిన దందాపైన కూడా విచారణ జరిపి.. ఈ రెండు, మూడు రోజుల్లోనే విచారణ తుది నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నట్లు సమాచారం.

వారి ప్రమేయం ఉందా?

శేరిలింగంపల్లిలో విలువైన ప్రభుత్వ భూములను జీవో 59 కింద కొందరు వ్యక్తులకు ఎకరాలకు ఎకరాలు క్రమబద్ధీకరణ చేయడం వెనుక అప్పటి కలెక్టర్‌, రెవెన్యూ స్థాయిలో ఉన్నతాధికారుల ప్రమేయమున్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలోని తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లు, ఆర్‌ఐలు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎంత ఒత్తిడి చేసినా.. ఏ నిర్మాణాలూ లేని ప్రభుత్వ భూములను 59 కింద ఎలా క్రమబద్ధీకరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఆ జీవో కింద క్రమబద్ధీకరణకు ఎవరైనా దరఖాస్తు చేస్తే, సదరు స్థలాన్ని స్థానిక తహసీల్దార్‌తో పాటు పక్క మండలానికి చెందిన మరో తహసీల్దార్‌ ఉమ్మడిగా సర్వే చేసి ఉన్నతాధికారికి నివేదిక ఇవ్వాలి. ఈ క్రమంలోనే.. శేరిలింగంపల్లి మండలం పరిధిలో 59 జీవో కింద విలువైన స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి స్థానిక తహసీల్దార్‌తో పాటు గండిపేట మండలానికి చెందిన తహసీల్దార్‌తో కూడిన అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారికి నివేదికను అందించింది. 2014లో 58, 59 జీవో దరఖాస్తులకు సంబంధించి తహసీల్దార్లతో కూడిన అధికారుల బృందం నిర్ధారించిన తర్వాత.. ఆర్డీవో స్థాయిలోనే క్లియరెన్స్‌ ఉండేది. కానీ 2020 తర్వాత 58, 59 దరఖాస్తులను తహసీల్దార్లతో కూడిన అధికారుల బృందం నిర్ధారించాక.. ఆయా దరఖాస్తులు నేరుగా కలెక్టర్‌ లాగిన్‌కు వెళ్తున్నాయి. నిర్ణయాధికారం కలెక్టర్‌దే. ఈ నేపథ్యంలోనే.. శేరిలింగంపల్లి మండలంలోని గోపనపల్లి, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, రాయదుర్గంపాన్‌మక్తా, రాయదుర్గం నౌకలాసా, కొండాపూర్‌, కొత్తగూడ, గుట్టలబేగంపేట, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, చందానగర్‌, గపూర్‌నగర్‌, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములను అక్రమార్కులకు కట్టబెట్టడానికి శేరిలింగంపల్లి, గండిపేట తహసీల్దార్ల బృందం అనుకూలమైన నివేదికను అందించారా? లేక అనుకూలంగా ఇచ్చేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమబద్ధీకరణకు అప్పటి కలెక్టర్‌ ఎలా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు? కలెక్టర్‌కు తెలియకుండానే వేల కోట్ల విలువైన భూములు పరాధీనమయ్యాయా? అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే అదనపు కలెక్టర్‌తో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.

Updated Date - Jan 11 , 2024 | 04:10 AM