Share News

అమ్మకానికి సిద్ధంగా హెచ్‌ఎండీఏ ప్లాట్లు

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:17 AM

రాష్ట్రంలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ తీసుకొచ్చిన తర్వాత హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన తొలి లేఅవుట్‌లో ప్లాట్లు అమ్మకానికి సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌ మహానగర శివారులో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలోని కొత్తూరు మండలం ఇన్ముల్‌ నర్వాలో 95.25 ఎకరాలను, కందుకూరు

అమ్మకానికి సిద్ధంగా హెచ్‌ఎండీఏ ప్లాట్లు

ఇన్ముల్‌ నర్వాలో 95 ఎకరాలకు వచ్చిన ఫైనల్‌ లేఅవుట్‌

మరో మూడుచోట్ల 546 ఎకరాల్లో లేఅవుట్లకు సన్నాహాలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ తీసుకొచ్చిన తర్వాత హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన తొలి లేఅవుట్‌లో ప్లాట్లు అమ్మకానికి సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌ మహానగర శివారులో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలోని కొత్తూరు మండలం ఇన్ముల్‌ నర్వాలో 95.25 ఎకరాలను, కందుకూరు మండలంలోని 83 ఎకరాల్లో లేఅవుట్లను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. ఇన్ముల్‌ నర్వాలోని లేఅవుట్‌ను ఇటీవల హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్‌ అధికారులు మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడంతో ఫైనల్‌ లేఅవుట్‌ కూడా వచ్చింది. కేవలం లేమూరు లేఅవుట్‌ మాత్రమే ఫైనల్‌ లేఅవుట్‌ పెండింగ్‌లో ఉంది. ఓవైపు రైతులకు చెందాల్సిన వాటాను అప్పగించడంతోపాటు ఇతర ప్లాట్లను విక్రయించడానికి హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఈ రెండు లేఅవుట్లలో హెచ్‌ఎండీఏకు వాటాగా వచ్చే స్థలాలను విక్రయించడం ద్వారా సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఇదే తరహాలో శివారులోని మరో మూడు ప్రాంతాల్లో మొత్తంగా 546 ఎకరాలను రైతుల నుంచి సేకరించి లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం భూసమీకరణ పథకంలో భాగంగా.. ఉప్పల్‌ మండలంలోని ఉప్పల్‌ భగాయత్‌ గ్రామంలో హెచ్‌ఎండీఏ 733.08 ఎకరాలను సేకరించింది. అందులో కొన్ని భూములను వాటర్‌ బోర్డుకు, మెట్రో రైలుకు కేటాయించగా.. మిగతా 413.13 ఎకరాల్లో ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఫేజ్‌-3 లేఅవుట్‌లను అభివృద్ధి చేశారు. భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా, హెచ్‌ఎండీఏ వాటాగా వచ్చిన స్థలాలను విక్రయిస్తే.. రూ.1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దీంతో ఇదే తరహాలో ల్యాండ్‌ పూలింగ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు భూసమీకరణ పథకం-2017 తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నగర శివారులోని ఐదు ప్రాంతాల్లో రైతుల నుంచి 725 ఎకరాలను సేకరించి లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇన్ముల్‌ నర్వాలో ఫైనల్‌ లేఅవుట్‌కు కూడా హెచ్‌ఎండీఏ అనుమతులిచ్చింది. లేమూర్‌లో ఫైనల్‌ లేఅవుట్‌ పెండింగ్‌లో ఉంది. మరోవైపు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ప్రతాపసింగారంలో 129 ఎకరాల్లో, కీసర మండలం బోగారంలో 133 ఎకరాల్లో, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌ రెవెన్యూ పరిధిలోని 284 ఎకరాల్లో లేఅవుట్‌ అభివృద్ధి చేయడానికి రైతులు అంగీకరించారు. దాంతో హెచ్‌ఎండీఏ ఫామ్‌-1 నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఈ మూడు చోట్ల దాదాపు 546 ఎకరాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Updated Date - Mar 12 , 2024 | 11:15 AM