Share News

భిన్న మతాల సమ్మేళనం హజరత్‌ జహంగీర్‌పీర్‌ దర్గా

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:07 PM

హజ్రత్‌ జహంగీర్‌పీర్‌ (జేపీ) దర్గా ఉర్సుకు సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉర్సును నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ దర్గా భిన్న మతాలకు ప్రతీకగా నిలుస్తోంది.

భిన్న మతాల సమ్మేళనం హజరత్‌ జహంగీర్‌పీర్‌ దర్గా
విద్యుత్‌ దీపాల వెలుగుత్లో దర్గా ముఖద్వారం

- నేటి నుంచి దర్గా ఉర్సు ఉత్సవాలు

- మూడు రోజుల పాటు నిర్వహణ

కొత్తూర్‌, జనవరి 17: హజ్రత్‌ జహంగీర్‌పీర్‌ (జేపీ) దర్గా ఉర్సుకు సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉర్సును నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ దర్గా భిన్న మతాలకు ప్రతీకగా నిలుస్తోంది. కుల, మతాలకతీతంగా వేలాదిమంది భక్తులు దర్గాను దర్శించకుని మొక్కులు తీర్చుకుంటారు. రాష్ట్ర రాజఽధానికి 45కిలోమీటర్ల దూరంలో కొత్తూర్‌ మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో ప్రశాంత వాతావరణంలో దర్గా నెలకొని ఉంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాక, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకుంటారు. గిరిజనులు కుటుంబసభ్యులతో ఎడ్లబండ్లపై తరలివచ్చి దర్గాలో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ఉర్సును పురస్కరించుకుని జేపీ దర్గా విద్యుత్‌ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉర్సు ఉత్సవాల కోసం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారులు భక్తులకు ఏర్పాట్లను పూర్తి చేశారు.

నేటి నుంచి ఉర్సు

హజ్రత్‌ జహంగీర్‌పీర్‌ (జేపీ) దర్గా ఉర్సు గురువారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు పేర్కొంది. 18న గంధోత్సవం, 19న దీపారాధన, 20న ఖత్మేఖురాన్‌తో ముగింపు నిర్వహిస్తారు.

ప్రత్యేకంగా బస్సులు

ఉర్సుకు వచ్చే భక్తుల కోసం హైదరాబాద్‌లోని పలు డిపోల నుంచి జేపీ దర్గాకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి ఆర గంటకు ఆఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయని తెలిపారు.

భారీ బందోబస్తు

ఉర్సును పురస్కరించుకుని శంషాబాద్‌ జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఏసీపీ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో జేపీ దర్గాలో మూడు రోజుల పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు తెలిపారు. 150మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యక్తులపై అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జేబుదొంగల బారిన పడకుండా భక్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజల సౌకర్యార్థం దర్గాలో ఔట్‌పోస్టు ఏర్పాటు చేశామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

భక్తిశ్రద్ధలతో గుసూల్‌ ఏ షరీఫ్‌

హజ్రత్‌ జహంగీర్‌పీర్‌ దర్గాలో బుధవారం తెల్లవారుజామున గుసూల్‌ ఏ షరీఫ్‌ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి యేటా మకర సంక్రాంతి అనంతరం వచ్చే దర్గా ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని ఒకరోజు ముందు భక్తుల ఆధ్వర్యంలో గుసూల్‌ ఏ షరీఫ్‌ కార్యక్రమానికి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున సమాధులను పాలతో శుభ్రం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొత్తూర్‌ జడ్పీటీసీ మాజీ సభ్యుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి దర్గాకు చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆగీర్‌ రవికుమార్‌గుప్త, శంకర్‌నాయక్‌, కొర్ర రవి, బాబు, ప్రేమ్‌, బిచ్యా, బాసు, ఆంజనేయులు, కాలేద్‌, బాల్‌రాజ్‌, శేఖర్‌, దశరథ్‌, ఖాజా, శౌకత్‌, సాదక్‌, శ్రీకాంత్‌, హబీబ్‌, రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:07 PM