Share News

Dharani : ధరణితో గోల్‌మాల్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:25 AM

ధరణి లోపాలు సామాన్యుడి గొంతు కోస్తున్నాయి. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరిగిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పట్టించుకోకుండా కేవలం రెవెన్యూ రికార్డుల ఆధారంగా ధరణి పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయడంతో చాలామంది ఇళ్ల ప్లాట్ల యజమానులు అన్యాయమై పోయారు. దశాబ్దాల క్రితం ప్లాట్లు కొనుక్కున్న సామాన్యులకు కంటి

 Dharani : ధరణితో గోల్‌మాల్‌

అమ్మిన భూముల్ని మళ్లీ అమ్మే అవకాశం

రెవెన్యూ రికార్డులకెక్కని రిజిస్టర్డ్‌ భూములు

తప్పుల రికార్డులతో ధరణి పోర్టల్‌ అప్‌డేట్‌

దీన్ని అవకాశంగా తీసుకొని లేఅవుట్ల కబ్జా

ఇదేరీతిన హయత్‌నగర్‌లో ఐదెకరాల ఆక్రమణ

లేఅవుట్‌ చెరిపేసి దానిపై మళ్లీ లేఅవుట్‌

ధరణి ఆధారంగా వేరే రియల్టర్‌కు రిజిస్ట్రేషన్‌

తాజాగా వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే బాగోతం

అండగా నిలిచిన అన్ని శాఖల అధికారులు

నెల రోజుల్లోనే లేఅవుట్‌కు హెచ్‌ఎండీఏ ఓకే

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ధరణి లోపాలు సామాన్యుడి గొంతు కోస్తున్నాయి. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరిగిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పట్టించుకోకుండా కేవలం రెవెన్యూ రికార్డుల ఆధారంగా ధరణి పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయడంతో చాలామంది ఇళ్ల ప్లాట్ల యజమానులు అన్యాయమై పోయారు. దశాబ్దాల క్రితం ప్లాట్లు కొనుక్కున్న సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ధరణి ఆవిర్భావం నుంచి జరుగుతున్న ఈ తమాషాకు తాజాగా హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు సమీపంలో జరిగిన భూదందా చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. అశాస్త్రీయంగా డబుల్‌ రిజిస్ట్రేషన్లను అనుమతించే వ్యవహారం వల్ల డబ్బులు పెట్టి కొనుక్కున్నాం.. ఇంట్లో రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్నాయన్న ధైర్యంతో ఉండలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. కొన్ని వేల ప్లాట్లకు సంబంధించి రెవెన్యూ రికార్డులు ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. మ్యుటేషన్‌ జరగకపోవడంతో ప్లాట్లు చేయడానికి ముందు వ్యవసాయ భూమిని అమ్మిన రైతు పేరిటే రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. ధరణి వచ్చాక దీన్ని అధికార పార్టీ నేతలు అవకాశంగా మార్చుకున్నారు. అధికారులను కట్టుకొని భూములను కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే లేఅవుట్లు వేసి ప్లాట్లుగా అమ్మిన భూములను మళ్లీ కొంటున్నారు. పాత లేఅవుట్లను చెరిపేసి, బలవంతంగా లేఅవుట్లు వేస్తున్నారు. రెవెన్యూ, సాగునీటి శాఖలు చేతిలో ఉండటంతో పనులు చకచకా పూర్తవుతున్నాయి. ఇదేం అన్యాయమని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే సివిల్‌ వ్యవహారం కోర్టుకు వెళ్లండని చెబుతున్నారు. కోర్టుల నుంచి నిలుపుదల ఉత్తర్వులు తెచ్చుకున్నా వాటిని గౌరవిస్తారని నమ్మకం లేదు.

రెవెన్యూ రికార్డుల్లో ఉంటే చాలు

హయత్‌నగర్‌ బస్టాండ్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో 1985లోనే అయిదెకరాల భూమిని లేఅవుట్‌ వేశారు. కుంట్లూరు చిన చెరువు శిఖంలో ఈ లేఅవుట్‌ ఉంది. గజం వంద రూపాయల చొప్పున 82 మంది ప్లాట్లు కొనుక్కున్నారు. ప్రస్తుతం అక్కడ భూమి గజం రూ.50 వేలు పలుకుతోంది. ప్లాట్లు కొనుక్కున్న వాళ్లు తమ పేర్ల మీద మ్యుటేషన్‌ చేయించుకోకపోవడంతో అవన్నీ రెవెన్యూ రికార్డుల్లో అమ్మిన రైతు పేరు మీదే ఉండిపోయాయి. ధరణికి ముందు వ్యవసాయ, వ్యవసాయేతర భూములన్నీ ఒకేచోట రిజిస్ట్రేషన్‌ జరిగేవి. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ జరగకుండా రిజిస్ట్రారే అన్ని జాగ్రత్తలు తీసుకొనే వారు. ధరణి వచ్చాక రెండూ వేర్వేరు చోట్ల జరుగుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో పేరుంటే మిగతావేవీ చూడకుండా రిజిస్ట్రేషన్‌ చేయడానికి ధరణి అనుమతిస్తుంది. రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేర్లను పరిగణనలోకి తీసుకొని వాటినే ధరణిలో ఎక్కించడంతో ఇప్పుడా ప్లాట్లు ఎప్పుడో కొనుక్కొని రిజిస్టర్‌ చేసుకొన్నా కూడా వివాదాస్పదంగా మారాయి. కుంట్లూరులో చాలా భూములకు ఇదే సమస్య ఉంది. వివాదాస్పద లేఅవుట్‌కు గతంలో భూమి అమ్మిన యజమాని కాలం చేశారు. ఆయన కుమారుడు స్థానికంగా బీఆర్‌ఎస్‌ నేత. ధరణిలోని లొసుగును అవకాశంగా తీసుకున్నాడు. ఇటీవలి వరకు ఎమ్మెల్యేగా ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతను ఆశ్రయించాడు. తన తండ్రి ఎప్పుడో జనాలకు అమ్మేసిన వ్యవసాయ భూమిని తిరిగి నల్గొండ నేత తమ్ముడి రియాల్టీ కంపెనీకి అమ్మేశాడు. వెంటనే చదును యంత్రాలను రంగంలోకి దించి లేఅవుట్‌ను చదును చేశాడు. చుట్టూ గోడ కట్టి కొత్త లేఅవుట్‌కు అనుమతులు కూడా తెచ్చుకున్నాడు. అధికారులు కూడా చెప్పినట్లు విన్నారు. చకచకా అన్ని ఫైళ్లు కదిలాయి. ఇలా రాష్ట్రంలో వందల లేఅవుట్లు ఇలా కబ్జాకు గురయ్యాయి. గతంలో వేసిన లేఅవుట్‌కు, అమ్మకాల్లో భాగంగా చేసిన రిజిస్ట్రేషన్లకు ఏ మాత్రం విలువ లేదని ధరణి తేల్చేసింది. గుడ్డిగా కొత్త లేఅవుట్లకు అనుమతి ఇస్తోంది.

శివబాలకృష్ణ హస్తం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇసుక దందా కింగ్‌పిన్‌గా పేరొందిన బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అండదండలతో కుంట్లూరు కబ్జా పర్వానికి తెరలేచ్చింది. మూడు నెలల క్రితం వరకు అధికారం ఉండడంతో ఆ సమయంలోనే రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులను గుప్పిట్లో పెట్టుకొని తమకు అనుకూలమైన కాగితాలను సృష్టించారు. ఎన్నో ఏళ్ల నాటి లేఅవుట్‌.. చెరువు, చెరువు శిఖం, ప్రభుత్వ భూమి అంటూ తేడా లేకుండా అన్నింటినీ చెరబట్టారు. తమ పలుకుబడితో నిబంధనలు తుంగలో తొక్కి కేవలం నెల రోజుల వ్యవధిలోనే డ్రాఫ్ట్‌ లేఅవుట్‌ తీసుకున్నారు. సుదీర్ఘకాలం హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న శివబాలకృష్ణ గత జూలైలో బదిలీ అయి రెరాకు వెళ్లిపోతున్నపుడు సంతకాలు చేసిన చివరి లేఅవుట్‌ అనుమతి ఫైళ్లలో ఇది ఒకటి. ఎన్నో ఏళ్లక్రితం కొనుగోలు చేసి, సరిహద్దు రాళ్లు పాతుకుని, ఇనుప కంచెలు వేసుకున్నా భద్రత లేకపోయింది. ఎలా లాగేసుకుంటారని ప్రశ్నిస్తే అధికార బలంతో వెళ్లగొట్టారు. కోర్టు నుంచి ఇంజంక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నా ఫలితం లేకపోయింది. పోలీసులు ఇది సివిల్‌ మేటర్‌ అంటూ మౌనం వహించారు.

చెరువులో రెండెకరాలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కుంట్లూర్‌ గ్రామంలో 174, 175, 176 సర్వే నెంబర్లలో 16.04 ఎకరాల భూమి ఉంది. 176 సర్వే నంబరులో అత్యధికంగా 12.37 ఎకరాల భూమి ఉంది. ఇందులో 10.37 ఎకరాలు చెరువు శిఖం పట్టా భూమి. 2 ఎకరాలు చెరువు కుంట. ధరణిలో ఇప్పటికీ 176/1 సర్వే నెంబర్‌ పేరుతో క్రయ, విక్రయ నిషేధిత జాబితాలో ఉంది. 174, 175, 176 సర్వే నెంబర్ల పరిధిలో 5.37 ఎకరాలను సురభి జగన్‌ మోహన్‌రెడ్డి జీవీ సుబ్బారావు అనే వ్యక్తికి 1985లో జీపీఏ చేశారు. సుబ్బారావు పంచాయతీ అనుమతులతో లేఅవుట్‌ వేసి, మొత్తం 82 ప్లాట్లను విక్రయించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు గజం వంద రూపాయల చొప్పున వాటిని కొనుగోలు చేశారు. 1985-1990 మధ్యకాలంలోరిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. ముందు జాగ్రత్తగా రాళ్లు పాతుకొని ఇనుప కంచెలు కూడా వేసుకున్నారు.

ధరణి రాకముందు సేఫ్‌

ధరణి రాకముందు వరకు ప్లాట్ల కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ధరణి వచ్చిన తర్వాతే భూములకు రెక్కలు వచ్చాయి. 5.37 ఎకరాల లేఅవుట్‌ రికార్డులు తారుమారు చేశారు. 174, 175 సర్వే నెంబర్లలో 3.07 ఎకరాలు ఉన్నాయి. 2020 జూన్‌ వరకు ధరణిలో భూ యజమాని కొడుకు పేరు మీద కేవలం 2.04 ఎకరాలు ఉంది. గజం రూ.50 వేల వరకు పలుకుతుండడంతో మాజీ ఎమ్మెల్యేతో కలిసి రికార్డులను తారుమారు చేశారు. 174, 175 సర్వే నెంబర్లలో 2.04 ఎకరాలకు హక్కు ఉండగా, తమ పలుకుబడితో మరో 1.03 ఎకరాలను ఎక్కించుకొని మొత్తం 3.07 ఎకరాలను సొంతం చేసుకున్నారు. 176/2/అ/3లోని సర్వే నెంబర్‌లో గతంలో లేఅవుట్‌ కోసం అమ్మిన 4.38 ఎకరాలను ఎక్కించి మొత్తం 8.05 ఎకరాలకు యజమాని అయ్యారు. మాజీ ఎమ్మెల్యే రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు మొత్తం భూమిని కట్టబెట్టారు. 40 ఏళ్ల క్రితం చేసిన లేఅవుట్‌, అందులోని ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ శాఖలో మాత్రం ఇప్పటికీ ప్లాట్లుగానే ఉన్నాయి. ధరణిలో 176/2/అ/3లోని 4.38 ఎకరాలు మాత్రమే హౌసింగ్‌ స్థలంగాచూపించారు. గతంలో లేఅవుట్‌ చేసినపుడు వదిలేసిన రెండెకరాలు కూడా కలుపుకోవడంతో ఇప్పుడు అక్కడ చెరువు, శిఖం అదృశ్యం అయ్యాయి.

ప్రభుత్వ భూమిలో రోడ్డు

1985లో లేఅవుట్‌ చేసినపుడు ఊళ్లో నుంచి 15 అడుగుల రోడ్డు వదిలారు. దానిపై కొత్త లేఅవుట్‌ చేయడానికి కుంట్లూరు-నాగోల్‌ ప్రధాన రహదారికి రావడానికి అనువైన రోడ్డే లేదు. (మాజీ) ఎమ్మెల్యే తమ్ముడు తమ 8.05 ఎకరాల వ్యవసాయ భూమికి రోడ్డు లేదని, భాగ్‌ హయత్‌నగర్‌ గ్రామ సర్వే నెంబర్‌ 208, 209లోని ప్రభుత్వ భూమి నుంచి రోడ్డు సౌకర్యం కల్పించాలని 2022 అక్టోబర్‌ 3న ఇబ్రహీంపట్నం ఆర్డీఓకు దరఖాస్తు చేశారు. 20 రోజుల వ్యవధిలోనే తహశీల్దార్‌, మండల సర్వేయర్‌ క్షేత్రస్థాయిలో సర్వే జరిపి.. రోడ్డు సర్వే జరిపి బాగ్‌ హయత్‌నగర్‌లోని సర్వే నెంబర్‌ 207లో రోడ్డుకు కొలతలు వేసి గుర్తించారు. లోకేషన్‌ స్కెచ్‌ ఆర్డీఓకు అందజేశారు. దాని ఆధారంగా కుంట్లూరు-నాగోల్‌ రోడ్డు నుంచి 40 అడుగుల వెడల్పుతో రోడ్డును ఉచితంగా రెవెన్యూ అధికారులు ఇచ్చారు. ఆరు గుంటల భూమి విలువ అక్కడ ఏకంగా రూ.7 కోట్లు ఉంటుంది. అది వ్యవసాయ భూమి అని, దానికి ప్రభుత్వ భూమిలో నుంచి రోడ్డు ఇవ్వాలంటూ 2022 అక్టోబరు 3న ఆదేశాలిచ్చిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ దానికి సరిగ్గా ఏడాది ముందు 2021 అక్టోబర్‌ ఐదవ తేదీన 174, 175, 176 సర్వే నంబర్లలోని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తూ (నెంబరు 2100927571) నాలా ఉత్తర్వులు ఇచ్చారు. లేఅవుట్‌ చేసుకోవడం కోసం ఇదే ఆర్డీవో వ్యవసాయేతరంగా మార్చారు. దారికోసం తిరిగి దాన్ని వ్యవసాయ భూమిగా అదే ఆర్డీవో వ్యవసాయ భూమిగా మార్చారు. వ్యవసాయేతర భూములకు లేఅవుట్‌ యజమాని డబ్బులు పెట్టి కొనుక్కోవాలి.

నెల రోజుల్లోనే అనుమతులు

కుంట్లూరులో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఓపెన్‌ లేఅవుట్‌ చేయడానికి మాజీ ఎమ్మెల్యే తమ్ముడి కంపెనీకి గత ఏడాది జూలై 20న హెచ్‌ఎండీఏ అనుమతించింది. జూన్‌ 6న దరఖాస్తు చేస్తే జూలై 20న ముసాయిదా లేఅవుట్‌కు పర్మిట్‌ నెంబర్‌ 000140తో అనుమతి వచ్చింది. హెచ్‌ఎండీఏ చరిత్రలో ఇంత వేగంగా అనుమతి వచ్చిన దాఖలాలు లేవు. చెరువు పక్కన లేఅవుట్‌ చేస్తే ఇరిగేషన్‌ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం అవసరం. వాళ్లే రెండు మూడు నెలల సమయం తీసుకుంటారు. సాధారణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అనుమతులివ్వాలి. నిజానికి అక్కడ లేఅవుట్‌ ఉంది. 82 మంది పొజిషన్‌లో ఉన్నారు. క్షేత్రస్థాయులో పరిశీలన చేసిన వారికి వెంటనే విషయం అర్థం అవుతుంది. ఇవేవీ చూడకుండా గుడ్డిగా అనుమతులు ఇచ్చేశారు. తమ ప్లాట్లను చెడగొట్టి, ధరణిలోని లొసుగులను అడ్డు పెట్టుకొని లేఅవుట్‌ వేస్తున్నారని 40 ఏళ్లుగా యజమానులుగా ఉన్నవారు హెచ్‌ఎండీఏకు ఫిర్యాదు చేసినా అప్పట్లో హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న శివబాలకృష్ణ పట్టించుకోలేదు. ఆయన్ను రెరా కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జూలై 12న రాగా అదే రోజు లేఅవుట్‌కు అనుమతులిచ్చిన్నట్లు తెలిసింది. కిందిస్థాయి అధికారులు జూలై 20న ఉత్తర్వులు జారీ చేశారు.

అన్యాయంగా లాక్కున్నారు

నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా 1985లోరూ.30 వేలతో 300 గజాలు కొన్నా. ఏడాది క్రితం వరకు మేమే పొజిషన్‌లో ఉన్నాం. పిల్లల పెళ్లిలు, భవిష్యత్తు కోసం పనికొస్తుందనుకున్నా. అన్యాయంగా లాక్కున్నారు. దానిమీదే కొత్త లేఅవుట్‌ వేశారు. ఫిర్యాదు చేస్తే హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. కోర్టుకెళ్ళాం. ఇంజంక్షన్‌ ఆర్డర్‌ కూడా తెచ్చాం. ఫలితం లేదు. మా ప్లాట్ల మీదే కొత్త అవుట్‌ డెవలప్‌ చేస్తున్నారు. మమ్మల్ని అక్కడికి రానివ్వకుండా సాయుధులను కాపలా పెట్టారు.

- సి.నర్సింహులు, రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి

చెరువు శిఖం... మునిగేదే

వ్యక్తుల పేరిట శిఖం పోగా రెండెకరాల చెరువు ఉంది. వర్షం వచ్చినపుడు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతోంది. గతేడాది చెరువు కట్ట కూడా తెగి మన్సూన్‌ కాలనీని ముంచెత్తింది. కాలనీవాసులంతా తలా ఇన్నీ డబ్బులేసుకొని చెరువు కట్టను పటిష్టం చేశారు. ఇప్పుడు చెరువులో కూడా లేఅవుట్‌ చేస్తే వర్షపు నీళ్లు దిగువన కాలనీలను ముంచెత్తడం ఖాయం. చెరువును కాపాడాలి. లేఅవుట్‌ అనుమతిని హెచ్‌ఎండీఏ రద్దు చేయాలి

- సంపూర్ణ విజయశేఖర్‌రెడ్డి,

పెద్ద అంబర్‌పేట వైస్‌ ఛైర్మన్‌

Updated Date - Feb 17 , 2024 | 04:25 AM