Share News

నేను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:37 AM

కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. గెలిస్తే బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ చేస్తారా?’..అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌..

నేను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా

గెలిస్తే బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ చేస్తారా?

ప్రజాహిత యాత్రలో కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌

చొప్పదండి, మార్చి 7: ‘కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. గెలిస్తే బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ చేస్తారా?’..అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌.. కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. గురువారం కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో భాగంగా పలు గ్రామాల్లో పాదయాత్ర చేసి చొప్పదండిలో ఆయన మాట్లాడారు. ‘కేటీఆర్‌ నీ సవాల్‌కు నేను సిద్ధం. కేసీఆర్‌ను తీసుకురా.. కరీంనగర్‌కు ఎవరేం చేశారో చర్చించేందుకు సిద్ధం’ అని ఆయన అన్నారు. దమ్ముంటే తన సవాల్‌కు స్పందించి రావాలన్నారు. కరీంనగర్‌ అభివృద్ధితోపాటు తాను చేసిన పోరాటాలు, బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అవినీతిపై కరీంనగర్‌ కమాన్‌ వేదికగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాముడి పేరు చెప్పుకుని ఆనాడు ఎన్టీఆర్‌ వద్ద ఎమ్మెల్యే టికెట్‌ సంపాదించింది కేసీఆర్‌ అన్నారు. కేటీఆర్‌ అసలు పేరు అజయ్‌రావు అయితే ఎన్టీఆర్‌ దగ్గర టికెట్‌ కోసం తారక రామారావు అని పేరు పెట్టాడని విమర్శించారు. దేవుడిని నమ్మని కేటీఆర్‌కు రాముడి గురించి మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలను అభివృద్ధి చేస్తానని మోసం చేసింది కేసీఆర్‌ అన్నారు. అన్ని పనులకు మోదీ నిధులు ఇస్తే.. కాంగ్రె్‌సకు ఓటు వేశారని, ఈసారి మాత్రం అలా చేయవద్దని కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదంటూ ఎద్దేవా చేశారు.

Updated Date - Mar 08 , 2024 | 08:39 AM