Share News

‘హెల్త్‌ డ్రింక్స్‌’ నుంచి.. బోర్న్‌విటా ఔట్‌!

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:27 AM

కేంద్ర ప్రభుత్వం బోర్న్‌విటాకు, ఆ తరహా ఉత్పత్తులకు ఝలక్‌ ఇచ్చింది. వాటిని ఆరోగ్య పానీయాల (హెల్త్‌ డ్రింక్స్‌) విభాగం నుంచి తొలగించాలని ఈ-కామర్స్‌ సంస్థలను ఆదేశించింది....

‘హెల్త్‌ డ్రింక్స్‌’ నుంచి.. బోర్న్‌విటా ఔట్‌!

ఆ తరహా ఇతర ఉత్పత్తులు, డ్రింక్స్‌, బేవరేజెస్‌ను కూడా తొలగించాల్సిందే

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం ఆదేశం

బాలల కమిషన్‌ సిఫారసులతో నిర్ణయం

బోర్న్‌విటాలో అధిక చక్కెర స్థాయులు!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: కేంద్ర ప్రభుత్వం బోర్న్‌విటాకు, ఆ తరహా ఉత్పత్తులకు ఝలక్‌ ఇచ్చింది. వాటిని ఆరోగ్య పానీయాల (హెల్త్‌ డ్రింక్స్‌) విభాగం నుంచి తొలగించాలని ఈ-కామర్స్‌ సంస్థలను ఆదేశించింది. బోర్నవిటాలో సగానికి సగం చక్కెరే ఉంటోందని ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత, ప్రమాణాల (ఎఫ్‌ఎ్‌సఎస్‌) చట్టం-2006 ‘హెల్త్‌ డ్రింక్‌’ అని దేన్నీ నిర్వచించలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే భారత ఎఫ్‌ఎ్‌సఎస్‌ ప్రాధికార సంస్థ కానీ, బోర్న్‌విటా, క్యాడ్బరీతో పాటు పలు ప్రముఖ బ్రాండ్ల యాజమాన్య సంస్థ ‘మాండెలెజ్‌ ఇండియా’ కానీ సమర్పించిన నిబంధనల్లోనూ ‘హెల్త్‌ డ్రింక్‌’కు నిర్వచనం లేదని తెలిపింది. ఈ విషయం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) నిర్వహించిన విచారణలో నిర్ధారణ అయిందని పేర్కొంది. దాని సిఫారసు ప్రకారం నిర్ణయం తీసుకున్న కేంద్రం... అన్ని ఈ-కామర్స్‌ సంస్థలు తమ పోర్టళ్లలో బోర్నవిటా సహా ఇతర పానీయాలను (డ్రింక్స్‌/బేవరేజెస్‌) ‘హెల్త్‌ డ్రింక్స్‌’ క్యాటగిరీ నుంచి తొలగించాలని ఆదేశించింది. గత ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్సీపీసీఆర్‌ బోర్న్‌విటాకు మొట్టికాయ వేసింది. తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలు, ప్యాకేజింగ్‌, లేబుళ్లను ఉపసహరించుకోవాలని ఆదేశించింది. దీనికి కారణం ‘ఫుడ్‌ఫార్మర్‌’గా పేరొందిన రేవంత్‌ హిమత్‌సింగ్‌కా యూట్యూబ్‌ వీడియో! పిల్లలకు బలవర్థకమైందన్న నమ్మకంతో కొన్ని దశాబ్దాలుగా వాడుతున్న బోర్న్‌విటాపై ఆ వీడియో గగ్గోలు పుట్టించింది. ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువల గురించి బోర్న్‌విటా కంపెనీ ప్రకటనలు అబద్ధమని ఆ వీడియోలో హిమత్‌సింగ్‌కా ఆరోపించారు. బోర్న్‌విటాలో సగానికి సగం చక్కెర ఉంటోందని పేర్కొన్నారు. అంతేకాక కోకో సాలిడ్స్‌, కలరెంట్ల వల్ల పిల్లలు క్యాన్సర్‌ సహా తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు మీడియా కథనాలను ఎన్సీపీసీఆర్‌ పరిగణనలోకి తీసుకుని విచారణ నిర్వహించింది. బోర్న్‌విటాలో చక్కెర శాతం పరిమితికి మించి ఉందని గుర్తించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట బోర్న్‌విటాలో చక్కెరను 15 శాతం తగ్గిస్తున్నట్టు మాండెలెజ్‌ సంస్థ ప్రకటించింది. ఈ తగ్గింపు తక్కువే అయినప్పటికీ తమకు గొప్ప విజయమని హిమత్‌సింగ్‌కా అన్నారు. తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగిందని, వారు బోర్న్‌విటాలాంటి ఉత్పత్తులపై లేబుళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. కాగా, పిల్లలు రోజువారీ తీసుకోవాల్సిన చక్కెర పరిమితి కంటే బోర్న్‌విటాలో తక్కువే ఉందని మాండెలెజ్‌ కంపెనీ ఇదివరకే ఓ ప్రకటన చేసింది. బోర్న్‌విటాలో రోగ నిరోధకతను పెంచే విటమిన్‌ ఏ, సీ, డీ, ఐరన్‌, జింక్‌, కాపర్‌, సెలీనియం ఉన్నాయని పేర్కొంది.

Updated Date - Apr 14 , 2024 | 03:27 AM