Share News

హరీశ్‌ వ్యాఖ్యలు అర్థరహితం

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:56 AM

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి ఇవ్వడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న విమర్శలు అర్థ రహితమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

హరీశ్‌ వ్యాఖ్యలు అర్థరహితం

కృష్ణా జలాల వాటాపై సంతకం చేసిందెవరు..?

కేటీఆర్‌కు అహం తగ్గలేదు: రఘునందన్‌రావు

హైదరాబాద్‌, జనవరి 20(ఆంధ్రజ్యోతి): కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి ఇవ్వడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న విమర్శలు అర్థ రహితమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ విమర్శ చేసే ముందు.. 2016లో కేంద్ర జలవనరుల మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో తెలంగాణకు 299 టీఎంసీల నీరు చాలని సీఎం హోదాలో కేసీఆర్‌ సంతకం చేసిన సంగతిని గుర్తు చేసుకోవాలన్నారు. మొన్నటి వరకు అధికారంలో ఉండి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. పులి కాదని.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అని అన్నారు. కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంటే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, సంతోశ్‌, కవితలు పోటీచేయాలని సవాల్‌ చేశారు. వారెవరూ పోటీచేయరని చెప్పారు. ఒకవేళ పోటీ చేసినా ఒక్కరూ గెలవరని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు తెలంగాణ కోసం పార్లమెంటులో ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించిన దృష్ట్యా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన అధికారుల పేర్లు వెల్లడించాలని, కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 21 , 2024 | 02:56 AM