Share News

2035 నాటికి విద్యార్థుల్లో సగం మంది ఇంజనీర్లే!

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:32 AM

దేశంలో 2035 నాటికి విద్యార్థుల్లో సగం మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లుగా బయటకు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) చైర్మన్‌

2035 నాటికి విద్యార్థుల్లో సగం మంది ఇంజనీర్లే!

ఇంజనీరింగ్‌ విద్యకు ప్రాధాన్యమిస్తూ విద్యావిధానంలో మార్పులు

ఏఐసీటీఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారామ్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): దేశంలో 2035 నాటికి విద్యార్థుల్లో సగం మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లుగా బయటకు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారామ్‌ పేర్కొన్నారు. పాఠశాల విద్య పూర్తి చేసుకుంటున్న విద్యార్థుల్లో ప్రస్తుతం 25 శాతం మందే ఇంజనీరింగ్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం జేఎన్‌టీయూలో ‘‘బావి భారతావనికి సాంకేతిక అవకాశాలు’’ అనే అంశంపై అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్‌ మహాసం్‌ఘ(ఏబీఆర్‌ఎ్‌సఎం) తెలంగాణశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సింపోజియంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామ్‌ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్‌ విద్యకు ప్రాధాన్యమిస్తూ విద్యావిధానంలో మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్‌ విద్యను ప్రాంతీయ భాషలోనే బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, దానివల్ల విద్యార్థులు వారి ఆలోచనను సూటిగా చెప్పగలుగు తారని పేర్కొన్నారు. 2047 నాటికి భారతీయ విద్యార్థులను అత్యంత నైపుణ్యం కలిగిన వారిగా, ఆవిష్కర్తలుగా, వ్యవస్థాపకులుగా, పరిశోధకు లుగా తీర్చిదిద్దడమే ఏఐసీటీఈ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నతవిద్య వరకు జాతీయ విద్యా విధానం అమలుతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. వన్‌ నేషన్‌ వన్‌ డేటా ప్రకారం ప్రతివిద్యార్థికి పాఠశాల నుంచి యూనివర్సిటీ విద్య వరకు ప్రత్యేకమైన ఐడీ(అపార్‌)ని ఇవ్వనున్నట్లు సీతారామ్‌ చెప్పారు. అనంతరం యూనివర్సిటీ ఆవరణలోని జే-హబ్‌లో ఏఐసీటీఈ నిధులతో ఏర్పాటు చేసిన ఐడియా ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. ఐడియా ల్యాబ్స్‌ ఏర్పాటుకు కళాశాలలు ముందుకు వస్తే ఏఐసీటీఈ నుంచి రూ.50 లక్షల ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీతారామ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 03:32 AM