Share News

శభాష్‌.. సమర్థంగా జవాబిచ్చారు!

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:19 AM

హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలతను ప్రఽధాని నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమర్థంగా జవాబులిచ్చారంటూ

శభాష్‌.. సమర్థంగా జవాబిచ్చారు!

హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మోదీ ప్రశంసలు

లక్షన్నర ఓట్ల తేడాతో ఒవైసీ ఓడిపోవడం ఖాయం

బోగస్‌ ఓట్లే మజ్లిస్‌ అధ్యక్షుడి విజయ రహస్యం

నాకు టికెట్‌ కేటాయింపే బీజేపీలో పారదర్శకతకు నిదర్శనం

‘ఆప్‌ కీ అదాలత్‌’లో ఆమె చేసిన వ్యాఖ్యలివి

హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మోదీ ప్రశంసలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలతను ప్రఽధాని నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమర్థంగా జవాబులిచ్చారంటూ ప్రోత్సాహం తెలిపారు. తన ప్రత్యర్థి అయిన ఎంఐఎం అధ్యక్షుడు లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోతారని అంచనా వేయడంతో పాటు, బీజేపీలో టిక్కెట్ల కేటాయింపు ఎంత పారదర్శకంగా ఉంటుందో ఆమె చాలా తర్కంతో వివరించి చెప్పారు. మోదీని మహాయోగిగా అభివర్ణించారు. జవాబులు ఇచ్చిన తీరుకు ఎంతో సంతోషపడ్డ ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ‘‘మాధవీలతాజీ ‘ఆప్‌ కీ అదాలత్‌’ కార్యక్రమంలో మీరు చూపిన ప్రతిభ అద్భుతంగా ఉంది. మీరు పాయింట్లను చాలా స్పష్టంగా, తర్కంతో, ఎంతో ఇష్టంతో వివరించారు. మీకు నా అభినందనలు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూడాలి. చాలా ఆసక్తికర సమాచారం ఇందులో ఉంది’’ అని పేర్కొన్నారు.

శాస్త్రీయ నృత్యకళాకారిణి, వ్యాపారవేత్త అయిన మాధవీలత(49) హైదరాబాద్‌లో వరుసగా విజయాలు సాధిస్తున్న అసదుద్దీన్‌ ఒవైసీతో ఢీకొంటున్నారు. ధార్మిక ప్రవచనకర్తగా, హిందువుల సమస్యలపై పోరాడే ఉద్యమకారిణిగా ఆమెకు పేరుంది. ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆమె భర్త విశ్వనాథ్‌ నెలకొల్పిన విరించి హాస్పిటల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ మొదటి విడతగా విడుదల చేసిన 195 మంది అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ఉండడం విశేషం. హైదరాబాద్‌లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తొలి మహిళ కూడా ఆమే కావడం గమనార్హం.

బీజేపీలో అభ్యర్థుల ఎంపిక ఎంత శాస్త్రీయంగా ఉంటుందో మాధవీలత వివరిస్తూ ‘‘ఇప్పుడు నేను ప్రధాని మోదీతో భేటీ కాగలుగుతా. ఇది ఎంతో అదృష్టం. పార్టీ టిక్కెట్‌ రావడం వల్లనే ఇది సాధ్యమయింది. ఆయన కలియుగానికి చెందిన మహాయోగి. నన్ను చూడకుండానే, ఎలాంటి పరిచయం లేకుండానే టిక్కెట్‌ ఇచ్చారు. కేవలం నా సామాజిక సేవను చూసే నన్ను ఎంపిక చేశారు. నేనైతేనే ఓవైసీతో పోరాడగలనన్న ఉద్దేశంతో టిక్కెట్‌ ఇచ్చారు. ఇంతకన్నా పారదర్శకమైన రాజకీయాలు ఒంకేముంటాయి?’’ అని ఆమె వ్యాఖ్యానించారు. గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం చేతిలో ఉన్న హైదారాబాద్‌లో ఎలా విజయం సాధిస్తానో ఆమె చాలా తర్కంగా వివరించారు. ఇప్పటి వరకు వారు మోసపూరిత చర్యల ద్వారానే గెలుస్తూ వచ్చారని, ఈసారి మాత్రం లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోతారని అన్నారు. ‘‘బోగస్‌ ఓట్లు ఉంటే 40 ఏళ్లు ఏమిటి 4000 సంవత్సరాల పాటు గెలవొచ్చు. ఏం చేస్తాం? మా దగ్గర బోగస్‌ ఓట్లు లేవు. ఒవైసీకి 6,20,000 బోగస్‌ ఓట్లు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఒక ఓటరు కార్డు నెంబరు కొడితే ఆ పేరు రెండు చోట్ల కనిపిస్తుంది. ఒక్క చార్మినార్‌ ప్రాంతంలోనే 1,60,000 బోగస్‌ ఓట్లు ఉన్నాయి’’ అని వివరించారు. ఇంతవరకు ఒవైసీ తప్పుడు మార్గాల్లోనే గెలుస్తూ వస్తున్నారా అన్న ప్రశ్నకు మాధవీలత సమాధానం ఇస్తూ ‘‘కచ్చితంగా ఆ మాటే చెబుతాను. ఇందుకేమీ భయపడను’’ అని అన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 04:19 AM