గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై పీటముడి!
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:55 AM
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీపై పీటముడి పడింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టులో ఉన్న రెండు రిట్ పిటిషన్లకు సంబంధించి తుది తీర్పు వెలువడే వరకు ఎమ్మెల్సీలపై ఎలాంటి నిర్ణయం ఉండదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.
హైకోర్టులో కేసులు తేలాకే నిర్ణయమన్న గవర్నర్
ఈ నెల 24న హైకోర్టులో మరోసారి విచారణ
తిరస్కరణపై కోర్టుకెళ్లిన దాసోజు, సత్యనారాయణ
ప్రభుత్వం, గవర్నర్ కార్యదర్శికి కోర్టు ఆదేశాలు
తుది తీర్పు వచ్చేదాక నిర్ణయం ఉండదన్న గవర్నర్
హైదరాబాద్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీపై పీటముడి పడింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టులో ఉన్న రెండు రిట్ పిటిషన్లకు సంబంధించి తుది తీర్పు వెలువడే వరకు ఎమ్మెల్సీలపై ఎలాంటి నిర్ణయం ఉండదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన వెలువడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే, ఆయా రంగాల్లో ప్రత్యేకతలు, నైపుణ్యాలు, గుర్తించదగిన కృషి చేసినట్లు ఆధారాలు లేవంటూ గత ఏడాది సెప్టెంబరు 9న ఇద్దరి అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇవి ఈనెల 24న మరోసారి చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వలోని డివిజన్ బెంచ్ ఎదుట విచారణకు రానున్నాయి. కాగా, ఈ కేసుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేకపోయినా అవి పెండింగ్‌లో ఉండగా నిర్ణయం తీసుకోవడం అంత గౌరవప్రదం కాదని గవర్నర్ భావించారు. తుది తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీల భర్తీకి గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం ఉండదని స్పష్టం చేశారు. వివాదం లేకుండా చూసుకోవడంతో పాటు హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేశారు.
హైకోర్టులో ఏం జరిగింది?
గవర్నర్ తమ నామినేషన్‌లను తిరస్కరిస్తూ దాసోజు, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఈ నెల 5న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) అధికారాలను ఉపయోగించి గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందా? అని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయం ముందుగా తేలాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. పిటిషన్లలో తమ తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా దాఖలు చేయాలని గవర్నర్ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. మరోవైపు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు, ఆదిత్య సోంధి, మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ గత ప్రభుత్వంలోని మంత్రివర్గం పేర్లను సిఫార్సు చేసిందని, వాటికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని విధాన మండళ్లలో సైతం ఆయా పార్టీలకు సంబంధించిన సభ్యులే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్నారని, ప్రజాజీవితంలో ఉన్నవారిని మంత్రివర్గాలు సిఫార్సు చేస్తాయని అన్నారు. ఆయా రంగాల్లో అభ్యర్థులు ప్రత్యేక కృషి చేయలేదనే కారణంతో తిరస్కరించడం సరికాదన్నారు. గవర్నర్‌కు ఉన్న అధికారాలపై న్యాయ సమీక్షకు అవకాశం ఉందని.. నబంరేబియా అండ్ బమంగ్, వీవీరావు వంటి అనేక సుప్రీం కోర్టు, ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పుల్లో ఇదే విషయం స్పష్టంగా ఉందని తెలిపారు. పిటిషనర్లను సిఫార్సు చేసిన స్థానాలపై గవర్నర్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
గవర్నర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద్‌కుమార్ వాదిస్తూ.. ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని.. ముందు విచారణార్హతను తేల్చాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ అధికారాలపై న్యాయ సమీక్షకు అవకాశం లేదన్నారు. విచారణార్హతపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. ప్రభుత్వం తరఫున సైతం అభ్యంతరాలను సమర్పిస్తామని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. లిఖితపూర్వకంగా అభ్యంతరాలను సమర్పించాలని గవర్నర్ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌లు ఈనెల 24న మరోసారి విచారణకు రానున్నాయి. కాగా, గవర్నర్ తీసుకున్న తిరస్కరణ నిర్ణయం విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడానికి అవకాశాలు చాలా పరిమితంగానే ఉంటాయని.. అయినా తుది తీర్పు ఇచ్చే వరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ కోసం వేచిచూడక తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా రెండు పేర్లను ప్రతిపాదించాలని భావిస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావులను ఎమ్మెల్సీలుగా నామినేట్‌చేయాలని యోచిస్తోంది.