Share News

మద్దిరాల, చౌటుప్పల్‌లో భారీ వర్షం

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:28 AM

ఉమ్మడి నల్లగొ ండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షపాతం నమోదైంది.

మద్దిరాల, చౌటుప్పల్‌లో భారీ వర్షం
చౌటుప్పల్‌ పట్టణంలో కురుస్తున్న వర్షం

మద్దిరాలలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం

పిడుగుపాటుకు 21 మూగజీవాలు మృత్యువాత

చౌటుప్పల్‌ టౌన్‌, పెద్దవూర, వలిగొండ, జూన్‌ 5: ఉమ్మడి నల్లగొ ండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా మద్దిరాలలో, యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో బుధవారం సాయంత్రం రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. మద్దిరాలలో ఐదు సెంటీమీటర్లు, చౌటుప్పల్‌లో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం కురియటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం నుంచి ఎండతో ఇబ్బందులు పడిన ప్రజలు ఉపశమనం పొందారు. పది రోజుల క్రితం విత్తిన పత్తి విత్తనాలకు ఈ వర్షం జీవం పోసింది. వలిగొండ మండలంలో బుధవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా చల్లపడి ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పూల్యాతండా, నీరుటువానిగూడెం గ్రామాల్లో మంగళవారం రాత్రి పిడుగుపాటుకు 20మేకలు మృత్యువాత పడ్డాయి. కుంకుడుచెట్టు గ్రామపంచాయతీలో నీరుటువానిగూడెంలో గ్రామానికి చెందిన నీరుటు సైదయ్యకు చెందిన ఎద్దు ఆరుబయట చెట్టుకు కట్టేయగా పిడుగుపాటుకు గురై మృతిచెందింది. సూర్యాపేట జిల్లాలో బుధవారం 40.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మద్దిరాలలో 40.9డిగ్రీలు, చిలుకూరు మండలంలో అత్యల్ప ంగా 37.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Jun 06 , 2024 | 12:28 AM