గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్
ABN , Publish Date - Feb 20 , 2024 | 04:38 AM
నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి సర్కారు కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.
జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గత ఏడాది ప్రకటన రద్దు
సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు ఉపసంహరణ.. 563 పోస్టులు.. వయోపరిమితి రెండేళ్లు పెంపు
23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు.. గతంలో పరీక్ష రాసిన వారూ అప్లై చేసుకోవాలి
వారికి దరఖాస్తు ఫీజు మినహాయింపు.. మే/జూన్‌లో ప్రిలిమ్స్, సెప్టెంబరు/అక్టోబరులో మెయిన్స్
హైదరాబాద్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి సర్కారు కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. గత నోటిఫికేషన్‌పై సుప్రీం కోర్టులో నడుస్తున్న కేసును ఉపసంహరించుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం సోమవారం అనుమతి ఇచ్చింది. దీంతో పాత నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎ్‌సపీఎస్సీ) కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి గత నోటిఫికేషన్‌లో 503 పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా.. ఇప్పుడు మరో 60 పోస్టులను పెంచి.. మొత్తం 563 పోస్టుల భర్తీకి టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 18 విభాగాలకు చెందిన కొలువులు ఉన్నాయి. అన్ని పోస్టులకు సంబంధించి సర్కారు రెండేళ్ల వయోపరిమితిని పెంచింది. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు రూ.200 చెల్లించాలి. అభ్యర్థులు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకునేందుకు సమయం ఇచ్చారు. మార్చి 23 నుంచి 27 మధ్య దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష.. సెప్టెంబరు లేదా అక్టోబరులో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షల తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ ప్రశ్నల విధానంలో, మెయిన్ పరీక్షను రాతపూర్వకంగా సమాధాలు ఇచ్చే ప్రశ్నల పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పోస్టుల భర్తీలో 95 శాతం స్థానికత రిజర్వేషన్‌ను అమలు పరచనున్నారు. 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష ద్వారా మెయిన్‌కు ఒక పోస్టుకు 50 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్షను 150 మార్కులకు, మెయిన్ పరీక్షను 900 మార్కులకు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలు ఉండవు.
గతంలో రెండుసార్లు ప్రిలిమ్స్..
గత ప్రభుత్వం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ కోసం రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. మొదటిసారి పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశారు. రెండోసారి బయోమెట్రిక్ హాజరును తీసుకోలేదని, అధికారులు నిబంధనలను పాటించలేదని అభ్యర్థులు హైకోర్టులో కేసు వేశారు. దాంతో పరీక్షను రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనిపై గత ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రించింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసును వెనక్కి తీసుకుని, కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.