Share News

తనది కాని భూమిని ఎలా అమ్ముతారు?

ABN , Publish Date - Mar 24 , 2024 | 04:43 AM

‘‘మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు పాండవులకు కనీసం ఐదు ఊళ్లు అయినా ఇవ్వాలని కోరినప్పుడు.. నాది కానిది..

తనది కాని భూమిని ఎలా అమ్ముతారు?

హైకోర్టు ప్రశ్న.. మహాభారతంలోని ఉద్యోగ పర్వం ప్రస్తావన

పిటిషనర్లకు రూ.వేయి వంతున జరిమానా

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ‘‘మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు పాండవులకు కనీసం ఐదు ఊళ్లు అయినా ఇవ్వాలని కోరినప్పుడు.. నాది కానిది.. ఇతరులకు దానం చేసిన రాజ్యాలను పాండవులకు ఎలా ఇవ్వగలనని.. దుర్యోధనుడు సమాధానం ఇస్తాడు. దీని ప్రకారం ఒక ఆస్తిపై టైటిల్‌ హక్కును కోల్పోయిన తర్వాత దానిని ఇతరులకు మళ్లీ కేటాయించలేమన్న విషయం స్పష్టమయింది’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు 1983లో జరిగిన విక్రయ లావాదేవి(సేల్‌ ట్రాన్‌సాక్షన్‌) అమల్లో ఉన్నప్పుడు.. అదే భూమిని 1997లో కొనుగోలు చేశాం.. 2013లో కొనుగోలు చేశాం.. 2005లో కొనుగోలు చేశాం.. అంటూ ఇతరులు దావాలు వేయవచ్చా అని ప్రశ్నిస్తూ ఈ కథను జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం ప్రస్తావించింది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి రెవెన్యూలో (శంకర్‌ హిల్స్‌ లేఅవుట్‌) సర్వే నెంబర్‌ 111, 134 సహా అనేక సర్వే నంబర్లలో ఉన్న ప్లాట్లలో 500 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ నెంబర్‌ 700 వారసత్వం ద్వారా సీతాఫల్‌మండికి చెందిన పిటిషనర్‌ గోపు నాగమణికి సంక్రమించింది. దాదాపు 460 ఎకరాల్లో 1983 నుంచి 1986 మధ్యలో 3,328 మంది ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి 1989లో అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ప్లాట్‌ ఓనర్స్‌ అభివృద్ధి పనులను మున్సిపాల్టీ అడ్డుకోగా వారు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుని.. హద్దును మళ్లీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పిటిషనర్‌ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఎస్‌పీడీసీఎల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమి వివాదాస్పద స్థలం అని పేర్కొంటూ విద్యుత్‌ సంస్థ కనెక్షన్‌ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ వ్యాజ్యంలో భూవివాదంలో టైటిల్‌ క్లెయిం చేస్తున్న జైహింద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ సంస్థ, ఇతరులు ఇంప్లీడ్‌ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ నగేశ్‌ బీమపాక ధర్మాసనం.. పిటిషనర్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని ఎస్‌పీడీసీఎల్‌కు ఆదేశాలు జారీచేసింది. సంబంధం లేని పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయినందుకు ప్రతిపాదిత పార్టీలకు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించింది.

Updated Date - Mar 24 , 2024 | 04:43 AM