Share News

నిండు జీవితాలు పల్టీ!

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:21 AM

ఎంత ఘోర రోడ్డు ప్రమాదమో!? జరిగిన తీరు స్ఫురణకొస్తే ఒళ్లంతా గగుర్పాటు.. మనసంతా బాధతో కకావికలం!! రోడ్డుపై దూసుకెళుతున్న కారొకటి.. ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్‌టేక్‌ చేసేయత్నంలో డివైడర్‌ను ఢీకొట్టి

నిండు జీవితాలు పల్టీ!

డివైడర్‌ను ఢీకొని ఆవలివైపు పడ్డ కారు.. పల్టీకొట్టిన ఆ కారును ఢీకొన్న లారీ

850 అడుగుల దూరం ఈడ్చుకెళ్లిన వైనం

కారు నుజ్జునుజ్జు.. ఆరుగురి దుర్మరణం

మృతుల్లో ఇద్దరు చిన్నారులు.. మిర్యాలగూడలో ఘోరం

దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన

మిర్యాలగూడ అర్బన్‌, జనవరి 29: ఎంత ఘోర రోడ్డు ప్రమాదమో!? జరిగిన తీరు స్ఫురణకొస్తే ఒళ్లంతా గగుర్పాటు.. మనసంతా బాధతో కకావికలం!! రోడ్డుపై దూసుకెళుతున్న కారొకటి.. ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్‌టేక్‌ చేసేయత్నంలో డివైడర్‌ను ఢీకొట్టి ఆవలివైపు పల్టీకొట్టింది. ఆవైపున వెళుతున్న లారీ, ఆ పాల్టీకొట్టిన కారును ఢీకొట్టింది. ఇంత బీభత్సమైన ప్రమాదంలో కారు లోపల ఉన్నవారిలో ఎవరు గనక ప్రాణాలతో మిగులుతారు? కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి ఆరుగురూ మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు పదేళ్లలోపు చిన్నారులుండటం మరీ విషాదం. ఆదివారం అర్ధరాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన వారు. దైవదర్శనం చేసుకొని మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి ఆరుగురూ తిరిగిరానిలోకాలకు వెళ్లడంతో బంధువులు కంటికీమంటికీ ధారగా రోదిస్తున్నారు. నుజ్జునుజ్జయిన కారు.. ఛిద్రమైన మృతదేహాలు.. రోడ్డుపై నెత్తుటి మరకలతో ప్రమాదస్థలి బీభత్సంగా మారింది. డీఎస్పీ వెంకటగిరి వెల్లడించిన వివరాల ప్రకారం... మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన చెరుపల్లి మహేశ్‌, ఆయన కుటుంబసభ్యులు, ఆయన తోడల్లుడు బొమ్మ మచ్చేందర్‌, ఆయన కుటుంబసభ్యులు, మహేశ్‌ మరో ఇద్దరు స్నేహితుల కుటుంబసభ్యులు రెండు వేర్వేరు కార్లలో ఈనెల 26న మిర్యాలగూడ నుంచి ఆధ్యాత్మిక, విహార యాత్రకు బయలుదేరారు. ఏపీ రాష్ట్రంలోని పెనుగంచిప్రోలు, విజయవాడ, మోపిదేవి, కోటప్పకొండ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. మచిలీపట్నం బీచ్‌లో కాసేపు సరదాగా గడిపి.. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. అద్దంకి-నార్కట్‌పల్లి మధ్యలో దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద దాబాలో భోజనం చేశారు. అనంతరం అక్కడి నుంచి అంతా బయలుదేరారు. నందిపాడులోని మహేశ్‌ ఇంటికి మరికొద్దిసేపట్లో చేరుకుంటారనగా ఘోరం జరిగింది. మిర్యాలగూడలోని కృష్ణమాసన కాలనీ వద్ద అద్దంకి- నార్కట్‌పల్లి రోడ్డుపై మహేశ్‌, మశ్చేందర్‌ కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ముందుగా వెళ్తున్న ఓ లారీని మహేశ్‌ ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వేగంలోనే డివైడర్‌ను దాటుకొని పల్టీకొట్టింది. అదే సమయంలో మిర్యాలగూడ నుంచి ఏపీ రాష్ట్రం గుంటూరు వైపు వెళ్తున్న పొట్టులారీ, కారును వేగంగా ఢీకొట్టి సుమారు 50 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మహేశ్‌ (32), ఆయన భార్య జ్యోతి (30) కుమార్తె రిషిత(6), యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లి గ్రామానికి చెందిన ఆయన తోడల్లుడు మచ్చేందర్‌ (29), కుమారుడు లియాన్స్‌ (2)తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మచ్చేందర్‌ భార్య మాధవి (24)ని స్థానికుల సాయంతో పోలీసులు తొలుత ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మాధవి కూడా మృతిచెందింది. దైవదర్శనం కోసం వెళ్లిన రెండు కుటుంబాలు విగతజీవులుగా మారడాన్ని స్థానికులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వస్థలాలకు తరలించగా, రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.

Updated Date - Jan 30 , 2024 | 03:21 AM