Share News

చేతికి వైర్‌ చుట్టి కరెంటు షాక్‌ పెట్టుకొని..

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:03 AM

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ తమ కూతురితో సహా ఆత్మహత్యకు యత్నించారు. ఇంట్లోనే చేతి మణికట్టుకు వైర్‌ చుట్టుకొని.. కరెంట్‌ షాక్‌తో ప్రాణాలు తీసుకోబోయారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది.

చేతికి వైర్‌ చుట్టి కరెంటు షాక్‌ పెట్టుకొని..

ఆర్థిక ఇబ్బందులతో కూతురితో సహా

భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ తమ కూతురితో సహా ఆత్మహత్యకు యత్నించారు. ఇంట్లోనే చేతి మణికట్టుకు వైర్‌ చుట్టుకొని.. కరెంట్‌ షాక్‌తో ప్రాణాలు తీసుకోబోయారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. చివరి నిమిషంలో తేరుకున్న కూతురు ప్రాణాలతో బయటపడింది. పోచారం మునిసిపాలిటీ ప్రతా్‌పసింగారంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేర్‌కు చెందిన రామకృష్ణచారి వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య విజయలక్ష్మి (35) ఇద్దరు పిల్లలతో కలిసి మూడేళ్ల నుంచి ప్రతా్‌పసింగారంలో అద్దెకు ఉంటున్నారు. అయితే కొద్దిరోజులుగా వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం కరెంట్‌ లేని సమయంలో భార్యాభర్తలిద్దరూ ఇంట్లోని పడక గదిలో చేతి మణికట్టుకు కరెంట్‌ వైర్‌తో చుట్టుకొని, కూతురు చేతికి సైతం వైర్‌చుట్టి స్విచ్‌ ఆన్‌ చేసి పడుకున్నారు. కరెంట్‌ రాగానే భార్య విజయలక్ష్మి మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా మారింది. కూతురుకు షాక్‌ తగలడంతో వెంటనే తేరుకుని బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకుంది. ఆ బాలిక స్థానికులకు విషయం చెప్పడంతో 108, పోలీసులకు సమాచారం ఇచ్చారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రామకృష్ణను ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Oct 27 , 2024 | 12:03 AM