Share News

భార్యాభర్తల చోరీల బాట

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:27 AM

బతుకుదెరువుకు రాజధానికి వచ్చిన భార్యాభర్తలు చోరీల బాట పట్టారు. నాలుగు నెలల క్రితం చోరీ చేసిన దుకాణంలో మరోసారి దొంగతనం చేసి ఆటోలో వెళుతూ పోలీసులకు చిక్కారు.

భార్యాభర్తల చోరీల బాట

డిండి, జనవరి 16: బతుకుదెరువుకు రాజధానికి వచ్చిన భార్యాభర్తలు చోరీల బాట పట్టారు. నాలుగు నెలల క్రితం చోరీ చేసిన దుకాణంలో మరోసారి దొంగతనం చేసి ఆటోలో వెళుతూ పోలీసులకు చిక్కారు. మంగళవారం నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం ఇప్పెలపల్లి గ్రామానికి చెందిన మీరజోట్‌ నర్సింహ అతడి భార్య కమల బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చి సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు. నర్సింహ ఆటోడ్రైవర్‌గా, కమల కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తుండగా, మూడేళ్ల కుమార్తె ఉంది. మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో డిండి మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అదే సమయంలో ఓ ఆటో(టీఎ్‌స05యూఈ 6816) శ్రీశైలం వైపు నుంచి హైదరాబాద్‌కు వెళుతోంది. వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు ఆటోను ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్‌ నర్సింహ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి పట్టుకోగా, ఆటోలో ఐదు బోరు మోటర్లు, వాటి విడిభాగాలకు సంబంధించిన వస్తువులను గుర్తించారు. ఇవి ఎక్కడివని ప్రశ్నించగా తాము భార్యాభర్తలమని, డిండి మండల కేంద్రంలోని వేంకటేశ్వర మెకానిక్‌ దుకాణం నుంచి అపహరించి విక్రయించేందుకు ఆటోలో తరలిస్తున్నట్లు అంగీకరించారు. మరమ్మతుల నిమిత్తం తీసుకువచ్చే బోరు మోటార్లు డిండిలోని దుకాణం బయటే ఉంచుతారని గమనించిన భార్యాభర్తలు వాటిని ఆటోలో తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటారని అంగీకరించారు. గతంలో చోరీ చేసిన దుకాణం ఎదుటే ఉంచిన బోరు మోటార్లను ఆటోలో తీసుకువెళుతూ ఈసారి పోలీసులకు చిక్కారు. నర్సింహ భార్య కమల ప్రస్తుతం గర్భిణి. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 12:27 AM