Share News

హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ రద్దు

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:54 AM

హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ కార్ల రేస్‌ రద్దయింది.

హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ రద్దు

ప్రకటించిన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్స్‌

ప్రభుత్వం నుంచి స్పందన లేదని వెల్లడి

రద్దు తిరోగమనమే: కేటీఆర్‌ విమర్శ

ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు: కాంగ్రెస్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ కార్ల రేస్‌ రద్దయింది. ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌ఐఏ) ప్రకటించింది. ఫిబ్రవరి 10న రేస్‌ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అక్టో బరు 23న ఒప్పందం చేసుకున్నామని, అయితే, నోటీసులేమీ ఇవ్వకుండానే మున్సిపల్‌ శాఖ రద్దు చేసిందని ఎఫ్‌ఐఏ తెలి పింది. ఒప్పందం అతిక్రమించి నందుకు మున్సిపల్‌ శాఖకు లీగల్‌ నోటీసులు ఇస్తామని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు మరో మార్గం లేదని, రేసింగ్‌ వేదిక, నిర్వహణకు వర్తించే చట్టాల ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలనేదానిపై పరిశీలిస్తున్నామని, ఈ విషయంలో అన్ని హక్కులు ఉన్నాయని ఎఫ్‌ఐఏ ప్రతినిధులు వివరించారు. ఈ నెల 13 నుంచి మొదలయ్యే ఫార్ములా ఈ- వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సీజన్‌ 10 క్యాలెండర్‌లో టోక్యో, షాంఘై, బెర్లిన్‌, మొనాకో, లండన్‌ నగరాలు వేదికలుగా ఉన్నాయని తెలిపారు. ఫార్ములా ఈ సహ-వ్యవస్థాపకుడు అల్బెర్టో లాంగో మాట్లాడుతూ హైదరాబాద్‌ రేస్‌ రద్దు ప్రకటన భారత్‌లోని రేసింగ్‌ అభిమానులకు నిరాశ కలిగించిందని తెలిపారు. కాగా, గత ఏడాది ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా కార్‌ రేస్‌ నిర్వహణ, ఏర్పాట్లకు ప్రమోటర్‌ గా ఓ సంస్థ ముందుకొచ్చింది. ట్రాక్‌ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5 కోట్ల వరకు అప్పటి ప్రభుత్వం భరించింది. మిగతాది ప్రమోటర్‌ సంస్థనే చూసుకుంది. అయితే, ఈ ఫిబ్రవరి 10 నాటి రేస్‌కు ఏ సంస్థా ముందుకు రాలేదని తెలిసింది. ట్రాక్‌, రేసింగ్‌ నిర్వహణ, ఇతర ఏర్పాట్లు, మార్కెటింగ్‌, వివిధ దేశాల రేసర్లకు సౌకర్యాల కల్పన అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు రూ.200 కోట్లు అవుతుందని అంచనా. దీనికోసం హెచ్‌ఎండీఏ గత సర్కారు ఆదేశాలతో ఓ నిర్మాణ సంస్థకు రూ.50 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం.

రూ.150 కోట్లు భరించే ఉద్దేశం లేకనే..

గత ప్రభుత్వం చెల్లించినది పోగా.. ఫార్ములా రేస్‌ నిర్వహణకు రూ.150 కోట్లను ప్రస్తుత సర్కారు భరించాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలో ఖజానా దివాలా తీసిందని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో రేస్‌ వ్యయాన్ని భరించే ఉద్దేశం లేకనే ప్రభుత్వం స్పందించలేదని సమాచారం. కాగా, రేస్‌ జరిగే సమయంలో హుస్సేన్‌సాగర్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ పేరుతో ఎన్టీఆర్‌ గార్డెన్‌ చుట్టూరా 2.7 కిలోమీటర్ల ట్రాక్‌, అందులో రేస్‌తో పరిసర ప్రాంతాల్లో వారం పాటు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయి. దీనిపై నిరుడు పోటీల సందర్భంగా ప్రజల నుంచి పెద్దఎత్తున విమ ర్శలు వచ్చాయి. నగరం నడిబొడ్డున పోటీలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కాగా, హుస్సేన్‌సాగర్‌ తీరాన జరుపుతారా? లేక నగరం అవతలనా? అనే సందేహాల రీత్యా కూడా రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ఎఫ్‌ఐఏ తెలిపింది. రేస్‌ రద్దు కాంగ్రెస్‌ ప్రభుత్వ తిరోగమన విధామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శిం చారు. ఈ ప్రిక్స్‌తో ప్రపంచంలో తెలంగాణ బ్రాండ్‌ విలువ పెరుగుతుందని, రద్దు నిర్ణయాలు సరికాదన్నారు. ఫార్ములా రేస్‌తో ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ పేర్కొన్నారు. గతంలో నిర్వహించినపుడు ప్రజలు ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందిపడ్డారని పేర్కొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 03:54 AM