Share News

బంట్వారంలో భారీ వర్షం

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:05 PM

వికారాబాద్‌ నియోజకవర్గంలో వర్షం దంచికొట్టింది. బంట్వారం, మర్పల్లి, ధారూరు, మోమిన్‌పేట, నవాబుపేట వికారాబాద్‌ లో వర్షం భారీగా కురిసింది.

 బంట్వారంలో భారీ వర్షం
వాగులో కొట్టుక పోయిన కారు

వాగులో కొట్టుక పోయిన కారు

నలుగురు సురక్షితం

జైదుపల్లిలో ఎద్దు మృతి

అనంతగిరి రోడ్డులో విరిగిపడిన చెట్లు

వికారాబాద్‌/బంట్వారం/ధారూరు/పూడూరు జూన్‌ 2 : వికారాబాద్‌ నియోజకవర్గంలో వర్షం దంచికొట్టింది. బంట్వారం, మర్పల్లి, ధారూరు, మోమిన్‌పేట, నవాబుపేట వికారాబాద్‌ లో వర్షం భారీగా కురిసింది. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం నాగ్వారం గ్రామ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపట్టారు. పరిగి నియోజకవర్గం మైసమ్మగడ్డ తండాకు చెందిన నలుగురు యువకులు విశాల్‌, పాండు, నరేష్‌, రాకేష్‌లు బంట్వారం మండలం నాగ్వారం తండాకు ఓ వేడుకకు వచ్చారు. వేడుకను ముగించుకుని బంట్వారం వెళుతుండగా భారీ వర్షం రావడం నాగ్వారం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా అలాగే ముందుకు వెళ్లడంతో కారు కొట్టుకుపోయింది. దీంతో నలుగురు కిందకు దిగి కారును కాపాడుకునే యత్నం చేయగా విశాల్‌ ,పాండు నీటిలో కొట్టుకు పోయారు. కొద్ది దూరం వెళ్లగా చెట్లను పట్టుకుని ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో విశాల్‌కు చేతికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి కారును బయటకు తీశారు. అదే విధంగా బంట్వారం మండలంలోని పటు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. బంట్వారం బస్టాండ్‌ వరద నీటితో నిండిపోయింది. వికారాబాద్‌ మండల పరిధిలోని జైదుపల్లిలో రాములుకు చెందిన ఎద్దు పిడుగు పాటుకు గురై మృతి చెందింది. అనంతగిరి ఘాట్‌ రోడ్డులో భారీ వర్షానికి చెట్లు విరిగిపడగా రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ధారూరు, పూడురు మండలాలతో పాటు తిర్మలాపూర్‌, సోమన్‌గుర్తి, రాకంచర్ల తదితర గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. దుక్కులు దున్నటానికి ఈ వర్షం ఉపకరిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 11:05 PM