Share News

అమ్మ రైస్‌మిల్లులో 749 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - May 21 , 2024 | 12:16 AM

ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు.

అమ్మ రైస్‌మిల్లులో 749 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత
నల్లగొండలో వివరాలు వెల్లడిస్తన్న ఎస్పీ చందన దీప్తి

రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

నల్లగొండ/నల్లగొండ టౌన్‌, మే 20: ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. జిల్లాలోని పెద్దవూర మండలం తెప్పలమడుగు స్టేజీవద్ద ఉన్న అమ్మ రైస్‌మిల్లులో 749బస్తాల రేషన్‌ బియ్యం పట్టుబడిన నేపథ్యంలో ఎనిమిదిమంది నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుల్లో అమ్మ రైస్‌మిల్లు యజమాని మల్గిరెడ్డి రామాంజిరెడ్డి, హాలియా పట్టణానికి చెందిన బూర్గు శ్రీనివాసులుతో పాటు కుక్కడపు రమేష్‌, పేర్ల శ్రీకాంత్‌, లింగాల మల్లేష్‌, వెంపటి సంతోష్‌కుమార్‌, లింగంపల్లి సైదులు, ఎడ్ల ఆంజనేయులు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని పలు రైస్‌మిల్లులు రేషన్‌ బియ్యాన్ని ప్రభుత్వ గోదాం నుంచి నేరుగా మిల్లులకు అక్రమంగా దారి మళ్లించి లబ్ధి పొందుతున్నారన్నారు. బియ్యం అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. అమ్మ రైస్‌మిల్లులో బియ్యం అక్రమ నిల్వలు ఉన్నాయని తెలియడంతో టాస్క్‌ఫోర్స్‌ బృందంతో పాటు పెద్దవూర పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది తనిఖీ నిర్వహించి బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమ్మ రైస్‌మిల్లు యజమానితో పాటు ఇతర నిందితులపై వివిధ యాక్టుల కింద కేసు నమోదు చేశామన్నారు. రైతులు పండించిన ధాన్యం ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం గుర్తింపు పొందిన మిల్లులకు సరఫరా జరుగుతాయన్నారు. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి గోదాములోకి తరలిస్తారన్నారు. గోదాముల నుంచి రేషన్‌ డీలర్లకు సరఫరా అయి న తర్వాత కొందరు డీలర్లు లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా డబ్బులు, ఇతర వస్తువులు ఇస్తూ బియ్యాన్ని ఉంచుకుంటున్నారని తెలిపారు.

అక్రమాలకు పాల్పడిందిలా..

రైతులు పండించిన ధాన్యం ఐకేపీ సెంటర్‌ ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన రైస్‌మిల్లులకు సరఫరా అవుతాయి. ఆ ధాన్యాన్ని బియ్యంగా పట్టించి వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌ స్టేజ్‌-1 గోడౌన్‌లోకి సరఫరా చేస్తారు. వేర్‌ హౌస్‌ కార్పొరేషన్‌ గోడౌన్‌ నుంచి మండల్‌ లెవల్‌ స్టాక్‌ పాయింట్‌కు పంపి అక్కడి నుంచి గ్రామాల్లో రేషన్‌ డీలర్లకు సరఫరా చేస్తారు. సరఫరా చేసే లారీలకు ట్రక్‌ చిట్స్‌, జీపీఎస్‌ అమరుస్తారు. డీలర్‌ షాప్‌ నుంచి లబ్ధిదారులు తీసుకోవాల్సి ఉంటుంది. కాని కొందరు డీలర్లు లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చి, వేరే ఇతర వస్తువుల మార్పిడి పద్ధతి ద్వారా ఇచ్చి బియ్యాన్ని డీలర్ల వద్దనే ఉంచుకుంటారు. ఆ బియ్యాన్ని డీలర్లు మండలస్థాయి స్టాక్‌ పాయింట్‌ వద్ద నుంచి ప్రతి నెలా రావల్సిన స్టాక్‌ను తీసుకోకుండా డీలర్లు డబ్బు రూపంలో తీసుకుం టున్నారు. మండల స్థాయి స్టాక్‌ పాయింట్‌ వారు కూడా వేర్‌ హౌస్‌ కార్పొరేషన్‌ గోడౌన్‌ నుంచి స్టాక్‌ను సరఫరా చేసుకోకుండా డబ్బులు తీసుకుంటారు. ఈ బియ్యం వేర్‌ హౌస్‌ కార్పొరేషన్‌ గోడౌన్లో పని చేస్తున్న కొందరు అక్రమార్కులు రైస్‌ మిల్లర్స్‌తో కుమ్మకై ప్రభుత్వ గోదాం నుంచి నేరుగా ఇతర మిల్లులకు తరలిస్తున్నారు. వాటిని మిల్లర్లూ వేరే బ్యాగుల్లో నింపి తిరిగి అవే బియాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్‌ రైస్‌ సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రాల ద్వారా ఇతర దేశాలకు మరియు ఇతర పానియాల తయారీకి పక్కదారి పట్టిస్తున్నారు.

Updated Date - May 21 , 2024 | 12:16 AM