Share News

విలీన గ్రామాల్లో.. నిలిచిన రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:48 PM

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో.. మునిసిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు చెందిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. డీడీలు చెల్లించి, స్లాట్లు బుక్‌ చేసుకున్న కొనుగోలుదారులు రిజిస్టేషన్ల కోసం సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ.. రిక్తహస్తాలతో వెనక్కి మళ్లుతున్నారు.

విలీన గ్రామాల్లో.. నిలిచిన రిజిస్ట్రేషన్లు

అయిదు రోజులుగా ఇదే పరిస్థితి

పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయని ఐటీ శాఖ

సర్వర్‌ డౌన్‌ అంటున్న సబ్‌-రిజిస్ట్రార్లు

మేడ్చల్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో.. మునిసిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు చెందిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. డీడీలు చెల్లించి, స్లాట్లు బుక్‌ చేసుకున్న కొనుగోలుదారులు రిజిస్టేషన్ల కోసం సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ.. రిక్తహస్తాలతో వెనక్కి మళ్లుతున్నారు. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ లేఅవుట్లు అధికంగా ఉన్న గ్రామాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. జిల్లాలో.. 28 గ్రామాలను సమీప మునిసిపాలిటీల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే..! ఈ మేరకు ఐటీ శాఖ పరిపాలన పరమైన అన్ని శాఖల వెబ్‌సైట్లను అప్‌డేట్‌ చేస్తుంది. అయితే.. రాష్ట్ర ఖజానాకు కీలక ఆదాయ వనరుల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ల శాఖ విషయంలో మెతకవైఖరి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్‌-రిజిస్ట్రార్లకు స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో.. కొన్ని వందల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. విలీన గ్రామాల వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయలేదని సమాచారం. డీడీల చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియలు యథావిధిగా సాగుతున్నా.. రిజిస్ట్రేషన్‌ విషయంలో ‘సర్వర్‌ ఎర్రర్‌’గా చూపుతోందని సబ్‌-రిజిస్ట్రార్లు చెబుతున్నారు. పోర్టల్‌లో మార్పులు చేయాల్సి ఉన్నందునే.. రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఐదు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని జిల్లా రిజిస్ట్రార్‌ చెబుతున్నారు.

దిక్కుతోచని స్థితిలో రియల్టర్లు

విలీన గ్రామాలు రింగ్‌రోడ్డు పరిసరాల్లో ఉన్నందున ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున హెచ్‌ఎండీఏ వెంచర్లు ఉన్నాయి. ఈ వెంచర్లకు సంబంధించి.. కొనుగోలుదారులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కాక పోవటంతో రియల్టర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఘట్‌కేసర్‌, కీసర, శామీర్‌పేట, మేడ్చల్‌ ఎస్‌ఆర్‌వో పరిధిలో ఐదు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో.. రియల్టర్లు తలలు పట్టుకుంటున్నారు. కనీసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎప్పుడు పునరుద్దరిస్తారనేదానిపై సబ్‌-రిజిస్ట్రార్ల వద్ద కూడా సమాచారం లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:48 PM