Share News

చెరలో.. దారి పై కదలిక

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:08 PM

‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన ‘చెరలో..దారి’ ప్రత్యేక కథనంపై జాతీయ రహదారుల శాఖ, మున్సిపల్‌ అధికారులు స్పందించారు.

 చెరలో.. దారి పై కదలిక
ఘట్‌కేసర్‌లో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ ఫిల్లర్‌ను తొలగిస్తున్న అధికారులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

ఘట్‌కేసర్‌లో అక్రమ హోర్డింగ్‌ల తొలగింపు

ఘట్‌కేసర్‌, జనవరి 30: ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన ‘చెరలో..దారి’ ప్రత్యేక కథనంపై జాతీయ రహదారుల శాఖ, మున్సిపల్‌ అధికారులు స్పందించారు. జాతీయ రహదారిపై వెహికల్‌ అండర్‌పాస్‌ (వీయూపీ) వద్ద రోడ్డు వెడల్పుకోసం 1.14ఎకరాలు స్థలాన్ని సేకరించిన విషయం తెలిసిందే. స్థలం సేకరించి భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించి ఎళు ్లగడుస్తున్నప్పటికీ అధికారులు ఈస్థలాన్ని స్వాధీనం చేసుకోక పోవడంతో యజమానులే అనుభవిస్తున్నారు. దుకాణసముదాయాలను అద్దెకు ఇస్తూ లబ్ధ్దిపొందుతున్న విషయాన్ని, ఘట్‌కేసర్‌లోని జాతీయ రహదారి స్థలంలో, అటు హెచ్‌ఎండీఏ సేకరించిన ఔటర్‌ స్థలాల్లో ఆక్రమంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్న విషయాలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అండర్‌పాస్‌ వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ను జాతీయ రహదారుల శాఖ, మున్సిపల్‌ అధికారులు తొలగించారు. స్థానిక యంనంపేట్‌ చౌరస్తా వద్ద హెచ్‌ఎండీఏ సేకరించిన స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను తొలగించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. భారీ క్రేన్‌తో వచ్చిన అధికారులు హోర్డింగ్‌లకు కట్టిన ప్లెక్సీలను తీసివేశారు. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండటం వలన హోర్డింగ్‌లను తీయడం కష్టంగా మారడంతో తాత్కలికంగా వాయిదా వేశారు.

సామగ్రిని స్వాధీనం చేసుకోని అధికారులు

ఘట్‌కేసర్‌లోని జాతీయ రహదారి స్థలంతో పాటు పలు చోట్ల ఆక్రమంగా నిర్మించిన హోర్డింగ్‌లను అధికార కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే పీఏ బంధువు, ఘట్‌కేసర్‌ స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు పవన్‌ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. హోర్డింగ్‌ సామగ్రిని అధికారులు స్వాధీనం చేకుకోకపోవడానికి పీఏ అండదండలే కారణమని జోరుగా చర్చ జరుగుతున్నది. ఇప్పటికైన ప్రభుత్వ ఘట్‌కేసర్‌ పట్టణంలో జాతీయ రహదారి, హెచ్‌ఎండీ, రోడ్లు, భవనాల శాఖల స్థలాల్లో ఎలాంటి అనుమతలు లేకుండానే పెద్దఎత్తున ఏర్పాటు చేసిన హోర్డింగుల నిర్మాణంపై అవినీతి నిరోధకశాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆశాఖ అధికారులు ఇక్కడ జరిగిన అవినీతిపై ఆరా తీసినట్లు సమాచారం. ఆయా శాఖల అధికారులపై ఏ క్షణమైనా ఏసీబీ దాడులు జరుగోచ్చానే చర్చ జరుగుతుంది.

మర్రిపల్లిగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఘట్‌కేసర్‌ రూరల్‌ : ఈనెల 25న ‘జోరుగా అనుమతి లేని నిర్మాణాలు’‘ అని ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పంచాయతీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈక్రమంలో మంగళవారం మర్రిపల్లిగూడలోని ఆక్రమనిర్మాణాలను కూల్చివేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి సిబ్బందితో వెళ్లి ఎక్స్‌కవేటర్‌ సాయంతో మూడు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

Updated Date - Jan 30 , 2024 | 11:08 PM