Share News

వాసవి ఇన్‌ఫ్రా నిర్మాణాల కొనసాగింపునకు హైకోర్టు నిరాకరణ

ABN , Publish Date - May 03 , 2024 | 04:45 AM

నిజాంపేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధి బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వాసవి ఇన్‌ఫ్రా నిర్మాణాలు కొనసాగించడానికి హైకోర్టు నిరాకరించింది. నిర్మాణాల కొనసాగింపు..

వాసవి ఇన్‌ఫ్రా నిర్మాణాల కొనసాగింపునకు హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): నిజాంపేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధి బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వాసవి ఇన్‌ఫ్రా నిర్మాణాలు కొనసాగించడానికి హైకోర్టు నిరాకరించింది. నిర్మాణాల కొనసాగింపు.. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టారా లేదా అన్న అంశాన్ని పూర్తిస్థాయి వాదనలు విన్న తర్వాత తేలుస్తామని పేర్కొంది. ఈ మేరకు విచారణను జూన్‌ 4కు వాయిదా వేస్తూ అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది. కోమటికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా వాసవి ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించిందని పేర్కొంటూ హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఇటీవల దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. అపార్ట్‌మెంట్లకు సంబంధించిన 8, 9వ అంతస్థుల నిర్మాణాల ఫొటోలు, మండల రెవెన్యూ కార్యాలయం, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సర్వేయర్‌లతో కూడిన బృందం చేసిన సర్వే రిపోర్టు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ పిటిషన్‌పై తాజాగా గురువారం చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాసవి ఇన్‌ఫ్రా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పాత నివేదికలతో పిటిషనర్‌ దురుద్దేశపూర్వకంగా పిటిషన్‌ వేశారని పేర్కొన్నారు. వినియోగదారులకు నష్టం కలగకుండా నిర్మాణాలు కొనసాగించేందుకు అనుమతివ్వాలని కోరారు. వాదనలు పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

Updated Date - May 03 , 2024 | 08:18 AM