Share News

Manchiryāla- వాగులు దాటేదెలా?

ABN , Publish Date - May 29 , 2024 | 10:51 PM

జన్నారం మండలంలోని లోతొర్రె, గోండుగూడ, రోటిగూడ వాగులపై వంతెనలు లేక ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. మండలంలోని గిరిజన గ్రామాలైన లోతొర్రె గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా తీర్చిదిద్దారు

Manchiryāla-          వాగులు దాటేదెలా?
లోతొర్రె గ్రామానికి వెళ్లేందుకు వాగును దాటుతున్న గ్రామస్థులు (ఫైల్‌)

- లోతొర్రె, గోండుగూడ, రోటిగూడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తే రాకపోకలకు ఇబ్బందులు

- ఈ ఏడాది తిప్పలు తప్పవని గ్రామస్థుల ఆవేదన

జన్నారం, మే 29: జన్నారం మండలంలోని లోతొర్రె, గోండుగూడ, రోటిగూడ వాగులపై వంతెనలు లేక ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. మండలంలోని గిరిజన గ్రామాలైన లోతొర్రె గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా తీర్చిదిద్దారు. కానీ ఈ గ్రామానికి వెళ్లేందుకు వాగుపై వంతెన నిర్మించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపక పోవడంతో ప్రజలు వర్షాకాలంలో రాకపోలకు అవస్థలు పడుతున్నారు. జన్నారం పంచాయతీ పరిధిలోని గోండుగూడకు వెళ్లే దారిలో ఉన్న జన్నారం వాగుపై వంతెన నిర్మాణం కల కలగానే మిగిలిపోయింది. మండలంలోని రోటిగూడ గ్రామపంచాయతీ వర్షాకాలం వచ్చిందంటే బయటి ప్రాంతానికి వెళ్లాలంటే రోజుల తరబడి బండోరా వాగు అడ్డుగా నిలుస్తుంది. ఈ మూడు వాగులపై ఎన్నికలకు ముందు వంతెనల నిర్మాణానికి ప్రతిపాద నలు చేసి నిధులు మంజూరు చేశారు. కాగా ఇప్పటికీ పనులు సాగడం లేదు.

- వాగులు ఉప్పొంగితే..

మండలంలోని లొతొర్రె గ్రామం, గోండుగూడ, రోటిగూడ గ్రామాలతో పాటు పలు గ్రామాలకు సైతం సరైన రోడ్లు, వాగులపై వంతెనలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతొర్రె గ్రామానికి, దేవునిగూడ గ్రామానికి మధ్యలో ఉన్న వాగు వర్షాకాలం వచ్చిందంటే కవ్వాల టైగర్‌ జోన్‌లోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తాయి. దీంతో రోజుల తరబడి వాగు పొంగడం వల్ల లోతొర్రె, చిన్న లోతెర్ర గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి రోజుల తరబడి బిక్కు బిక్కుమంటూ జీవనం వెళ్లదీసే పరిస్థితి నెలకొంది. ఆరోగ్యం, అత్యవసర ఇబ్బందులు తలెత్తితే ప్రమాదకరంగా వాగు దాటి వెళ్లాల్సివస్తుంది. జన్నా రం పంచాయతీలోని గోండుగూడలోని వాగు వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తుంది. జన్నారం గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ పొలాలు, వాగుకు అటు వైపున్న గోండుగూడ, పలు గ్రామాలు అధికంగా ఉండడంతో వాగు ఉప్పొంగితే రైతులు, ప్రజలు ఏం చేయలేని పరిస్థితి దాపురించింది. రోటిగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఉ న్న బండోరా వాగు వర్షాలకు ఉప్పొంగి రాకపోకలకు నిలిచిపోతుంటాయి.

- టెండర్‌ ప్రక్రియ పూర్తయినా..

మండలంలోని లోతొర్రె గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో యుద్ధప్రతిపాదికన డీఎంఎఫ్‌టీ నిధుల కింద రూ. 30 లక్షలు మంజూరు చేయగా, కలెక్టర్‌ నిధుల నుంచి రూ. 20 లక్షలు మంజూరయ్యాయ. టెండరు ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. టెండరు దక్కించుకున్న గుత్తేదారు చేతులెత్తయడంతో నిధులు సరిపోవని ఎవరు ముందుకు రావడం లేదు . దీంతో రీ టెండరు వేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిన క్రమంలో ఎన్నికల కోడ్‌ వచ్చింది. అదే విధంగా గోండుగూడ, జన్నారం మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపగా ఎస్‌టీఎస్‌డీ ఎఫ్‌ (ట్రైబల్‌ ) నిధులు మంజూరు కాగా టెండరు ప్రక్రియ మొదలు పెట్టలేదు. రోటిగూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై మహ్మదాబా ద్‌-రోటిగూడ గ్రామాల మధ్యలో ఉన్న బండోరా వాగుపై టీఆర్‌ఆర్‌ నిధులు రూ. 2 కోట్లు మంజూరు కాగా ఇంకా టెండరు ప్రక్రియకు నోచుకోలేదు. కాగా లోతొర్రె, గోండుగూడ,రోటిగూడ వాగులపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా టెండర్లకు ఎన్నికల కోడ్‌ అడ్డు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఈ విషయంపై పీఆర్‌ జేఈ సతీష్‌ వివరణ కోరగా ఈ మూడు వాగులపై వంతెనల నిర్మాణా నికి ప్రతిపాదనలు ఇప్పటికే పంపించామనని చెప్పారు. నిధులు మం జూరయ్యాయని,. త్వరలోనే వంతెనల నిర్మాణం చేపడతామని తెలిపారు.

వర్షాకాలం వస్తే నరకయాతనే..

- శంకర్‌ నాయక్‌, లోతొర్రె మాజీ ఉపసర్పంచు

వర్షాకాలం వస్తే లోతొర్రె గ్రామ ప్రజల పరిస్థితి దయనీయంగా మా రుతుంది. అత్యవసరంగా ఉంటే వాగు దాటి వెళ్లాల్సిందే. భారీ వర్షాలకు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగు దాటడం నరయా తనగా మారింది. పలుమార్లు వాగులో పడి ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉన్నా ప్రభుత్వాలు వాగుపై వంతెన నిర్మించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించివాగుపై వంతెన వేగంగా నిర్మించాలి.

- వంతెనల నిర్మాణం చేపటాలి..

-ఎర్ర చంద్రశేఖర్‌, జడ్పీటీసీ

మండలంలోని లోతొర్రె, గోండుగూడ, రోటిగూడ గ్రామాల ప్రజలు వాగులపై వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో వాగులు దాటలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. వంతెనల నిర్మా ణం టెండరు ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నిర్మాణాలు మొదలు పెట్టాలి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పనులు పూర్తి చేయాలి.

Updated Date - May 29 , 2024 | 10:51 PM