Share News

ఓ హైదరాబాదీ.. ఓటేయీ!

ABN , Publish Date - Apr 30 , 2024 | 05:22 AM

నగర వాసులంటే కాస్త చైతన్యవంతులు.. సమాజం పట్ల ఇంకాస్త అవగాహన ఉన్నవారు అనుకుంటాం..! మిగతా విషయాల్లో ఎలా ఉన్నా.. విలువైన ఓటు హక్కు వినియోగంలో మాత్రం హైదరాబాద్‌

ఓ హైదరాబాదీ..  ఓటేయీ!

మహా నగరంలో 50% దాటలేకపోతున్న పోలింగ్‌

(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ)

నగర వాసులంటే కాస్త చైతన్యవంతులు.. సమాజం పట్ల ఇంకాస్త అవగాహన ఉన్నవారు అనుకుంటాం..! మిగతా విషయాల్లో ఎలా ఉన్నా.. విలువైన ఓటు హక్కు వినియోగంలో మాత్రం హైదరాబాద్‌ ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు. ఏ ఎన్నిక చూసినా మిగతా రాష్ట్రమంతా ఒక తీరు, రాజధాని ఒక తీరు అన్నట్లుగా ఉంటోంది పరిస్థితి. పోలింగ్‌ శాతం పెంపునకు లెట్స్‌ ఓట్‌ లాంటి స్వచ్ఛంద సంస్థలు వాకథాన్‌లు, రన్‌లతో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కార్పొరేట్‌ కంపెనీలు ఆఫర్‌లు అందించినా ప్రజలు, ఉద్యోగులు మాత్రం పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. రాజధాని చుట్టుపక్కల 24 అసెంబ్లీ స్ధానాలుంటే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే 50ు ఓటింగ్‌ దాటుతోంది. సరాసరి మాత్రం 40 శాతం మించడం లేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో దాదాపు 10 లక్షల మంది ఐటీ నిపుణులు ఉన్నారు. వీరిలో సగం మంది కూడా ఓటుహక్కును వినియోగించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈసారి పోలింగ్‌ మే 13 సోమవారం రావడం, శనివారం, ఆదివారం కూడా సెలవులు కావడంతో కొందరు ఎటైనా వెళ్దామని ప్రణాళిక చేసుకుంటుండడం గమనార్హం.


ఓటింగ్‌ డేను హాలీడేగా చూస్తున్నందునో.., ఓటీటీ డేగా భావిస్తున్నందునో.. పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులు ఓటు వేశాక పోలింగ్‌ బూత్‌ బయట సిరా మార్క్‌తో సెల్ఫీ తీసుకుని, ఆఫీసుకు వచ్చిన తర్వాత దానిని చూపితేనే సెలవుగా పరిగణిస్తామని స్పష్టం చేస్తున్నాయి. కాగా, తొలిసారి ఓటు వచ్చిన యువత హక్కును వినియోగించుకుంటే 19ు రాయితీ అందిస్తామని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. శ్రీ సిమెంట్‌కు చెందిన బంగూర్‌ సిమెంట్‌.. ఓటు వేస్తామని తమ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నవారికి కేజీ సిమెంట్‌ను ఉచితంగా ఇస్తామంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆఫర్లు ప్రకటించిన అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు, రెస్టారెంట్లు ఈసారీ అదే ప్రయత్నం చేస్తున్నాయి.

Updated Date - Apr 30 , 2024 | 05:22 AM