Share News

సంగీతం హోరు.. విన్యాసాల జోరు

ABN , Publish Date - Jan 21 , 2024 | 03:09 AM

విమానాల విన్యాసాలు.. శివమణి డ్రమ్స్‌ మోతలు.. లోహ విహంగాల గురించి తెలియని ఎన్నో వింతలు.. వింగ్స్‌ ఇండియా ఎయిర్‌ షో-2024కు వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

సంగీతం హోరు.. విన్యాసాల జోరు

ఎయిర్‌ షోలో ఆకట్టుకున్న విమానాల ప్రదర్శన

శ్రోతలను ఉర్రూతలూగించిన శివమణి మ్యూజిక్‌

వింగ్స్‌ ఇండియా ఎయిర్‌ షోలో సందర్శకుల సందడి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): విమానాల విన్యాసాలు.. శివమణి డ్రమ్స్‌ మోతలు.. లోహ విహంగాల గురించి తెలియని ఎన్నో వింతలు.. వింగ్స్‌ ఇండియా ఎయిర్‌ షో-2024కు వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఎయిర్‌ షోలో మూడో రోజు సామాన్యులకు ప్రవేశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. చార్టర్‌ విమానాలను అద్దెకు ఇచ్చే సంస్థలు.. నిర్వహణ, శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. విమానాల వద్ద సెల్ఫీలు దిగి సంబరపడ్డారు.

మోతెక్కించిన శివమణి సంగీతం..

భిన్న వాయిద్య పరికరాలు, విభిన్న రీతులలో పెర్క్యూషనిస్ట్‌ శివమణి పలికించిన సంగీతం నగరవాసులను మరో లోకంలో తేలియాడించింది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఆవిష్కరిస్తున్న టెయిల్‌ ఆర్ట్‌ డిజైన్లలో 9వది అయిన కలంకారీని హైదరాబాద్‌లో సందర్శకులకు చూపడంలో భాగంగా బోయింగ్‌ 737-8 విమానాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విమానం బ్యాక్‌గ్రౌండ్‌గా శివమణి సంగీతం వినిపించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఆకాశంలో రివ్వున ఎగిరి, పొగలు కక్కుతూ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సారంగ్‌ బృందం తమ హెలికాప్టర్లతో లవ్‌ సింబల్స్‌ వేసి నగరవాసుల పట్ల ప్రేమను వ్యక్తీకరించింది. పదేళ్లగా ప్రతి ఏవియేషన్‌ షోలో ప్రత్యేకను చాటుకుంటున్న మార్క్‌ జెఫ్రీస్‌ బృందం ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో కను విందు చేసింది.

అందుబాటులో చార్టర్‌ సేవలు..

బైకులు, కార్లు అద్దెకు ఇచ్చిన విధంగానే చార్టర్డ్‌ ఫ్లైట్‌లు, చాపర్‌లు అందుబాటులోకి తెచ్చామని ప్లెక్సెస్‌ సంస్థ నిర్వాహకులు షాద్‌ ఎ సయీద్‌ తెలిపారు. నగరానికి చెందిన సయీద్‌.. ప్లెక్సెస్‌ పేరుతో ముంబైలో విమాన సేవల సంస్థను ప్రారంభించారు. దూరం, సమయం, సీజన్‌ను బట్టి అద్దె చార్జీలు మారుతుంటాయని సయీద్‌ తెలిపారు. నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో జాయ్‌ రైడ్స్‌ ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు చెన్నైకి చెందిన ఏరోడాన్‌ చాపర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వాహకులు. విమాన ఇంజన్‌, ఇతర యంత్రాల్లో లోపాలను గుర్తించేందుకు ఢిల్లీకి చెందిన ఐటీ కాన్సెప్ట్‌ సంస్థ ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేసింది. యంత్రాల లోపల ఎంత భాగం చెడిపోయింది, రిపేర్‌ చేయాలా లేక మార్చాలా అన్నది ఈ యంత్రం ద్వారా ధ్రువీకరించవచ్చు. ఈ స్పై కెమెరా తరహా పరికరాన్ని విమానయాన రంగం, ప్రొడక్షన్‌, ఆటోమొబైల్‌ రంగాలతోపాటు పోలీస్‌, ఇంటెలిజెన్స్‌ రంగాల వారు కొనుగోలు చేస్తున్నారని సంస్థ ప్రతినిధి అరవింద్‌ కుమార్‌ తెలిపారు.

పైలట్‌ శిక్షణ కోసం ఎంవోయూ..

పైలట్‌ శిక్షణకు సహకారమందించేందుకు నగరానికి చెందిన ఏవియేషన్‌ శిక్షణ సంస్థ ఆర్బిట్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, ఆస్ట్రియాకు చెందిన ఎఎమ్‌ఎ్‌సటీ ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు సంస్థల ప్రతినిధులు ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా ఎఎమ్‌ఎ్‌సటీ ఏవియేషన్‌ పైలట్‌ శిక్షణ కోసం మూడు అత్యాధునిక ఎయిర్‌ ఫాక్స్‌ ఫుల్‌ ఫ్లైట్‌ సిమ్యులేటర్లను ఆర్బిట్‌ సంస్థకు అందించనుంది.

Updated Date - Jan 21 , 2024 | 03:09 AM