ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాలి
ABN , Publish Date - Oct 15 , 2024 | 11:12 PM
సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్
సిద్దిపేట టౌన్, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): ప్రతిరోజూ ప్రతి ఇంటి నుంచి తడి, పొడి, హానికర చెత్తను వేరువేరుగా సిబ్బంది తప్పకుండా సేకరించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్ ఆదేశించారు. సిద్దిపేట పటణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంటింటి చెత్త సేకరణ చేసే మున్సిపల్ వాహనాల డ్రైవర్లతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణంలో ఇంటింటి చెత్త సేకరణలో ముఖ్యపాత్ర పోషించే చెత్త వాహనాల డ్రైవర్లు, సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలో హాజరు తీసుకున్న అనంతరం వెంటనే వార్డుల్లో చెత్త సేకరణకు వెళ్లాలని ఆదేశించారు. సరైన సమయానికి వార్డులలోకి వెళ్తేనే పట్టణ నివాసితులు చెత్తను వేరు చేసి వాహనానికి ఇస్తారన్నారు. అన్ని వాహనాల ఫిట్‌నెస్‌ను చెక్ చేపించాలని సిబ్బందిని ఆదేశించారు. వాహనాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్న సమయంలో ప్రతీరోజు ప్రతి వార్డులో 10 గృహాల నుంచి చెత్త సేకరణ చేసినట్లుగా వారి వద్ద నుంచి సంతకాలు పుస్తకంలో సేకరించాలని సూచించారు. సమావేశంలో డీఈ ప్రేరణ, సానిటరీ ఇన్స్‌పెక్టర్ మాధవి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.