Manchiryāla- పండగ పూట ప్రయాణమెలా..?
ABN , Publish Date - Oct 02 , 2024 | 10:39 PM
బతుకమ్మ పండగ వచ్చిందం టే ఆడపడుచులు వారి తల్లిగా రింటికి బయలుదేరుతారు. దీనికి తోడు పాఠశాలలకు ఈ నెల 1 నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. విద్యార్థుల్లో ఎక్కువ మంది హైదారాబాద్ లాంటి సుదూర ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా ప్రధానంగా వారంతా రైళ్ల ద్వారానే ప్రయాణాలు సాగిస్తుంటారు.
- విద్యాలయాలకు సెలవులతో విపరీతమైన రద్దీ
- విధిలేని పరిస్థితుల్లో బస్సుల్లో ప్రయాణం
మంచిర్యాల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండగ వచ్చిందం టే ఆడపడుచులు వారి తల్లిగా రింటికి బయలుదేరుతారు. దీనికి తోడు పాఠశాలలకు ఈ నెల 1 నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. విద్యార్థుల్లో ఎక్కువ మంది హైదారాబాద్ లాంటి సుదూర ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా ప్రధానంగా వారంతా రైళ్ల ద్వారానే ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే ఈసారి పండగకు విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. మూడో లైను పనుల కారణంగా వరంగల్, కాజీపేట మీదుగా వెళ్లే రైళ్లను ఈ నెల 7 వరకు రద్దు చేశారు. ప్రత్యేక రైళ్లను ప్రకటించినా వాటిలో చాలా వరకు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు, ప్రజలు బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. బతుకమ్మ, దసరా పండగకు ఆర్టీసీ అదనపు బస్సులను నడు పుతోంది. రైళ్ల ద్వారా ప్రయాణించే వారంతా బస్సులపైన ఆధారపడుతు న్నారు. దీంతో బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటుండటంతో ఇబ్బం దులు తప్పడం లేదు.
- హైదరాబాద్‌కు రైళ్లు కరువు..
మంచిర్యాల మీదుగా హైదరాబాద్‌కు అక్కడి నుంచి ఇటువైపు ప్రయాణం చేసేందుకు ప్రస్తుతం రైళ్లు కరువయ్యాయి. మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి నిత్యం సుమారు 6వేల మంది వివిధ ప్రాంతాలకు రాక పోకలు సాగిస్తుంటారు. వారిలో సింహభాగం హైద్రాబాద్‌కే వెళ్తుంటారు. నిత్యం తెల్లవారుజామున ఐదు గంటలకు మంచిర్యాల నుంచి బయల్దేరే భాగ్యనగర్‌తోపాటు కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీ రైళ్లను గతకొద్ది రోజులుగా రద్దు చేశారు. రోజువారీ నడిచే రైళ్లతోపాటు వీక్లీ ట్రైన్లు కూడా నవడం లేదు. కొత్తగూడెం వెళ్లే సింగరేణి, కరీంనగర్‌కు వెళ్లే పుష్ఫుల్, కాజీపేటకు వెళ్లే రామగిరి రైళ్లను గతంలోనే రద్దు చేశారు. కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల ప్రాంతాల నుంచి జమ్మికుంట, ఓదెల, కొలనూరు, కాజీపేట, వరంగల్, హైద్రాబాద్‌లకు నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తారు. బల్లార్ష మార్గంలో పెద్దపల్లి, రామగుం డం, మంచిర్యాల లాంటి ప్రాంతాలకు వెళ్లడానికి రైలు మార్గమే సులు వైంది. ప్రస్తుతం రైళ్లు రద్దు కావడంతో ప్రయాణీకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- ప్రజలకు వ్యయప్రయాస..
రైళ్లు రద్దు కావడంతో బస్సు ప్రయాణాలు చేసేందుకు ప్రజలు అధిక వ్యయ, ప్రయాసలకు గురి కావలసి వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళ లకు ఉచిత ప్రయాణం కారణంగా రద్దీ అధికమవుతోంది. దీంతో చార్జీలు అధికంగా ఉండే డీలక్స్, సూపర్ డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి వంటి ఉన్నత స్థాయి బస్సులను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. రద్దీ కారణంగా వాటిలోనూ సీట్లు దొరక్క ఇబ్బందులు పడాల్సిన పరిస్థితు లు నెలకొన్నాయి. కాగా బస్సుల్లో అధిక చార్జీల కారణంగా ప్రయాణికు లకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రూ. 200 లోపే చార్జీలు ఉండగా, బస్సుల్లో రూ. 400 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అలాగే సూపర్ ఫాస్ట్ రైళ్లకు రూ. 400 వరకు చార్జీలు ఉండగా, లహరి బస్సుల్లో రూ. 600 వసూలు చేస్తున్నారు. బస్సు ప్రయాణాల్లో రద్దీ అధికంగా ఉండటంతోపాటు అధిక చార్జీల భారాన్ని కూడా మోయాల్సి వస్తోంది.
- పైవ్రేటు వాహనాలకు..
రైళ్ల రద్దు కారణంగా పైవ్రేటు వాహనాలకు గిరాకీ బాగా పెరిగింది. ఇప్పటికే హైద్రాబాద్‌కు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్‌లో సీట్లు బుక్‌కాగా, కార్లలో నూ అధిక సంఖ్యలో ప్రయాణాలు నమోదవుతున్నాయి. పండుగ రోజుల్లో ప్రైవేటు వాహనాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో రోజువారీ ప్రయాణానికి నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారు. మంచిర్యాల నుంచి హైద్రాబాద్‌కు 5 సీట్ల వాహనాల్లో వెళ్లాలంటే తక్కువలో తక్కువ రూ. 6వేలు వసూలు చేస్తున్నారు. అదే సెవెన్ సీటర్ వెహికిల్ అయితే రూ. 9 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది.
- ప్రత్యేక రైళ్లతో ఉపశమనం...
కాగా పండుగ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం ఉత్తర మధ్య రైల్వే జోన్ అధికారులు 01927/28 నంబర్లుగల ప్రత్యేక రైళ్లను నడుపనుండడంతో కొంతమేర ఉపశమనం కలుగనుంది. కాన్పూర్- మధురై-కాన్పూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైళ్లను ఈ నెల 9 నుంచి జనవరి 3వ తేదీ వరకు మూడు నెలలపాటు నడుపనున్నారు. ఈ రైళ్లకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్‌లలో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైళ్ల ద్వారా ఉమ్మడి జిల్లా నుంచి తమిళనాడులోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాలైన పళనీ సుబ్రహ్మాణ్య స్వామి ఆలయం, మధురై మీనాక్షి అమ్మవారి శక్తిపీఠం దర్శించుకోవడాని కి వీలు ఏర్పడుతుంది. కాన్పూర్ నుంచి మధురై 01927 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్‌కు ప్రతి గురువారం ఉదయం 8.45 గంటలకు చేరుకుంటుండగా, మధురై నుంచి కాన్పూర్ 01928 నంబ రుగల రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్‌కు ప్రతీ ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు చేరుకుంటుంది. ఈ రైళ్లను మొట్ట మొదటిసారిగా మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి మధురైకి అనుసంధానం చేశారు.