తొలిరోజు ప్రశాంతంగా గ్రూప్-1 మెయిన్స్
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:53 PM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
జిల్లాలో 17,779 మంది అభ్యర్థులకు 12 వేల మంది హాజరు
5779 గైర్హాజరు... అలస్యంగా వచ్చి న ముగ్గురు అభ్యర్థులు
కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్లు, సీపీ సుధీర్‌బాబు
మేడ్చల్ ప్రతినిధి/ఘట్‌కేసర్ రూరల్/మేడ్చల్‌టౌన్/కీసర(ఆంధ్రజ్యోతి), అక్టోబరు 21: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సోమవారం జిల్లాలోని 27 పరీక్షా కేంద్రాల్లో 17,779 మంది అభ్యర్ధులకు గాను 5779 మంది అభ్యర్ధులు గైర్హాజరు కాగా 12వేల మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్ధులను మధ్యాహ్నం 12.30 నుంచి 1.30గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. అదనపు కలెక్టర్ రాధికాగుప్తా, విజయేందర్‌రెడి, రాచకొండసీపీ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి హాల్‌లో 24 మంది అభ్యర్ధులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసిరగడిలోని హితం కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 989 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఘట్‌కేసర్, పోచారం మున్సిపాలిటీలోని 8పరీక్షా కేంద్రాల్లో 4,416 మందికిగాను 3,434 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 982 మంది గైర్హాజరయ్యారు. చౌదరిగూడ ప్రిన్సిటన్, ఎదులాబాద్‌లోని మెగా ఇంజనీరింగ్ కళాశాల, అవుషాపూర్‌లోని వీబీఐటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను రాచకొండ సీపీ సుధీర్‌బాబు, మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజారెడ్డిలు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవుషాపూర్ వీబీఐటీ కళాశాల వద్ద రెండుకిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో సీఐ పరుశురాం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఇద్దరు ఏసీపీలు, ఆరుగురుసీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు మొత్తం 80 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. చీర్యాల్‌లోని గీతాంజలి కళాశాలలో 936 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 521మంది హాజరయ్యారని, 415మంది ఆభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని కేంద్రం నిర్వాహకులు తెలిపారు. కాగా నిమిషం నిబంధనతో ముగ్గురు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఆభ్యర్థులు గంగా, వీరారెడ్డి, వేణు కేంద్రానికి ఆలస్యం వచ్చారు. పరీక్షకు ఆలస్యం అవుతుండటంతో కొంత మంది ఆభ్యర్థులను సీఐ వెంటకయ్య పోలీస్ వాహనంలో కేంద్రం వద్దకు తరలించారు.
దూరం నుంచి వచ్చే సరికి ఆలస్యం
కోదాడ నుంచి వచ్చే నగరానికి, అక్కడి నుంచి నుంచి పరీక్ష కేంద్రానికి వచ్చే సరికి ఆలస్యం జరిగింది. పరీక్ష కేంద్రానికి దూరం నుంచి వచ్చే సరికి ఆలస్యం కావడంతో అధికారులు అనుమతించలేదు. డిసెంబర్‌లో జరిగే గ్రూప్-2 పరీక్షకు సమయానికి కేంద్రానికి చేరుకుని పరీక్ష రాస్తా.
- వీరారెడి, ఆభ్యర్థి