Share News

ప్లాస్టిక్‌ పరిశ్రమ ప్రమాదంలో రూ. 5కోట్ల ఆస్తినష్టం

ABN , Publish Date - May 25 , 2024 | 11:47 PM

మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ హార్డ్‌వేర్‌ పార్కులోని శ్రీనాథ్‌ ఓవెన్‌ పరిశ్రమలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ. ఐదు కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

ప్లాస్టిక్‌ పరిశ్రమ ప్రమాదంలో రూ. 5కోట్ల ఆస్తినష్టం
తుక్కుగూడ హార్డ్‌వేర్‌ పార్కులో కాలి బూడిదైన పరిశ్రమ

కెమికల్‌ లీక్‌, షాట్‌ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయంటున్న పరిశ్రమ యాజమాన్యం

ప్రమాదస్థలాన్ని సందర్శించిన అధికారులు

మహేశ్వరం, మే 25 : మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ హార్డ్‌వేర్‌ పార్కులోని శ్రీనాథ్‌ ఓవెన్‌ పరిశ్రమలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ. ఐదు కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. శనివారం రెవెన్యూ, మున్సిపల్‌, పోలీస్‌, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రమాదానికి గురైన పరిశ్రమను సందర్శించారు. ప్రమాద వివరాలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కెమికల్‌ లీక్‌తో పాటు షాట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం కాలి బూడిదైందని పరిశ్రమ యాజమాన్యం అధికారులకు వివరించారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం స్థానికులను, పరిశ్రమలోని కార్మికులను తీవ్ర భయబ్రాంతుకుల గురి చేసింది. అగ్నిప్రమాద సమయంలో పరిశ్రమలో సుమారు 50మంది కార్మికులున్నట్లు పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. ప్రమాద విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది కార్మికులను పరిశ్రమలోంచి బయటకు పంపారు. ఈ పరిశ్రమలో నెలకొన్న మంటలను అదుపు చేసేందుకు 8 ఫైౖర్‌ ఇంజన్‌లతో శుక్రవారం రాత్రినుంచి ప్రయత్నించినా శనివారం ఉదయం వరకు మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగకున్నా రూ. 5 కోట్లు ఆస్తి నష్టం సంబవించినట్లు పరిశ్రమ డైరెక్టర్‌ రఘు శనివారం ఉదయం పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పరిశ్రమ డైరెక్టర్‌ రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పహడీషరీఫ్‌ పోలీసులు పరిశ్రమలో మంటలు ఎలా చెలరేగాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పరిశ్రమ నష్టాల్లో ఉండడంతో ఇన్సూరెన్స్‌ కోసం పరిశ్రమ యాజమాన్యమే పరిశ్రమకు నిప్పంటించినట్టు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - May 25 , 2024 | 11:47 PM