Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

భూదాన భూముల్లో.. కాలనాగులు

ABN , Publish Date - Mar 03 , 2024 | 03:35 AM

దాతలు దానం చేసిన భూదాన భూములు.. బడా బాబుల పాలయ్యాయి. భూదాన బోర్డు అధీనంలో ఉండాల్సినవి కొందరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.

భూదాన భూముల్లో.. కాలనాగులు

వట్టినాగులపల్లిలో 29.27 ఎకరాలు మాయం

ధరణి ముసుగులో రూ.2 వేల కోట్ల విలువైన భూములు బడా నేతల పేర్ల మీద రిజిస్ట్రేషన్‌

రిజిస్ట్రేషన్‌ చేయరాదంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశాలిచ్చినా పట్టించుకోని రెవెన్యూ శాఖ

కొనుగోలుదారుల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. నిబంధనలకు విరుద్ధంగా పెద్దల పేరిట నమోదు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): దాతలు దానం చేసిన భూదాన భూములు.. బడా బాబుల పాలయ్యాయి. భూదాన బోర్డు అధీనంలో ఉండాల్సినవి కొందరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. క్రయ విక్రయాలు జరపడానికి ఏమాత్రం వీల్లేదనే నిబంధన ఉన్నా, నిషేధిత జాబితాలోనూ ఉన్నా, హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నా.. అక్రమార్కులకు ఇవేవీ అడ్డురాలేదు. అప్పటి ప్రభుత్వ అండదండలతో అఽధికారులను లొంగదీసుకుని కోట్లాది రూపాయల విలువైన భూములను అడ్డదారిలో తమ సొంతం చేసుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హైదరాబాద్‌ నగరంలోని వట్టినాగులపల్లి భూదాన భూముల వ్యవహారంలో ఇలా తవ్వేకొద్దీ భూ కుంభకోణాలు బయటపడుతున్నాయి.

వట్టినాగులపల్లిలో ధరణిని బూచిగా చూపించి సాఫ్ట్‌వేర్‌ అసోసియేట్స్‌ మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి చెందిన భూములతోపాటు భూదాన భూములను స్వాహా చేసిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ‘ధరణి బూచితో భూమి స్వాహా’ శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ సోదరుడు బోయినపల్లి శ్రీనివాసరావు పేరిట ఆగమేఘాలపై జరిగిన ఈ భూముల రిజిస్ట్రేషన్‌ వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బట్టబయలు చేయడం కలకలం రేకెత్తించింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా పరిశీలన జరపగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూములతోపాటు పక్కనే ఉన్న మిగతా భూదాన భూములను కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొల్లగొట్టిన వ్యవహారం బయటపడింది. వట్టినాగులపల్లిలో మొత్తం ఆరు సర్వే నంబర్లలోని 29.27 ఎకరాల భూదాన భూములు ఎన్నికలకు ముందు పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు తేలింది. రాజకీయ బలానికి అధికారం తోడు కావడంతో గుట్టుచప్ప్డుడు కాకుండానే ఈ వ్యవహారం జరిగినట్లు వెల్లడైంది. ఇందులో అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన అనేకమంది నేతలు ఉండడం గమనార్హం. వట్టినాగులపల్లిలో వారు కొల్లగొట్టిన భూదాన భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2 వేల కోట్లకు పైగానే ఉంటుంది. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్లు 186, 187, 188, 189లో మొత్తం 56 ఎకరాల భూమి ఉంది.

ఇందులో 29.27 ఎకరాల భూమిని గతంలో భూ యజమానులు రాజనగరి మల్లారెడ్డి, మరో ఏడుగురు భూదానం చేశారు. భూదాన బోర్డులో వీటికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. కొన్నాళ్లపాటు ఎవరూ ఈ భూముల జోలికి రాలేదు. కానీ, హైదరాబాద్‌ శివార్లలో భూముల ధరలు పెరగడంతో కొందరి కళ్లు వీటిపై పడ్డాయి. 2000 సంవత్సరం తరువాత ఇందులో క్రయ విక్రయాలు మొదలయ్యాయి. దీనిపై భూదాన బోర్డు అభ్యంతరం తెలుపుతూ అప్పటి సీసీఎల్‌ఏకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ భూములన్నింటినీ విభజన చేసి 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారు. కానీ, తరువాతి కాలంలో ఈ భూముల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడంతో బడా వ్యక్తులంతా వీటిపై పడ్డారు. అఽధికారులను లొంగదీసుకుని, అప్పటికే భూమి స్వాధీనంలో ఉన్నవారిని ధరణి పేరుతో భయపెట్టి, అక్కడి నుంచి వెళ్లగొట్టి అత్యంత విలువైన భూములను దొడ్డిదారిన సొంతం చేసుకున్నారు. ప్రధానంగా ధరణి వచ్చిన తరువాతే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే 29.27 ఎకరాల భూము లు పెద్దల పేరుమీదికి మారిపోయాయి. దొడ్డిదారిన భూదాన భూములను చేజిక్కించుకున్న వారిలో బోయినపల్లి శ్రీనివాసరావు ఉన్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే వెలుగులోకి తీసుకురాగా.. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు కూడా బయటపడిం ది. రాజేశ్వర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరుమీద నాలుగెకరాల భూములు ఉన్నట్లు వెల్లడైంది. మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కూడా తన బినామీల పేరిట భూదాన భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తేలింది.

అప్పట్లోనే అమ్మకాలకు యత్నం..

వాస్తవానికి 2006 జూన్‌ 12న భూదాన బోర్డు 186, 187, 188, 189 సర్వే నంబర్లలోని 29.27 ఎకరాల భూమిని 60 మందికి పంపిణీ చేసింది. వీరంతా భూమిలేని పేదలంటూ ఒక్కొక్కరికి 20 గుంటల చొప్పున 60 మందికి పట్టాలు ఇచ్చింది. కానీ, ఇందులో అప్పటి భూదాన బోర్డు కార్యవర్గ సభ్యుల సమీప బంధువులు, వారి వద్ద పనిచేసే వారే ఉన్నారు. తరువాత.. ఈ భూమికి పట్టాలు పొందినవారు భూ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అప్పటి రాజేంద్రనగర్‌ ఆర్డీవో ఆమోదం తెలుపుతూ 2007 ఫిబ్రవరి 15న ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. తరువాత వీరంతా కలిసి ఈ భూములను అమ్మేందుకు అప్పటి భూదాన బోర్డు సభ్యుడికి 2007 నవంబరు 5న జీపీఏ చేశారు. దీంతో ఆ బోర్డు సభ్యుడు మొత్తం 29.27 ఎకరాలను ఓ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీకి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో వెంటనే రెవెన్యూ అధికారులు విచారణ జరిపి దొడ్డిదారిన జరుగుతున్న విక్రయాలను అడ్డుకున్నారు. అంతేకాకుండా.. 60 మందికి ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేశారు. కానీ, ఆ తరువాత భూదాన భూములను గాలికి వదిలేయడంతో వాటిని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అమ్మేసుకుంటూ వచ్చారు. దీంతో క్రయ విక్రయాలను అడ్డుకునేందుకు కొందరు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. 2007లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో భూదాన భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారు. మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో.. ఆ భూముల్లో క్రయ విక్రయాలు జరపొద్దంటూ రెవెన్యూ అధికారులకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో ఇంకా వివాదాలు నడుస్తున్నా భూదాన భూములు దొడ్డిదారిన చేతులు మారుతూనే వస్తున్నాయి. ఈ భూములు ఉన్న సర్వే నంబర్లలో ఇప్పటివరకు కొన్ని వందల రిజిస్ట్రేషన్లు జరిగాయి. బడా వ్యక్తులంతా అఽధికార, అంగబలంతో రూ.వందల కోట్ల విలువైన భూములను స్వాహా చేశారు. వీరికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు సహకరించారు.

2021లో మరోసారి నిషేధిత జాబితాలో..

వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్లు 186, 187, 188, 189లోని 29.27 ఎకరాల భూదాన భూముల క్రయ విక్రయాలను నిలిపివేస్తూ 2021 జూన్‌ 10న జిల్లా కలెక్టర్‌ మరోసారి 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టారు. సర్వే నంబరు 186ఏలో 0.30 ఎకరాలు, 186ఏఏలో 1.00 ఎకరా, 186ఇలో 1.00 ఎకరా., 186ఆఆలో 3.00 ఎకరాలు, 186యూలో 2.03 ఎకరాలు, 186యూయూ1లో 2.09 ఎకరాలు, 187లో 4.18 ఎకరాలు, 188లో 8.16 ఎకరాలు, 189ఏలో 3.15 ఎకరాలు, 189ఇ2లో 3.15 ఎకరాలు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ వద్ద ఈ జాబితా ఉన్నప్పటికీ ధరణి ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసే తహసీల్దార్‌ కార్యాలయంలో ఇవేమీ పట్టించుకోకుండానే భూముల రిజిస్ట్రేషన్‌ జరిగింది. మరోవైపు 187, 188 సర్వే నంబర్లలోని భూదాన భూముల విషయంలో కొందరు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ (34504/2023) దాఖలు చేశారు. దొడ్డిదారిన అమ్మిన భూముల క్రయ విక్రయాలు నిలిపి వేయాలని కోరారు. దీంతో అప్పటివరకు జరిగిన విక్రయాలు నిలిపివేయాలని, తదుపరి కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని గతేడాది డిసెంబరు 21న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల తరువాత పక్క సర్వే నంబర్లలోని భూదాన భూములకు రిజిస్ట్రేషన్లు చేసి పట్టాదారు పాస్‌బుక్‌లు జారీ చేశారు. ఇలా బోయినపల్లి శ్రీనివా్‌సరావుకు భూదాన భూములతోపాటు సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌ హౌసింగ్‌ సొసైటీ భూములు 8.07 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయడం గమనార్హం.

Updated Date - Mar 03 , 2024 | 03:35 AM