Share News

ఐదు స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వండి!

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:37 AM

కాంగ్రె్‌సతో కలిసి నడుస్తున్న సీపీఐ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటు ఇవ్వాలని పట్టుబడుతోంది.

ఐదు స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వండి!

కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద సీపీఐ ప్రతిపాదన

ఖమ్మం నుంచి పోటీ చేసే యోచనలో పార్టీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సతో కలిసి నడుస్తున్న సీపీఐ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటు ఇవ్వాలని పట్టుబడుతోంది. తమకు పట్టున్న ఐదు లోక్‌ సభ స్థానాలను కాంగ్రెస్‌ అదిష్ఠానం ముందు ఉంచి, వాటిలో ఏదో ఒకటి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ మేరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్‌పాషా తదితరులు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో ఇటీవల సమావేశమయ్యారు. ఇందులో కాంగ్రెస్‌ తరఫున సీట్ల సర్దుబాటు కమిటీ సభ్యుడు ముఖుల్‌ వాస్నిక్‌ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, వరంగల్‌, పెద్దపల్లి స్థానాల్లో ఏదో ఒకటి తమకు కేటాయించాలని, సీట్ల సర్దుబాటు విషయాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చాలని సీపీఐ నాయకులు కోరారు. అయితే, ఈ విషయమై రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడాలని సీపీఐ నేతలకు ఖర్గే సూచించారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌తో ప్రస్తావించగా.. సీట్ల కేటాయింపులు, సర్దుబాటు నిర్ణయం జాతీయ నాయకత్వం చేతుల్లోనే ఉంటుందని చెప్పారని వారు ఖర్గేకు వివరించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు గెలుపొందిన విషయం తెలిసిందే. సంస్థాగతంగా ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉండడంతో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో సీపీఐ ఉంది.

Updated Date - Feb 25 , 2024 | 11:05 AM