Share News

మా ఎమ్మెల్యేను ఎలా చేర్చుకున్నారు?

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:03 AM

‘కాంగ్రెస్‌ చేపట్టింది.. జనజాతర సభ కాదు.. హామీల పాతర.. అబద్ధాల జాతర సభ’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శనివారం

మా ఎమ్మెల్యేను ఎలా చేర్చుకున్నారు?

కాంగ్రెస్‌ రీతి.. నీతి ఇదేనా?

ఫిరాయింపులపై చట్టసవరణ అన్నారు..

జనజాతర సభ కాదు.. హామీల పాతర సభ

న్యాయ్‌ పేరిట నయా నాటకం: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ చేపట్టింది.. జనజాతర సభ కాదు.. హామీల పాతర.. అబద్ధాల జాతర సభ’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శనివారం కాంగ్రెస్‌ చేపట్టిన జనజాతర సభపై ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా కాంగ్రెస్‌ నయవంచన చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారని, రుణమాఫీ లేక అప్పులపాలవుతున్నారని, తాగునీటికి ప్రజలు తండ్లాడుతున్నారని, కాంగ్రెస్‌ మోసాలపై మహిళలు మండిపడుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరిట గారడీ చేసిన రాహుల్‌ గాంధీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముందు న్యాయ్‌ పేరిట నయా నాటకానికి తెరతీశారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయ్‌ అంటే నమ్మేదెవరన్నారు. ‘వాళ్లకు అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదా? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా? 200 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా? చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా? డిసెంబరు 8న చేస్తానన్న రుణమాఫీపై ఎందుకు మాట్లాడరు?’ అని రాహుల్‌గాంధీపై కేటీఆర్‌ ప్రశ్నం వర్షం కురిపించారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా వెనుకబడి ఉన్నారంటే కారణం కాంగ్రెస్సేనని మండిపడ్డారు. కులగణన పేరిట కొత్త పల్లవి అందుకున్న కాంగ్రె్‌సకు ఓట్లు రాలవని, చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు. వంద రోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రె్‌సకు లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం ఖాయమని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ది ద్వంద్వనీతి

ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీలోకి వెళితే.. వెంటనే వారిపై అనర్హత వేటు పడేలా చట్టసవరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ఎలా చేర్చుకున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రీతి.. నీతి ఇదేనా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రె్‌సలో చేరిన సందర్భంగా ఆ పార్టీ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వనీతి అని ఆక్షేపించారు. బీజేపీకి, కాంగ్రె్‌సకు తేడా ఏమిటని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్‌గాంధీ ఎన్నో మాట్లాడారని, గెలిచే వరకు ఒక మాట.. గెలిచాక మరొకమాట అన్నట్లుగా కాంగ్రెస్‌.. సిగ్గు లేకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను చేర్చుకుందని కేటీఆర్‌ విమర్శించారు.

మరో మోసానికి కాంగ్రెస్‌ సిద్ధం

అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్‌.. తుక్కుగూడ సభతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైందని మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌తోక లిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా.. రాష్ట్ర సంపదను దోచుకోవడంపై దృష్టిపెట్టారన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, దోచుకోవడం కోసమే కష్టపడుతున్నారా? అని ప్రశ్నించారు. ఓవైపు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అంటూనే మరోవైపు.. తమ పార్టీ ఎమ్మెల్యేను పక్కన కూర్చొబెట్టుకున్న కాంగ్రెస్‌ నేతల తీరును ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 04:36 AM