అర్హులందరికీ ‘ఉచిత విద్యుత్’ ఇవ్వండి
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:04 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రేషన్‌కార్డు ఉన్న అన్ని కుటుంబాలకూ వర్తింపజేయాలని మాజీ

60 లక్షల కుటుంబాలు స్కీంకు దూరం
సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ లేఖ
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రేషన్‌కార్డు ఉన్న అన్ని కుటుంబాలకూ వర్తింపజేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు.. సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. ప్రభుత్వం 30 లక్షల కుటుంబాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తోందన్నారు. దీంతో మిగిలిన 60 లక్షల కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. హైదరాబాద్‌లో 30 లక్షల పేద కుటుంబాలకు గాను 10 లక్షల కుటుంబాలకు ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారని.. దీంతో మిగతా వారికి నష్టం కలుగుతోందని తెలిపారు. పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే.. 90 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక, 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్లు ఇస్తున్నారని, ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా బిల్లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇది సరికాదని, 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి.. అదనంగా వినియోగించిన యూనిట్ల ధరను ప్రజల నుంచి వసూలు చేయాలని సూచించారు. ఒక రేషన్ కార్డులో పేరు ఉన్న వారు రెండు, మూడు కుటుంబాలుగా విడిపోయి బతుకుతున్నారని, వారందరినీ ఒకే కుటుంబంగా లెక్కించడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేయాలని హరీశ్ రావు కోరారు.