Share News

జూన్‌ 9న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:47 AM

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారైంది.

జూన్‌ 9న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ

ఆర్థిక శాఖ ఆమోదం.. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌!

‘గ్రౌండ్‌ వాటర్‌’లో గెజిటెడ్‌, నాన్‌-గెజిటెడ్‌ పోస్టుల ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారైంది. జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎ్‌సపీఎస్సీ) అధికారులు సోమవారం ప్రకటించారు. 563 గ్రూపు-1 పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. వచ్చేనెల 14 వరకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. 2022 అక్టోబరు 16 నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ లీకేజీ కారణంగా రద్దవ్వగా.. గత ఏడాది జూన్‌లో రెండోసారి నిర్వహించిన పరీక్ష నిర్వహణలో నిబంధనలను పాటించడం లేదని గుర్తిస్తూ.. హైకోర్టు రద్దు చేసింది. దీంతో రేవంత్‌ సర్కారు టీఎ్‌సపీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి.. 503 పోస్టులతో ఇచ్చిన గత నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. మరో 60 పోస్టులను చేరుస్తూ.. మొత్తం 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చింది. ప్రిలిమ్స్‌ తేదీ ఖరారవ్వడంతో.. మెయిన్స్‌ కూడా సెప్టెంబరు/అక్టోబరులో జరగొచ్చని తెలుస్తోంది. కాగా.. ప్రిలిమ్స్‌కు సరిగ్గా 103 రోజులు ఉన్నాయని, అభ్యర్థులు ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే మెయిన్స్‌కు ఎంపికవ్వడం సులభమేనని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘టైమ్‌టేబుల్‌ను ప్రిపేర్‌ చేసుకుని షెడ్యూల్‌ ప్రకారం చదవాలి. 13 సబ్జెక్టులను వేర్వేరుగా కాకుండా, ఒక్కటిగా కలిపి చూడాలి. అర్థశాస్త్రం-విపత్తు నిర్వహణ-భౌగోళికశాస్త్రాలు.. చరిత్ర-రాజ్యాంగ క్రమం, రాజ్యాంగం-సమాజశాస్త్రం-ప్రజా పరిపాలన వంటి వాటికి లింకు ఉంటుంది. కలిపి చదువుకుంటే గుర్తుపెట్టుకునే అవకాశాలుంటాయి. అర్థమెటిక్‌, రీజనింగ్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. ఈ రెండూ స్కోరింగ్‌ను పెంచే అంశాలే..! తెలుగు అకాడమీ, అంబేద్కర్‌ వర్సిటీ ముద్రించిన సబ్జెక్టు పుస్తకాలను చదవడం మంచిది’’ టీఎ్‌సపీఎస్సీ, యూపీఎస్సీ కోచింగ్‌ ఫ్యాకల్టీ ఎం.సంతోష్‌రావు సూచిస్తున్నారు.

మెగా డీఎస్సీలో 11,062 పోస్టులు

మెగా డీఎస్సీని నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం..11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థిక శాఖ..11,062 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 27 , 2024 | 04:47 AM