Share News

జోగినపల్లి సంతోష్‌ ఎవరో తెలియదు!

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:29 AM

నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ ఫిర్యాదు మేరకు నమోదైన భూకబ్జా కేసులో నిందితుడిగా ఉన్న జోగినపల్లి సంతోష్‌ ఎవరో తనకు తెలియదని.. మరో నిందితుడు లింగారెడ్డి శ్రీధర్‌ హైకోర్టుకు వెల్లడించారు.

జోగినపల్లి సంతోష్‌ ఎవరో తెలియదు!

కబ్జా కేసు కొట్టేయాలని లింగారెడ్డి శ్రీధర్‌ పిటిషన్‌

పిటిషనర్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ ఫిర్యాదు మేరకు నమోదైన భూకబ్జా కేసులో నిందితుడిగా ఉన్న జోగినపల్లి సంతోష్‌ ఎవరో తనకు తెలియదని.. మరో నిందితుడు లింగారెడ్డి శ్రీధర్‌ హైకోర్టుకు వెల్లడించారు. బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌లో తనపై నమోదైన భూకబ్జా, ఫోర్జరీ, చీటింగ్‌ కేసును కొట్టేయాలని హైకోర్టులో ఆయన క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ లక్ష్మణ్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ తండ్రి 1990లోనే వివాదంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేశారని.. ఫిర్యాదుదారు అయిన నవయుగ మాత్రం 2010లో కొనుగోలు చేసినట్లు చెబుతోందని తెలిపారు. వివాదంలో ఉన్న స్థలానికి తప్పుడు పత్రాలతో మునిసిపల్‌ ట్యాక్స్‌ కడుతున్నామని పేర్కొనడం నవయుగ కంపెనీ ఆరోపణ మాత్రమేనని, సదరు ఆస్తిపై తన పిటిషనర్‌కు టైటిల్‌ హక్కు ఉందని పేర్కొన్నారు. మరో నిందితుడిగా ఉన్న సంతోష్‌ ఎవరో తమకు తెలియదని, అతనితో కలిసి కుట్ర చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పిటిషనర్‌ లింగారెడ్డి శ్రీధర్‌ను అరెస్ట్‌ చేయరాదని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణను జూన్‌కు వాయిదా వేసింది.

Updated Date - Apr 03 , 2024 | 02:29 AM