Share News

దిద్దుబాటు చర్యలకు శ్రీకారం!

ABN , Publish Date - Jan 18 , 2024 | 05:09 AM

ఘట్‌కేసర్‌ మండలంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) నిర్మాణం కోసం సేకరించిన భూముల ఆక్రమణలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

దిద్దుబాటు చర్యలకు శ్రీకారం!

ఔటర్‌ భూముల ఆక్రమణలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలకు స్పందన

ఘట్‌కేసర్‌, జనవరి 17: ఘట్‌కేసర్‌ మండలంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) నిర్మాణం కోసం సేకరించిన భూముల ఆక్రమణలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ భూ ఆక్రమణలపై ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల ప్రచురితమైన ‘దోస్త్‌కు సర్వీస్‌, ఔటర్‌లో చీటర్స్‌, మృతుడి పేర పట్టాదారు పాసుపుస్తకాలు’ వంటి వరుస ప్రత్యేక కథనాలకు స్పందించి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ బుధవారం పలు మండలాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓఆర్‌ఆర్‌ కోసం సేకరించిన భూమి ఎంత ? ఆ భూమి వివరాలు ధరణిలో నమోదయ్యాయా? అనే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. హెచ్‌ఎండీఏ సేకరించిన భూమి వివరాలను పరిశీలించి ఎక్కడైనా ధరణిలో నమోదు కాకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. భూములు కోల్పోయిన వారు పరిహారం తీసుకోకుండా కోర్టులో డిపాజిట్‌ అయిన వారి వివరాలను కూడా ధరణిలో పొందుపర్చాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలు రికార్డుల్లో ఉండాలని స్పష్టం చేశారు. కాగా, ఘట్‌కేసర్‌ మండలం పడమటిసాయిగూడలో 7.30ఎకరాల భూమిని ఔటర్‌ కోసం సేకరించగా పరిహారం కూడా చెల్లించారు. అయినా అందులో 5.08ఎకరాలకు మృతి చెందిన వ్యక్తి పేర పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించచినన అధికారులు మృతుడి పేర జారీ అయిన పట్టాదారు పేరున ఉన్న భూమిని ధరణి పోర్టల్‌లో ఔటర్‌ భూమి అని రికార్డులు సవరించారు.

Updated Date - Jan 18 , 2024 | 11:09 AM