Share News

గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:39 PM

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో పొరపాట్లు జరగకుండా అధికారులు పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సూచించారు.

గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ -

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 7 : గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో పొరపాట్లు జరగకుండా అధికారులు పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సూచించారు. జూన్‌-9ననిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి చేపట్టాల్సిన విధి విధానాలపై శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌, ఐడెంటిఫికేషన్‌ అధికారులు, శాఖాపరమైన అధికారులు, పరీక్ష నిర్వహణ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణకు 93 కేంద్రాల్లో 55,692మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. రూట్‌ ఆఫీసర్లు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌, ఐడెంటిఫికేషన్‌ అధికారులు, లైజన్‌ అధికారులు పరీక్ష నిర్వహణలో తమకు కేటాయించిన విధులు పూర్తి బాధ్యతతో నిర్వహించాలన్నారు. పరీక్ష విధులు నిర్వహించే అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులను ఉదయం 9గంటల నుండి 10 గంటల వరకు అనుమతించడం జరుగుతుందని, తరువాత అనుమతి ఉండదని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌, టాయిలెట్స్‌, తాగునీరు ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రూట్‌ అధికారులు తమ లోకేషన్లను ముందస్తుగానే చూసుకోవాలని, శాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో వెళ్లి పర్యవేక్షించాలని తెలిపారు. పూర్తి పోలీసు బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు ప్రతిమాసింగ్‌ తెలిపారు. కార్యక్రమంలో టీజీపీఎస్సీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ గిరిధర్‌, సైబరాబాద్‌ ఏసీపీ మురళీకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:39 PM