Share News

హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ మాజీ ఓఎస్డీ హరికృష్ణ సస్పెన్షన్‌ ఉత్తర్వుల కొట్టివేత

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:44 AM

సస్పెన్షన్‌కు గురైన హకీంపేట స్పోర్ట్స్‌ పాఠశాల మాజీ ఓఎస్డీ టి.హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది.

హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ మాజీ ఓఎస్డీ హరికృష్ణ సస్పెన్షన్‌ ఉత్తర్వుల కొట్టివేత

కాంపిటెంట్‌ అథారిటీ జారీ చేయనందున సస్పెన్షన్‌ చెల్లదన్న హైకోర్టు

కుట్ర చేసి, ఇరికించి సస్పెండ్‌ చేశారు

కవిత, శ్రీనివాస్‌ గౌడ్‌ స్వార్థానికి నన్ను బలి చేశారు

మాజీ సీఎం పేషీలోని భూపాల్‌రెడ్డికి మసాజ్‌ చేసే వ్యక్తి

కుమారుడికి సీటు ఇవ్వలేదని నాపై కుట్ర: హరికృష్ణ

సస్పెన్షన్‌పై హైకోర్టుకు వెళ్లిన మాజీ ఓఎస్డీ

కాంపిటెంట్‌ అథారిటీ జారీ చేయలేదంటూ

సస్పెన్షన్‌ ఉత్తర్వుల కొట్టివేత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సస్పెన్షన్‌కు గురైన హకీంపేట స్పోర్ట్స్‌ పాఠశాల మాజీ ఓఎస్డీ టి.హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. కాంపిటెంట్‌ అథారిటీ మాత్రమే జారీ చేయాలంటూ ఆయన సస్పెన్షన్‌ ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది. హరికృష్ణపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను విధుల్లోంచి తొలగిస్తూ అప్పటి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ వీసీ అండ్‌ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి ఫిర్యాదు, విచారణ లేకుండా సస్పెండ్‌ చేయడం చెల్లదని, ఆధారాలు లేకపోయినా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేశారని, ఈ ఉత్తర్వులు చెల్లవని హరికృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ పశు సంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌గా నియమితులయ్యారని, 2020లో హకీంపేట స్పోర్ట్స్‌ పాఠశాలకు ఓఎస్డీగా డిప్యూటేషన్‌పై వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా, అధికార పరిధికి విరుద్ధంగా కేవలం ఆరోపణలు వచ్చాయని పేర్కొంటూ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. పిటిషనర్‌ డిప్యూటేషన్‌పై క్రీడా శాఖకు వెళ్లారని, సరైన కారణాలు, విషయ తీవ్రత ఉన్నా కాంపిటెంట్‌ అథారిటీ మాత్రమే సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయగలరని వ్యాఖ్యానించింది. ఈ కేసులో పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి అపాయింటింగ్‌ అథారిటీ అని.. ఇప్పటి వరకు ఎలాంటి చార్జి మెమో జారీ చేయలేదని గుర్తు చేసింది. రాష్ట్ర పశుసంవర్థక శాఖ సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నందున సదరు సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టి వేస్తున్నట్లు తుది తీర్పు జారీ చేసింది.

Updated Date - Feb 20 , 2024 | 07:51 AM