Share News

వే బ్రిడ్జి తూకంలో మోసం

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:39 AM

: రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేయడంలో వే బ్రిడ్జి నిర్వాహకుడి మోసం బయట పడింది.

వే బ్రిడ్జి తూకంలో మోసం
అమ్మనబోలులో రాస్తారోకో చేస్తున్న రైతులు

ధాన్యం తూకంలో 200 కిలోల తేడా

అనుమానంతో మళ్లీ తూకం వేయించిన రైతులు

నార్కట్‌పల్లి, ఏప్రిల్‌ 4: రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేయడంలో వే బ్రిడ్జి నిర్వాహకుడి మోసం బయట పడింది. ధాన్యం తూకంలో 200 కిలోల తేడా ఉండడంతో అనుమానం వచ్చిన రైతు మళ్లీ తూకం వేయించడంతో గుట్టు రట్టయింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలులో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. జంగిలి నర్సింహ అనే వ్యాపారి అమ్మనబోలులో ధాన్యం కొనుగోలు చేస్తూనే మరోపక్క అరుణ వే బ్రిడ్జి కూడా నిర్వహిస్తున్నాడు. రైతులు విక్రయించేందుకు తెచ్చిన ధాన్యాన్ని తన వే బ్రిడ్జి వద్దే తూకం వేసి కొనుగోలు చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు తన పొలంలో పండిన ధాన్యాన్ని బుధవారం నర్సింహ దగ్గరకు తీసుకువచ్చి కాంటా వేయించగా 7,830కిలోలు చూపించింది. తాను అంచనా వేసిన దానికంటే తక్కువ తూకం రావడంతో రైతుకు అనుమానం వచ్చింది. వెంటనే అదే ధాన్యం లోడును అక్కెనపల్లిలో ఉన్న చెన్నకేశవ వే బ్రిడ్జి వద్ద మరోసారి కాంటా వేయించగా 8,030 కిలోలుగా చూపించింది. దీంతో 200కిలోలు (రెండు క్వింటాళ్లు) ఽధాన్యం తక్కువ తూకంతో నష్టపోతున్నట్లు గుర్తించి ఇదే విషయాన్ని తోటి రైతులకు చెప్పాడు. అందరూ కలిసి అరుణ వే బ్రిడ్జి వద్దకు వెళ్లి తక్కువ తూకంపై నిలదీయగా నిర్వాహకుడు పొంతన లేని సమాధానం ఇచ్చాడు. దీంతో రైతులు ఇంద్రారెడ్డి, మల్లయ్యలతో మరికొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వే బిడ్ర్జిపై చర్యలు తీసుకోవాలని రైతుల ధర్నా

తక్కువ తూకంతో రైతులను మోసం చేస్తున్న వే బ్రిడ్జి నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతులు అమ్మనబోలులో గురువారం కొద్దిసేపు రాస్తారోకో చేశారు. చాలా కాలం నుంచి రైతులను మోసం చేస్తున్నాడని, తాము గ్రహించలేదని ఆవేదన చెందారు. అసలే ధాన్యం దొంగతనాలతో తాము బెంబేలెత్తుతుంటే ఈ రకమైన దోపిడీ చేస్తున్నారని, తాము ఏం చేయాలని ఆవేదన వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన జిల్లా లీగల్‌ మెట్రాలజీ(తూనికలు కొలతల శాఖ) అధికారి రామకృష్ణతో పాటు నార్కట్‌పల్లి తహసీల్దార్‌ ఎల్‌.వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ ఎన్‌.అంతిరెడ్డి అమ్మనబోలుకు వెళ్లారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ వే బ్రిడ్జిని తనిఖీ చేశారు. క్వింటాల్‌ పరిమాణానికి సుమారు ఐదు కిలోల మేర తక్కువ తూకం వస్తున్నట్లు నిర్థారించారు. లీగల్‌ మెట్రాలజీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపారు.

వే బిడ్రి నిర్వాహకులపై కేసు నమోదు

అమ్మనబోలులో రైతు ధాన్యం తూకంలో మోసానికి పాల్పడిన నిర్వహ కులపై కేసు నమోదైంది. రైతు ఫిర్యాదు మేరకు వేబ్రిడ్జి నిర్వాహకులు నర్సింహ, కార్తీక్‌, శ్రీహరిపై కేసు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ అధికారి రామకృష్ణ తెలిపారు.

Updated Date - Apr 05 , 2024 | 12:39 AM