Share News

5 నెలలుగా జీతాల్లేవ్‌

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:35 AM

అసలే ఔట్‌సోర్సింగ్‌ కొలువు. 20 ఏళ్లుగా అందులోనే మగ్గిపోతూ చాలీ చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. గత 5 నెలలుగా ఆ కాస్త వేతనం కూడా రావడం లేదు. కొత్తగా ఏర్పడిన సర్కారు అయినా తమను పట్టించుకుంటుందేమోనని ఆ ఉద్యోగులు గంపెడాశలతో ఎదురుచూశారు. ప్రభుత్వం

5 నెలలుగా జీతాల్లేవ్‌

20 ఏళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలోనే విధులు

చాలీ చాలని జీతాలతో 104 ఉద్యోగుల అవస్థ

కొత్త సర్కారు కనికరిస్తుందని గంపెడాశలు

3 నెలలైనా స్పందించపోవడంతో తీవ్ర నిరాశ

జగిత్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అసలే ఔట్‌సోర్సింగ్‌ కొలువు. 20 ఏళ్లుగా అందులోనే మగ్గిపోతూ చాలీ చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. గత 5 నెలలుగా ఆ కాస్త వేతనం కూడా రావడం లేదు. కొత్తగా ఏర్పడిన సర్కారు అయినా తమను పట్టించుకుంటుందేమోనని ఆ ఉద్యోగులు గంపెడాశలతో ఎదురుచూశారు. ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలైనా కనీస స్పందన లేకపోవడంతో 104 సంచార వైద్యశాలల ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దకే వెళ్లి ఆరోగ్య సేవలు అందించిన 104 సంచార వైద్య శాలలను పలు కారణాల వల్ల 2021 నుంచి సర్కారు బంద్‌ చేసింది. ఒక్కో వాహనంలో డ్రైవర్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫార్మసిస్టు, సెక్యూరిటీ గార్డు పనిచేసే వారు. వీరందరినీ పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, డీఎంహెచ్‌వో కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపించారు. 20 ఏళ్లయినా ఆ ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ పరిధిలోనే కొనసాగిస్తూ పనిచేయించుకుంటున్నారు. గతంలో 104 సంచార వైద్యశాలల్లో పనిచేసి, ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రాష్ట్రంలో సుమారు 1,350 మంది ఉన్నారు. వీరందరికీ 2023 సెప్టెంబరు నుంచి వేతనాలు అందాల్సి ఉంది. ఈ విషయంలో అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇటీవల హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించామని జగిత్యాల జిల్లా 104 ఎంప్లాయీస్‌ నాయకులు తెలిపారు. ప్రస్తుతం తమకు ఈ పని తప్ప ఇతర పనులు చేసే అవకాశం లేదని చెబుతున్నారు. వివాహాలు కాకముందు విధుల్లోకి వచ్చామని, ఇప్పుడు తమ పిల్లలు పదో తరగతి, ఇంటర్‌ చదువుతున్నారని.. ఈ వయసులో అనారోగ్య సమస్యలతో అవస్థలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.


వేతనాలుఎప్పటికప్పుడు చెల్లించాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి వెంటనే 5 నెలల వేతనాలు చెల్లించాలి. గత సర్కారు మాదిరిగా కాకుండా ఇకనుంచైనా ఎప్పటికప్పడు జీతాలు ఇవ్వాలి. చాలీ చాలని వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

- నక్క శేఖర్‌, 104 వాహన ఉద్యోగుల సంఘం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు

బడ్జెట్‌ విడుదల కావాల్సి ఉంది

జగిత్యాల జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 104 ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు అవసరమైన బడ్జెట్‌ విడుదల కావాల్సి ఉంది. జీతాల చెల్లింపునకు అవసరమైన వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు అందించాం. బడ్జెట్‌ విడుదల కాగానే జీతాలు ఇస్తాం.

- పుప్పాల శ్రీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జగిత్యాల


కుటుంబ పోషణ కష్టమవుతోంది

మాకు 5 నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబ పోషణ కష్టమవుతోంది. 20 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగాలు రెగ్యులర్‌ కావడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి మా కొలువులు పర్మినెంట్‌ చేయడంతో పాటు, సకాలంలో జీతాలు ఇవ్వాలి.

- కొప్పుల రాజు, డ్రైవర్‌, జగిత్యాల

Updated Date - Mar 26 , 2024 | 03:35 AM