Share News

బీజేపీపై జనంలో మౌన వ్యతిరేకత

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:52 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుంది? ఇండియా కూటమి ఎన్ని గెల్చుకుంటుంది? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. దేశ రాజధానిలో దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎన్డీఏకు, తమకు మధ్య 50 నుంచి 70 సీట్లకు మించి తేడా ఉండకపోవచ్చున

బీజేపీపై జనంలో మౌన వ్యతిరేకత

ఆ పార్టీకి 370, ఎన్డీఏకి 400 సీట్లు అసాధ్యం.. మోదీ హవా తగ్గింది..

విపక్షాలపై అణిచివేత వికటించనుంది

పలు రాష్ట్రాల్లో బీజేపీ స్కోరు తగ్గడమేగానీ పెరగదు

ఫలితాల తర్వాత ఎన్డీఏ పార్టీలు సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది

తటస్థ పార్టీలూ కీలకపాత్ర పోషిస్తాయి

‘ఇండియా కూటమి’ అంచనాలు

250 సీట్ల వరకూ సాధించగలమని ధీమా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుంది? ఇండియా కూటమి ఎన్ని గెల్చుకుంటుంది? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. దేశ రాజధానిలో దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎన్డీఏకు, తమకు మధ్య 50 నుంచి 70 సీట్లకు మించి తేడా ఉండకపోవచ్చునని ఇండియా కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు వారు అనేక కారణాలు చూపిస్తున్నారు. 1. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు మోదీ వ్యవహార శైలి నచ్చని అనేక ఇతర వర్గాలవారు మౌనంగా సంఘటితమవుతున్నారు. వారే ఈ ఎన్నికల్లో నిర్ణాయక శక్తిగా మారనున్నారు. 2. 2019తో పోలిస్తే 2024లో మోదీ హవా అంతగా లేదు. జనంలో ఆయన మీద మోజు తగ్గిపోతోంది. 3. గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీ, గుజరాత్‌, కర్ణాటక, హరియాణా, అస్సాం, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. ఈసారి ఆయా రాష్ట్రాల్లో ఎంతో కొంత నష్టం తప్పదు 4. బీజేపీకి మోదీ ఏకైక నాయకుడిగా మారటంతో రాష్ట్ర, జాతీయస్థాయి అన్ని ఎన్నికల్లోనూ ఆయన మీదే ఆధారపడే పరిస్థితి ఆ పార్టీకి ఉంది. పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి నేతలను పెద్దఎత్తున బీజేపీలో చేర్చుకుంటున్నారు. ఇది ఆ పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. 5. ప్రతిపక్ష పార్టీలపై ఓవైపు తీవ్ర అణిచివేత చర్యలకు పాల్పడుతూ మరోవైపు వారినే అవినీతిపరులుగా చిత్రిస్తూ మోదీ చేస్తున్న ప్రచారం పస కోల్పోతోంది. ఇది వికటించే అవకాశాలున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీఏకు, ఇండియా కూటమికి మధ్య 50 నుంచి 70 సీట్ల తేడా మాత్రమే ఉంటే.. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలే కాక బీజేడీ, అకాలీదళ్‌, అన్నాడీఎంకే వంటి తటస్థంగా ఉన్న పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని ఇండియా కూటమి భావిస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏలో అజిత్‌ పవార్‌ ఎన్సీపీ, ఏక్‌నాథ్‌షిండే శివసేన, నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్‌ పాశ్వాన్‌ నాయకత్వంలోని లోక్‌జనశక్తి, అప్నాదళ్‌, ఆర్‌ఎల్డీ, తెలుగుదేశం, జనసేన ఉన్నాయి. ఎన్నికల అనంతరం ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఫలితాలనుబట్టి రాజకీయ సమీకర ణల్లో భాగమయ్యే అవకాశాలు లేకపోలేదని ఇండియా కూటమి వర్గాలు తెలిపాయి. మరోవైపు గత ఎన్నికలతో పోలిస్తే వివిధ రాష్ట్రాల్లో ఫలితాలు మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. రామమందిర ప్రభావం ఎంత ఉన్నా ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లలో ఈసారి 15 సీట్లన్నా తమకు దక్కుతాయని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఆ రాష్ట్రంలో బీసీలు, మైనారిటీలు సంఘటితం కావడం, మాయావతి ప్రభావం దాదాపు తగ్గిపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. మహారాష్ట్రలో అజిత్‌ పవార్‌, ఏక్‌నాథ్‌ షిండే బీజేపీతో చేతులు కలిపినాప్రజలు శరద్‌ పవార్‌, ఉద్దవ్‌ ఠాక్రేల వైపే సానుకూలంగా ఉన్నారని, ఈసారి తమ కూటమి మొత్తం 48 సీట్లలో సగమైనా సాధిస్తుందని పేర్కొంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పుంజుకుంటున్నా మొత్తం 42 సీట్లలో 20 దాటే అవకాశాలు లేవని వారు భావిస్తున్నారు. బిహార్‌లో గత ఎన్నికల్లో ఎన్డీఏ 39 సీట్లు సాధించిందని, తరచూ పార్టీలు మారే నితీష్‌ కుమార్‌ విశ్వసనీయత తగ్గిపోవడం, వివిధ సామాజిక వర్గాలు, మైనారిటీలు సంఘటితమై ఇండియా కూటమికి దన్నుగా నిలవటం వల్ల ఎన్డీఏ సంఖ్యాబలంఈసారి 25 సీట్లకు దాటే అవకాశాలు లేవని అంటున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లలో దాదాపు అన్ని సీట్లు గత ఎన్నికల్లో బీజేపీ గెల్చుకుంది. ఈసారి ఆ రాష్ట్రాల్లో 8 నుంచి 10 సీట్లు కోల్పోవచ్చని తెలుస్తోంది. కర్ణాటకలో గత ఎన్నికల్లో 28 సీట్లలో 25 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ సంఖ్యాబలం ఈసారి 15 సీట్లలోపే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి.

తెలంగాణలో నాలుగు కష్టమే

తెలంగాణలో బీజేపీ గతంలో గెలుచుకున్న నాలుగు సీట్లనే నిలబెట్టుకోవడం కష్టమని, తమిళనాడు, కేరళలో ఆ పార్టీకి సీట్లు వచ్చే అవకాశాలు లేవని ఇండియా కూటమి వర్గాలు తెలిపాయి. ఇక ఒడిశాలో గతంలో మాదిరే గరిష్ఠంగా 8 సీట్లకు మించి గెలుచుకోలేదని, అస్సాంలో ఏడు సీట్లు గెలుచుకోవచ్చని వారు అంటున్నారు. జార్ఖండ్‌లో 10, ఛత్తీ్‌సగఢ్‌లో 8, హర్యానాలో 7, ఉత్తరాఖండ్‌లో మూడు సీట్లు గెలుచుకున్నా బీజేపీకి అధికారం దక్కదని పేర్కొన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ అరెస్టు కారణంగా వచ్చిన సానుభూతితో ఇండియా కూటమి కనీసం 3 సీట్లనైనా గెల్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద బీజేపీ చెబుతున్నట్లుగా సొంతంగా 370 సీట్లు, ఎన్డీఏ కూటమి 400 సీట్లకుపైగా సీట్లను సాధించే పరిస్థితి లేదని చెబుతున్నాయి.

Updated Date - Apr 16 , 2024 | 03:52 AM