Share News

CM Revanth : పదేళ్లు నేనే సీఎం

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:27 AM

వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్ల పాటు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు సూటిగా సవాలు విసురుతున్నానని, చేతనైతే ఒక్క వెంట్రుక పీకి చూడాలని సవాల్‌ విసిరారు. ఆయన వెంటనే

CM Revanth : పదేళ్లు నేనే సీఎం

ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లపాటు ఇందిరమ్మ రాజ్యం

కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చారు!

కేసీఆర్‌.. పదేళ్లుంటా.. నీకు చేతనైతే వెంట్రుక పీకి చూడు

వెంటనే వస్తానని అంటున్నాడు.. రా.. బిడ్డ ఎట్ల వస్తవో..?

ఆయన పని ఖతం.. మళ్లీ అధికారంలోకి రావడం కల్ల

కేసీఆర్‌ రావాలనుకున్నా.. ఈ పోలీసు పిల్లలు రానివ్వరు

ఉత్తప్పుడు బాగానే నడుస్తుండు.. మీటింగ్‌లోనే వీల్‌ చైర్‌లో

ఏ దారీ లేక నీళ్ల దారి పట్టిండు.. ఢిల్లీ పోదామంటే రాడు

యువతా.. అధైర్యపడొద్దు.. మీ అన్నగా అండగా ఉంటా

కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్‌

ఎల్బీ స్టేడియంలో 13,445 మంది అభ్యర్థులకు పత్రాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్ల పాటు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు సూటిగా సవాలు విసురుతున్నానని, చేతనైతే ఒక్క వెంట్రుక పీకి చూడాలని సవాల్‌ విసిరారు. ఆయన వెంటనే అధికారంలోకి వస్తా అంటున్నాడని.. రా.. బిడ్డ ఎట్ల వస్తవో..? ఇక్కడే ఉంటా.. నీ సంగతేందో చూస్తానని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రావడానికి అయితలేదు కానీ.. కేసీఆర్‌ నల్లగొండకు పోయిండని ఆయన మాటల మాయలో పడొద్దని సూచించారు. పోలీసు శాఖలో శిక్షణకు ఎంపికైన 13,445 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులకు బుధవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును గెలిపించారని నల్లగొండ సభలో కేసీఆర్‌ అన్నారని, కానీ.. ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని గెలిపించారని, ఏ పోటీకెళ్లినా ఈ రేసు గుర్రానిదే గెలుపని పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీలో చర్చకు రాలే. నీళ్ల మీద చర్చ అంటే రాలే. నిధుల మీద చర్చ అంటే రాలే. నియామకాలపై మాట్లాడదామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి బీరాలు పలికిండు. పొంకనాలు కొడుతున్నారు. ఈ రోజు అసెంబ్లీలో ఓ అటెండర్‌ నాతో మాట్లాడాడు. సార్‌ ఎల్బీ స్టేడియంలో ఒక్క మాట మీరు చెబితే వింటా అన్నాడు. కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని చెప్పండి అన్నాడు. ఆ కంచర గాడిదకు మళ్లీ అధికారం అన్నది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్‌ అని కోరాడు. ఆ అటెండర్‌కు ఉన్న ఇంగిత జ్ఞానం సీఎంగా పనిచేసిన చంద్రశేఖరరావుకు లేదు. ఆయన మళ్లీ వస్తాడంటా. నడవడానికే వస్తలేదంటివి, వీల్‌ చైర్‌లో తిరుగుతున్నా అంటున్నావు. ఎట్లొస్తావని నేను అడుగుతున్నా’’ అని రేవంత్‌ అన్నారు.

మోకాళ్ల మీద కొట్టి లాక్‌పలో వేస్తారు

కేసీఆర్‌ మళ్లీ రావాలనుకున్నా.. పోలీస్‌ నౌకరీ వచ్చిన ఈ పిల్లలు ఊరుకోరని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. శిక్షణ తర్వాత రాష్ట్రమంతా ఈ యువకులే ఉంటారని, తెలంగాణను దోచుకున్న నిన్ను, కుటుంబం కోసం తెలంగాణను బలిచ్చిన కేసీఆర్‌ను.. ఈ పిల్లలు లాఠీలతో మోకాళ్ల చిప్పల మీద కొట్టి లాక్‌పలో వేస్తారని అన్నారు. ఇంతకాలం వాళ్ల చేతిలో పెత్తనం లేదని.. ఇకనుంచి ఎట్లా తిరుగుతవో తిరగాలని సవాల్‌ విసిరారు. ‘‘సచ్చిన పామును సంపనీకి మాకేమైనా పిచ్చా. నీ పనైపోయింది. ఖేల్‌ ఖతం. దుకాణ్‌ బంద్‌. దీంతో చిన్నగా సానుభూతి కథ మొదలుపెట్టిండు. సావు నోట్ల తలపెట్టి తెలంగాణ సాధించిన అని చెబితే చూడలేదు కాబట్టి పిల్లలు నిజమే అనుకున్నారు. ఇవాళ నీ డ్రామాలు చూసిర్రు. ఉత్తప్పుడు బాగనే నడుస్తుండు. మీటింగ్‌కు రాగానే వీల్‌ చైర్‌లో కూసుంటుడు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ ఏర్పడిన వెంటనే కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్‌.. తెలంగాణ పిల్లలు ఏం పాపం చేశారని 30 లక్షల మంది 3,650 రోజుల పాటు ఉద్యోగాలకు ఎదురుచూసేలా చేశావ్‌? మేం ఉద్యోగాల దిశగా ఆలోచన చేస్తుంటే కాళ్లల్లో కట్టెపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావ్‌? అడుగుతున్నా. ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా? మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం బహిష్కరించింది’’ అని అన్నారు.

మా అన్న దగ్గరకు పోయినమని హరీశ్‌రావుకు చెప్పండి

ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి రాలేదని సీఎం రేవంత్‌ తప్పుబట్టారు. స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల ఆశలు తీరలేదని అన్నారు. అధికారులతో సమీక్షించి ఆటంకాలు తొలగించామని చెప్పారు. ‘‘నిరుద్యోగ యువకులారా.. అధైర్యపడొద్దు. ఈ రాష్ట్రం మీదే. మీకోసం పనిచేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరంతా మా తమ్ముళ్లు. మీ ఆనందాన్ని మేమూ పంచుకుంటాం. తెలంగాణ కోసం కొట్లాడిన యువత ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉంది’’ అని సీఎం తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినపుడు ఎంతటి ఆనందం కలిగిందో ఇపుడు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తుండగా అంతే సంతోషం కలిగిందన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అప్పుడే తమను శాపనార్థాలు పెడుతున్నారని తప్పుబట్టారు. శాఖల వారీగా సమీక్షించి, కోర్టు కేసులను పరిశీలించి పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘ఉద్యోగ నియామకాల్లో ఒక్కో అడుగు ముందుకేస్తున్నాం. మీ నమ్మకానికి తగ్గట్లు.. తప్పు జరగకుండా, ఎవరికీ నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. గ్రూప్‌ -1పై ప్రకటన చేశాం.

పోటీ పరీక్షలకు సన్నద్ధంకండి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి బాధ్యత నేను తీసుకుంటా. మీ కోసం కృషి చేస్తా’’ అని రేవంత్‌ అభయమిచ్చారు. ‘‘లక్షలాది నిరుద్యోగులకు ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా. మేం 60 రోజుల్లో ఒక్కోటి పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. 6,956 స్టాఫ్‌ నర్సులు, సింగరేణిలో 441 కారుణ్య నియామకాలు చేపట్టాం. కేసీఆర్‌, హరీశ్‌ అరిచి గోలపెట్టినా, అంగీ, లాగు చించుకున్నా.. వచ్చే 15 రోజుల్లో ఎవరు అడ్డుపడ్డా ఉద్యోగ నియామకాలు చేపడతానని ఆ రోజే చెప్పా. 10 రోజుల్లోనే సుమారు 13,500 నియామకాలు చేపట్టా. రేపు ఇక్కడే 2 వేల పైగా ఉద్యోగాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఎవరి నియామక పత్రం వారి ఇంటికి పంపిస్తే సరిపోతుంది కదా అని హరీశ్‌ అంటున్నారు. నీ కడుపు నొప్పి ఏంది? అని అడుగుతున్నా. వీళ్లంతా మా తమ్ముళ్లు, చెల్లెళ్లు. వారి ఆనందంలో భాగమైతే నాకు కంటినిండా నిద్ర పడతది. బుక్కెడు బువ్వ ఒంటపడ్తది’’ అని సీఎం అన్నారు. ‘‘యువత సంతోషంలో భాగమయ్యేందుకే ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశాం. ఆ హరీశ్‌ ఎక్కడైనా అడ్డంపడితే మా అన్న దగ్గరికి పోయినం. ఆయన అండగా నిలబడ్డడని చెప్పండి’ అని సూచించారు. మీ అన్నగా... మీ రేవంత్‌ అన్నగా అండగా ఉంటానని అధైర్యపడొద్దని పేర్కొన్నారు.

చీకటి మిత్రుడు జగన్‌తో కలిసి కేసీఆర్‌ కుట్ర

కేసీఆర్‌ పదేళ్లు ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలేదని. కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలేదని రేవంత్‌ పేర్కొన్నారు. కృష్ణాలో నీటి వాటాలపై ఆయన పెట్టిన సంతకాలు తెలంగాణ ప్రజల పాలిట మరణ శాసనాలు అయ్యాయని, గుదిబండలుగా మారాయని రేవంత్‌ విమర్శించారు. అయినా, కేసీఆర్‌ మళ్లీ నీళ్ల అంశాన్నే ఎత్తుకుంటున్నాడని.. ఏ దారి లేక నీళ్లదారి పట్టిండని.. నల్లగొండలో సభ పెడితే యువకులు గుడ్లు, టమాటాలు విసిరారని.. పోలీసులు ఉండడంతో కేసీఆర్‌ వీపు చింతపండు కాలేదని అన్నారు. ఢిల్లీకి పోయి కొట్లాడదామంటే మాత్రం ఇంటి నుంచి బయటకు రావడం లేదని ఎద్దేశా చేశారు. ఆయనకు చేతకాకపోతే, పక్కన పడేసి ఉంటే తానే కొట్లాడి నీళ్లు తెచ్చేవాడినన్నారు. తెలంగాణలో ఎన్నికల ముందు రోజు కేసీఆర్‌ చీకటి మిత్రుడు జగన్‌ వందలాది మంది పోలీసులను సాగర్‌ మీదికి పంపించారని.. వారిని వెనక్కు పంపేందుకు ప్రధాని మోదీ సీఆర్‌పీఎఫ్‌ పంపాడని పేర్కొన్నారు. ఎన్నికల్లో సెంటిమెంట్‌తో నెగ్గాలని కేసీఆర్‌ చూస్తే తెలంగాణ సమాజం తిప్పికొట్టి బొందపెట్టిందని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో గంజాయి పదం వినపడొద్దు

పంజాబ్‌లో గంజాయి, డ్రగ్స్‌తో యువత నిర్వీర్యమైందని సీఎం రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను కబళించేందుకు గంజాయి, డ్రగ్స్‌ ముఠాలు తిరుగుతున్నాయని ఎన్ని పట్టుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వాళ్లు ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘మీకు ఒక్కటే మాట చెబుతున్నా. తులసి వనంలాంటి ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. రాష్ట్రాన్ని, యువతను నిర్వీర్యం చేసే బలహీనతలు ఉండొద్దు. డ్రగ్స్‌, గంజాయి పదం పలకాలంటే కాళ్లలో వణుకు పుట్టాలి. కడుపులో చలి జ్వరం జొరబడాలి. తెలంగాణ యువకులంటే సలసల మరిగే రక్తంతో ఉరకలెత్తేవారు. వారు గంజాయి, డ్రగ్స్‌కు బానిసైతే సమాజం నిర్వీర్యమవుతుంది. నియామక పత్రాలు పొందుతున్న మీరంతా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను సమూలంగా నాశనం చేస్తామని ప్రమాణం చేయండి’’ అని రేవంత్‌ కోరారు.

నేడు గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు

సీఎం చేతుల మీదుగా అందజేత

హైదరాబాద్‌, ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల్లాలో పలు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్‌ రెడ్డి నియామక ప్రతాలు అందించనున్నారు. ఈమేరకు తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ట్రిబ్‌) ఆధ్వర్యంలో దాదాపు 2,090 మందికి నియామక పత్రాలు అందించడానికి అధికారులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. కాగా గురుకుల బోర్డు పరిధిలో మొత్తం 9,210 పోస్టులకు గతేడాది ఆగస్టులో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 15 , 2024 | 04:27 AM