ఐటీడీఏ పీవోగా ఐఏఎస్‌ను నియమించాలి
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:27 PM
ఐటీడీఏ పీవోగా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- చెంచుల భూములకు హక్కుల పత్రాలు ఇవ్వాలి
- తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా
కొల్లాపూర్, జూలై 15 : ఐటీడీఏ పీవోగా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియో జకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో నివసించే ఆదివాసి చెంచు గిరిజను లతో కలిసి కొల్లాపూర్ పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.శివవర్మ అధ్యక్షతన కొనసాగిన ధర్నానుద్దేశించి రవికుమార్, భీంరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి మాట్లాడారు. గడిచిన పాతికేళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంతం నుంచి చెంచు గిరిజనులను, పెంటలను తరలించి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెండు మండలాల పరిధిలో పునరావాసం ఏర్పాటు చేస్తామని నమ్మబలికి చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించార న్నారు. చెంచులకు పక్కా ఇళ్లు, కరెంటు, రోడ్లు, మంచినీటి వసతులు, పిల్లల చదువులకు కావాల్సిన పాఠశాలలు, కనీస సౌకర్యాలు ఏవీ కల్పించలేదన్నారు. చెంచుల జీవనోపాధికి కావాల్సిన ఏర్పాట్లు చేయలేదని, ఆధార్, రేషన్‌కార్డు లాంటి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. చెంచుల అమాయక త్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం వారికి కేటాయించిన భూములను ఇతరులు చెంచులను బెదిరించి వారి భూము లను బలవంతంగా లాక్కుని చెంచులనే కూలీలుగా మార్చుకుంటున్నారని వారు ధ్వజమెత్తారు. చెంచులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మొలచింతలపల్లి భ్రమరాంబకాలనీలో బాధిత చెంచు మహిళపై జరిగిన దాడి ఘటనపై హైకోర్టు జడ్జితో పూర్తి జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామ ని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో నాగరాజుకు అందజేశారు. ఆదివాసి చెంచు సంఘం అధ్యక్షుడు హను మంతు, వెంకటేశ్, మొలచింతలపల్లి మాజీ సర్పంచ్ వెంకటస్వామి, శివ, మల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.నరసింహ, రైతు సంఘం మండల కార్యదర్శి బాలపీరు, సీఐటీయూ జిల్లా కోశాధికారి అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.తారాసింగ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్, ఎం.దశరథం, ఆవాస్ సంఘం జిల్లా కన్వీనర్ ఎండి.సలీం, గిరిజన సంఘం జిల్లా అధ్య క్షుడు ఎస్.అశోక్, మత్స్యకార్మిక సంఘం జిల్లా నాయకులు కిరణ్‌కుమార్, డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి బాలునాయక్, జల్లాపురం సురేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.