Share News

ప్రపంచ క్యాన్సర్‌ రాజధాని భారత్‌!

ABN , Publish Date - Apr 05 , 2024 | 04:04 AM

క్యాన్సర్‌, మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, హృద్రోగం, మానసిక సమస్యల వంటి అసాంక్రమిక వ్యాధులు దేశంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.

ప్రపంచ క్యాన్సర్‌ రాజధాని భారత్‌!

దేశంలో పెరుగుతున్న కేసులు.. చిన్న వయసు వారిలోనూ అధికం

ఆరోగ్యాన్ని హరిస్తున్న మధుమేహం, గుండెజబ్బులు, స్థూలకాయం

ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు, నివారణ చర్యలతోనే రక్షణ

వెల్లడించిన అపోలో ‘హెల్త్‌ ఆఫ్‌ ది నేషన్‌’ నివేదిక

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌, మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, హృద్రోగం, మానసిక సమస్యల వంటి అసాంక్రమిక వ్యాధులు దేశంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచానికి క్యాన్సర్‌ రాజధానిగా భారత్‌ తయారైందా అన్న స్థాయిలో పరిస్థితి ఉంది. ‘హెల్త్‌ ఆఫ్‌ ది నేషన్‌’ (భారతదేశ ఆరోగ్యం) పేరుతో అపోలో హాస్పిటల్స్‌ గురువారం విడుదల చేసిన నాలుగో వార్షిక నివేదికలో ఈ వివరాలున్నాయి. పలు అసాంక్రమిక వ్యాధులు చిన్న వయసు వారిలో తలెత్తటం ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని, దీనిని నివారించటానికి తక్షణం చర్యలు చేపట్టాలని సూచించింది. క్యాన్సర్‌ విషయంలో కూడా ఇది కనిపిస్తోందని, ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సగటు వయసు తక్కువగా ఉంటోందని తెలిపింది. రొమ్ము, గర్భాశయం, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, అయినప్పటికీ, క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవటం భారత్‌లో చాలా తక్కువగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. స్థూలకాయం కూడా భారతీయుల్లో పెరిగిపోతోందని, ఇది పలు అసాంక్రమిక వ్యాధులకు కారణమవుతోందని తెలిపింది. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ల ముప్పును పలువురు భారతీయులు ఎదుర్కొంటున్నారని, యువతలో మానసిక సమస్యలు ముఖ్యంగా కుంగుబాటు (డిప్రెషన్‌) అధికంగా కనిపిస్తోందని వెల్లడించింది.

దీనిపై అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చెయిర్‌పర్సన్‌ డాక్టర్‌ ప్రీతా రెడ్డి స్పందిస్తూ.. అసాంక్రమిక వ్యాధులను ఎదుర్కోవటానికి తక్షణం సమష్టి కార్యాచరణ అవసరమన్నారు. ప్రజల్లో అవగాహన పెంచటంతోపాటు వ్యక్తిగత స్థాయిలో చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. ఆ సంస్థ ప్రెసిడెంట్‌, సీఈఓ డాక్టర్‌ మధు శశిధర్‌.. వైద్య చికిత్సలకు సంబంధించి మరిన్ని ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని, వాటిని ప్రజల వద్దకు విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు అపోలో ‘ప్రో హెల్త్‌ స్కోర్‌’ పేరుతో దేశంలోనే తొలి డిజిటల్‌ ఆరోగ్య మదింపు టూల్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఎవరికి వారు తమ ఆరోగ్యంపై ఒక అంచనాకు వచ్చి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టటానికి అవకాశం లభిస్తుందని అపోలో హాస్పిటల్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. అసాంక్రమిక వ్యాధులు భారతదేశ ఆర్థికవ్యవస్థకు రూ.లక్షల కోట్ల మేర నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచటానికి ఈ టూల్‌ ఎంతో ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Updated Date - Apr 05 , 2024 | 04:04 AM