Share News

హరివిల్లై.. మెరిసె!

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:03 AM

‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన) రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని 83 కేంద్రాల్లో జనవరి 5, 6, 7 తేదీల్లో ఘనంగా జరిగాయి.

హరివిల్లై.. మెరిసె!

ఉత్సాహంగా ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు, యువతులు

తెలంగాణలో ఉమ్మడి జిల్లాల విజేతలకు 10న హైదరాబాద్‌లో ఫైనల్స్‌

ఏపీ, తమిళనాడు, కర్ణాటక విజేతలకు 11న విజయవాడలో

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన) రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని 83 కేంద్రాల్లో జనవరి 5, 6, 7 తేదీల్లో ఘనంగా జరిగాయి. 12 వేల మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ రంగవల్లులతో సంక్రాంతి శోభను ఇనుమడింపజేశారు. ప్రతి కేంద్రంలో ప్రథమ బహుమతి రూ.6,000, ద్వితీయ బహుమతి రూ.4,000, తృతీయ బహుమతి రూ.3,000తోపాటు అనేక కన్సొలేషన్‌ బహుమతుల్ని మహిళలు గెల్చుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపికైన పదిమంది మహిళలకు ఈ నెల 10న హైదరాబాద్‌లో ఫైనల్‌ పోటీలు జరుగుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని 13 పాత జిల్లాలు, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఒక్కొక్కరు... మొత్తం 15 మందికి ఈ నెల 11న విజయవాడలో ఫైనల్స్‌ జరుగుతాయి. ఫైనలిస్టులకు రూ.1,70,000కు పైగా బహుమతులు, ఇంకా గిఫ్ట్‌ హ్యాంపర్లు లభిస్తాయి.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని నిజామాబాద్‌, పాత కలెక్టరేట్‌ మైదానం, బోధన్‌, కామారెడ్డి, బాన్సువాడ కేంద్రాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో అత్యధికంగా 458 మంది మహిళలు, యువతులు హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో పోటీలను మంత్రి సీతక్క ప్రారంభించారు. హనుమకొండలోని సెయింట్‌ పీటర్స్‌ సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌ చర్చి కాంపౌండ్‌లో మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ స్వయంగా ముగ్గు వేసి పోటీలను ప్రారంభించారు. ఆశా వర్కర్‌ అయిన ఎం.కవిత (మడికొండ) ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. ఖమ్మంలో జరిగిన పోటీలకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురణకర్త కోగంటి వెంకట శేషగిరిరావు, ఖమ్మంలోని బిలీఫ్‌ ఆసుపత్రి నిర్వాహకురాలు మోడెంపూడి రమాజ్యోతి తదితరులు హాజరయ్యారు. మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో 11 ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఉప్పల్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్‌లో ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్‌, మెహిదీపట్నంలో ఎమ్మెల్యే టి.ప్రకా్‌షగౌడ్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, చిక్కడపల్లి, అబిడ్స్‌, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, తార్నాక, చార్మినార్‌, మెహిదీపట్నం, మల్కాజిగిరి కేంద్రాల్లో జరిగిన పోటీల్లో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 05:03 AM