Share News

మేడిగడ్డపై జియోట్యూబ్‌ వాల్‌!

ABN , Publish Date - May 22 , 2024 | 05:25 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో దానికి ఎగువ భాగంలో జియోట్యూబ్‌ టెక్నాలజీతో కట్టను నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

మేడిగడ్డపై జియోట్యూబ్‌ వాల్‌!

జియోట్యూబ్‌ చుట్టూ గ్యాబియన్‌ బాక్సుల ఏర్పాటు.. 500 మీటర్ల పొడవు.. 2.5 మీటర్ల ఎత్తుతోతాత్కాలిక కట్ట

కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద కట్ట నిర్మాణం

రూ.10 కోట్ల వ్యయం అంచనా

నవంబరులో ప్రారంభం.. నెలలో పూర్తి

మేడిగడ్డ మరమ్మతు పనులు వచ్చే ఏడాది జూన్‌లో పూర్తయ్యే చాన్స్‌

నేడు ఇరిగేషన్‌ అధికారులతో

జియో ట్యూబ్‌ సంస్థల ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో దానికి ఎగువ భాగంలో జియోట్యూబ్‌ టెక్నాలజీతో కట్టను నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. జియోట్యూబ్‌ టెక్నాలజీలో.. ఇసుకను నింపిన ట్యూబ్‌ చుట్టూ రక్షణగా గ్యాబియన్‌ బాక్సులు (రాళ్లతో నింపిన కంచె) ఏర్పాటు చేయనున్నారు. పలు దేశాల్లో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దేశంలో ప్రధానంగా బ్రహ్మపుత్ర బేసిన్‌లో వరదల నివారణకు కరకట్టలుగా జియోట్యూబ్‌లను వినియోగిస్తున్నారు. గోదావరి వరదల నివారణపై అధ్యయనం చేయడానికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు బ్రహ్మపుత్ర బేసిన్‌లో పర్యటించిన సమయంలో దీనిని గుర్తించారు. ఇప్పుడు మేడిగడ్డకు ఎగువన వాటిని నిర్మించాలని ప్రతిపాదించారు. మేడిగడ్డ బ్యారేజీలో నిల్వ చేసే నీటిని ఎత్తిపోయడానికిగాను బ్యారేజీకి 17 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి పంప్‌హౌ్‌సను నిర్మించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఈ పంప్‌హౌస్‌ వద్దే జియోట్యూబ్‌ కట్టను నిర్మించి అక్కడి నుంచే నీటిని పంప్‌హౌ్‌సకు మళ్లించనున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ ప్రాంతంలో గోదావరి నది 500 మీటర్ల పొడవు దాకా ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో 500 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల ఎత్తుతో కట్టను నిర్మించనున్నారు. దీనికోసం రూ.10 కోట్ల దాకా వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. సాధారణంగా గోదావరికి అక్టోబరు-నవంబరు దాకా భారీగా వరదలు ఉంటాయి. ఆ సమయంలో బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా.. వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతుంటారు. ఆ సమయంలో వచ్చే భారీ వరదను అడ్డుకొని, నింపే సామర్థ్యం బ్యారేజీలకు ఉండదు. బ్యారేజీల నిర్మాణం కూడా వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు పంపిస్తూ.. వరద తగ్గుముఖం పట్టాక నీటిని నిల్వ చేసి మళ్లించడానికి ఉద్దేశించిందే. కానీ, మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న నేపథ్యంలో పునరుద్ధరణ పనులు చేపట్టడానికి నవంబరు తర్వాతే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది నవంబరులో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తే.. 2025 జూన్‌లోపు పూర్తయ్యే అవకాశాలుంటాయి. దీంతో ఈలోగా జియోట్యూబ్‌ టెక్నాలజీతో తాత్కాలిక కట్టను నిర్మించి, యాసంగి అవసరాలకు నీటిని వినియోగించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.


వరదలు తగ్గుముఖం పట్టాక కట్ట నిర్మాణం..

గోదావరికి వరదలు ఏటా జూన్‌ నెలాఖరు, జూలైలో మొదలై అక్టోబరు, నవంబరు దాకా కొనసాగుతాయి. దీంతో అక్టోబరు, నవంబరులో వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత.. తాత్కాలిక జియోట్యూబ్‌ కట్ట నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇసుక నింపిన ట్యూబులను మధ్యలో పేర్చి, చుట్టూ రాళ్లతో నింపిన ఇనుప కంచెల బాక్సులను రక్షణగా ఏర్పాటు చేయనున్నారు. ఈ టెక్నాలజీతో కలిగే ప్రయోజనంపై బుధవారం జియో ట్యూబ్‌ సంస్థలకు చెందిన ప్రతినిధులు నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. కట్ట నిర్మాణం కోసం అయ్యే వ్యయం అంచనాలు తెప్పించుకొని, బోర్డు ఆఫ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ (బీవోసీఈ)లో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని నీటిపారుదల శాఖ యోచిస్తోంది. కాగా, పంప్‌హౌస్‌ వద్దే 2.5 మీటర్లతో కట్ట నిర్మిస్తే.. పంపులకు అవసరమైన నీరు అందుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసే చోట దిగువనే కన్నెపల్లి పంప్‌హౌస్‌ ఉంది. దీనికి వరదల సమయంలో నేరుగా నీరందే అవకాశం ఉన్నప్పటికీ.. వరదలు తగ్గుముఖం పట్టగానే మేడిగడ్డలో నిల్వ చేసి.. బ్యాక్‌ వాటర్‌ను పంపింగ్‌ చేసేవారు. కానీ, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కాకపోవడంతో జియో ట్యూబ్‌ టెక్నాలజీతో కట్ట నిర్మాణం చేపడుతున్నారు. అంతా సవ్యంగా జరిగి నవంబరులో నిర్మాణ పనులు ప్రారంభిస్తే.. డిసెంబరులో పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. 2025 జూన్‌ లేదా జూలై వరకు పంపింగ్‌ పూర్తి చేశాక.. ఈ కట్టను తొలగిస్తారు. ఏటా జూన్‌లో లేదా జూలైలో భారీ వరదలు వస్తే.. తాత్కాలిక కట్ట అంతా కొట్టుకుపోయే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం. ఈలోగా మేడిగడ్డ పునరుద్ధరణ పూర్తికాకపోతే తొలగించిన ట్యూబ్‌లు, గ్యాబియన్‌ బాక్సులతో మళ్లీ కట్టను నిర్మిస్తారు. తొలగించి..మళ్లీ మళ్లీ వినియోగించుకునే అవకాశంతోపాటు దాదాపు 30-40 ఏళ్లపాటు ట్యూబ్‌లను వాడుకునే వెసులుబాటు ఉండడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత అని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాతో పాటు వివిధ దేశాల్లో వీటి వినియోగం సమర్థంగా ఉండటంతో రాష్ట్రంలోనూ మేడిగడ్డలో వీటిని వినియోగించాలని నిర్ణయించారు.

బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు..

తాత్కాలిక కట్ట నిర్మాణం జరిపేలోగానే మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు (పునాది కింద బొరియలు మూసే పని) చేపట్టనున్నారు. బ్యారేజీ సీపేజీలకు ఈ బొరియలే కారణమని అధికారులు ఇప్పటికే గుర్తించారు. గ్రౌండ్‌ పెనట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌), ఎలకో్ట్ర రెసిస్టివిటీ టెస్ట్‌ (ఈఆర్‌టీ) పరీక్షల నివేదికలు ప్రభుత్వం వద్ద ఉండటంతో వాటి ఆధారంగా బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు చేయనున్నారు. కాగా, బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోవడంతో ఆ బ్లాకు స్థానంలో కొత్త బ్లాకు నిర్మించాలా? లేక కుంగిన పిల్లర్లు తొలగించి, కొత్త పిల్లర్లు నిర్మించాలా? అనే దానిపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల పూర్తి నివేదికలో తేలనుంది. అంతేకాకుండా బ్యారేజీల స్థితిగతులపై కేంద్ర సంస్థలు చేసే అధ్యయనం ద్వారా కూడా స్పష్టత రానుంది.

ఆ రెండు బ్యారేజీలపైనా ఫుల్‌ ఫోకస్‌

కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపైనా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఈ సీజన్‌లో వీటి మరమ్మతులు పూర్తిచేసి, అక్టోబరులో ప్రధాన గోదావరికి వరద తగ్గుముఖం పట్టిన తర్వాత బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఆ సమయంలో అన్నారంలో 11 మీటర్ల దాకా, సుందిళ్లలో 9 మీటర్ల దాకా నీటిని నిల్వ చేసుకుంటే పంపింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా యాసంగి పంటల సాగుతోపాటు వేసవిలో తాగునీటి అవసరాలకు ఈ నీటిని వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Updated Date - May 22 , 2024 | 05:25 AM