Share News

అప్పు కట్టలేదని ఇంటికి చెప్పులు, పొరక, చాటలతో తోరణం

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:39 AM

అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదని అప్పు తీసుకున్న మహిళా ఇంటికి చెప్పులు, పొరక, చాటలతో తోరణం కట్టాడో వ్యక్తి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని ఆశ్లాతండాలో శనివారం జరిగింది.

అప్పు కట్టలేదని ఇంటికి చెప్పులు, పొరక, చాటలతో తోరణం
ఇంటికి చెప్పు చాట కట్టిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

అప్పు చెల్లించడం లేదని గ్రామంలో డప్పు చాటింపు వేయించిన వ్యక్తి

పోలీసులను ఆ శ్రయించిన బాధిత మహిళ

ఏడుగురిపై కేసు నమోదు

సూర్యాపేట జిల్లాలో ఘటన

ఆత్మకూర్‌(ఎస్‌), అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదని అప్పు తీసుకున్న మహిళా ఇంటికి చెప్పులు, పొరక, చాటలతో తోరణం కట్టాడో వ్యక్తి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని ఆశ్లాతండాలో శనివారం జరిగింది. మండలంలోని అశ్లాంతండాకు చెందిన వాంకుడోత్‌ కీమా, అనిత దంపతులు అదే గ్రామానికి చెందిన ధరావత్‌ రంజా వద్ద మూడు సంవత్సరాల క్రితం రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. కొద్ది కాలానికి కీమా అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో బతుకు దెరువు కోసం అనిత హైదరాబాద్‌కు వెళ్లింది. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చేది. ఈ క్రమంలో దసరా పండుగకు రెండు రోజులకు ముందుకు గ్రామానికి వచ్చింది. తన డబ్బులు ఇవ్వాలని రంజా అనితను అడిగాడు. ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం రంజా కుటుంబ సభ్యులు అనిత ఇంటికి పాత చెప్పులు, పొరక, పాతచాటలను దండగా కూర్చి తోరణంగా కట్టారు. అనిత అప్పటికే హైదరాబాద్‌కు వెళ్లింది. ఆమె వెళ్లిన తర్వాత అంతటితో ఆగకుండా అనిత తమ అప్పు చెల్లించడం లేదని రంజాకు గ్రామంలో ఇకపై ఎవ్వరూ అప్పు ఇవ్వవద్దని శుక్రవారం డప్పు చాటింపు వేయించాడు. ఈ విషయాన్ని గ్రామస్థులు హైదరాబాద్‌లో ఉన్న అనితకు సమాచారం ఇచ్చారు. ఆమె శనివారం గ్రామానికి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. తన ఇంటికి చెప్పుల దండలు వేసి ఊర్లో డప్పు చాటింపు చేయడంతో తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త చనిపోవడంతో బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి బతుకుతున్నానని, కావాలనే తనపై చెడు ప్రచారం చేస్తున్నారని రంజాతో పాటు అతడికి సహకరించి మరో ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ రత్నావత్‌ శంకర్‌నాయక్‌ తెలిపారు.

డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని దంపతుల ఆందోళన

మఠంపల్లి: వడ్డీగా తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని దంపతులు ఆ వ్యక్తుల ఇళ్ల ఎదుట ధర్నా చేశారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెం శనివారం జరిగింది. బాధితులు గుగులోతు బాలోజీ, గుగులోతు లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రగుట్టతండాకు చెందిన బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన బల్పూనూరి రాజా మోహన్‌రెడ్డి, సత్యానారాయణరెడ్డి తాము (బాధితులు) ఎల్‌ఐసీ నుంచి వచ్చిన రూ.5లక్షల నగదును తీసుకొని వడ్డీ ఇస్తామని చెప్పారని బాధితులు తెలిపారు. వడ్డీతో సహా ఆరు నెలల్లో ఇస్తామని ఏడాదిన్నరగా తిప్పుతూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కున్న చోట చెప్పుకోవాలని బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.

Updated Date - Oct 20 , 2024 | 12:39 AM