Share News

నిర్దోషి అయితే... నార్కోటిక్‌ టెస్ట్‌కు సిద్ధమా?

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:46 AM

వివేకా హత్యకేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్‌యాదవ్‌ నిరపరాధి అయితే నార్కోటిక్‌ అనాలసిస్‌ పరీక్షకు ఎందుకు సిద్ధపడటం లేదని సీబీఐ ప్రశ్నించింది.

నిర్దోషి అయితే... నార్కోటిక్‌ టెస్ట్‌కు సిద్ధమా?

సునీల్‌యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌లో సీబీఐ ప్రశ్న ..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): వివేకా హత్యకేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్‌యాదవ్‌ నిరపరాధి అయితే నార్కోటిక్‌ అనాలసిస్‌ పరీక్షకు ఎందుకు సిద్ధపడటం లేదని సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్యకేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సునీల్‌యాదవ్‌ ఆరోసారి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫు న్యాయవాదులు అనిల్‌ తన్వర్‌, జగదీశ్‌ వాదనలు వినిపించారు. హత్యకేసులో సంబంధం లేదని.. ఏ పాపం తెలియదని పేర్కొంటున్న పిటిషనర్‌ నార్కోటిక్‌ అనాలసిస్‌ పరీక్షకు సిద్ధమా అని ప్రశ్నించారు. సునీల్‌యాదవ్‌ ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నాడని.. కుట్ర, హత్య, ఆధారాల చెరిపివేత ఇలా మూడుదశల్లో అతడి పాత్ర ఉందని పేర్కొన్నారు. శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ వచ్చింది కాబట్టి తనకూ బెయిల్‌ ఇవ్వాలన్న వాదనలో అర్థం లేదు. పిటిషనర్‌ బెయిల్‌కు అనర్హుడు’ అని పేర్కొన్నారు. సునీల్‌యాదవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి. రమేశ్‌, న్యాయవాది నయన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. కొత్తగా వివాహం అయిన పిటిషనర్‌ ఇప్పటివరకు వైవాహిక జీవితం అనుభవించలేదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ‘ఇలాంటి తీవ్ర ఆరోపణలున్న సీరియస్‌ కేసుల్లో సానుభూతి పొందడానికి ప్రయత్నించొద్దు’ అని వ్యాఖ్యానించింది. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Apr 30 , 2024 | 08:17 AM