Share News

గ్రూప్‌-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 29 , 2024 | 10:53 PM

జూన్‌ 9న గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌తో కలిసి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

గ్రూప్‌-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ శశాంక

రంగారెడ్డి అర్బన్‌, మే 29 : జూన్‌ 9న గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌తో కలిసి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా బయోమెట్రిక్‌ పద్ధతిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 93 సెంటర్లలో 55,692 మంది పరీక్షకు హాజరవున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావియ్యరాదని ఆయన సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. టాయిలెట్స్‌, తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, మెడికల్‌ సిబ్బంది పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ క్షుణ్ణంగా పరిశీలించాలని.. ఎక్కడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చూసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌, ఎలకా్ట్రనిక్‌ వస్తువులకు అనుమతి లేదన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుండి ఎవరూ బయటకు వెళ్లడానికి వీలు లేదన్నారు. సమావేశంలో రీజినల్‌ కోఆర్డినేటర్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మీ సేవ వెబ్‌ సైట్‌

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మీ-సేవ వెబ్‌ సైట్‌ అందుబాటులోకి రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ శశాంక తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో కమిషనర్‌ ఈఎస్‌డీ రవికుమార్‌తో కలిసి మీసేవ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరగకుండా చేపట్టవలసిన చర్యలపై తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయిలో జనన, మరణ, కుల, ఆదాయ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, రెసిడెన్సీ, ఇతర వెనుకబడిన తరగతుల ఽధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యాన్ని అధిగమించేందుకు మీసేవ వెబ్‌సైట్‌ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ వెబ్‌ సైట్‌ సేవలు అందించే విధానాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అధిక సంఖ్యలో వచ్చిన అప్లికేషన్లకు సంబంధించి ఫీల్డ్‌ వేరిఫికేషన్‌ను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించడం వలన సకాలంలో పౌరులకు పత్రాలను అందించడం జరుగుతుందని తెలిపారు. మీ-సేవ ఆపరేటర్లు అప్లోడ్‌ చేసే పత్రాలలో సరైన పత్రం ఉందో లేదో కనబరిచే విధంగా పని చేస్తుందని, బ్లాంక్‌ పత్రాలు అప్లోడ్‌ చేసినా వెబ్‌ సైట్‌ తిరస్కరిస్తుందని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం మండలస్థాయిలో తహశీల్దార్లకు, నాయబ్‌ తహశీల్దార్లకు, ఆపరేటర్లకు డివిజినల్‌ వారీగా శిక్షణ ఇవ్వనున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఈ పైలెట్‌ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తే జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో కూడా ఽధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం అధిగమించేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి, తహశీల్దార్లు, ఈడీఎం నాగభూషణం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 10:53 PM